రఘునందన ‘శ్వాస, ధ్యాస’ చేనేత వ్రస్తాలే
మూడు దశాబ్దాలుగా చేనేతపై ప్రచారం
చేనేత ఉత్పత్తులే కానుకలుగా
నేడు జాతీయ చేనేత దినోత్సవం
డియర్ సార్.. ప్లీజ్ ‘వీ ఆర్ హ్యాండ్లూమ్’ అంటూ పలకరించే తమ స్నేహితుడి కోసం చేనేత వ్రస్తాలను ధరించే వారు కొందరైతే, వీఆర్ హ్యాండ్లూమ్.. బీ హ్యాండ్సమ్ అని చెబితే గానీ, చేనేత వస్త్ర ధారణ పై తమకు మక్కువ కలగలేదనే వారు మరి కొందరు. చేనేత వస్త్ర ప్రియుడిగా, ప్రోత్సాహకుడిగా తన ఉనికిని చాటుకునే మాచన రఘునందన వృత్తిరీత్యా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పౌర సరఫరాల శాఖలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్. చేనేత పట్ల ఆయనకున్న కమిట్‌మెంట్‌పై పలు విశేషాలు.. – సాక్షి,సిటీబ్యూరో
మూడు దశాబ్దాలుగా చేనేత వస్త్రాలు మాత్రమే ధరిస్తూ చేనేత వ్రస్తాలపై విస్తత ప్రచారం చేస్తున్నారు. ‘చేనేత వస్త్రాలను ధరించండి.. నేతన్నను ఆదరించండి’. అంటూ తన మిత్రులు, సహచర ఉద్యోగులు హ్యాండ్లూమ్ బట్టలు ధరించేలా ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణ పద్మశాలి అఫీషియల్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్‌లో కీలకపాత్ర పోషిస్తూ చేనేత వ్రస్తాలకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగా ప్రచారం కలి్పస్తున్నారు. హ్యాండ్లూమ్‌కు తన దైనందిన జీవితంలో అత్యంత ప్రాధాన్యతనివ్వడంతో ఆదర్శ ప్రాయంగా మారారు.
చదువుకునే రోజుల నుంచే..
మాచన రఘునందన చదువుకునే రోజులనుంచే చేనేత వ్రస్తాలు ధరించడం ఆరంభించారు. తన వివాహ సమయంలో కూడా చేనేత వ్రస్తాలను మాత్రమే విధిగా ఉండేలా నిబంధన పెట్టి సఫలీకృతమయ్యారు. చేనేత ఉపయోగాలను జనబాహుళ్యానికి తెలిసేలా తన దైనందిన జీవితంలో అనుదినం చేనేత వ్రస్తాలనే ధరిస్తూ వస్తున్నారు. చేతిరుమాలు, తువ్వాలు, లుంగీలు, ఇలా ప్రతిదీ చేనేతనే ఉపయోగిస్తారు. తాను చేనేత వ్రస్తాలను ధరించడమే కాకుండా కుటుంబ సభ్యులను, తోటివారిని, ఇరుగు పొరుగు వారిని సైతం చేనేతనే వినియోగించేలా అవగాహన కల్పిస్తున్నారు.
ఇంట్లోని దుప్పట్లు, మొదలు వివిధ రకాల అలంకరణ వ్రస్తాలను సైతం చేనేతవే వినియోగిస్తుంటారు. ఇక పుట్టినరోజు, వివాహాది శుభకార్యాలకు కానుకలుగా చేనేత ఉత్పత్తులనే అలంకార వస్తువులుగా తయారు చేయించి ఇస్తుండడం ఆయన ప్రత్యేకత. ఏటా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఉన్నతాధికారులను చేనేత తువ్వా ళ్లతో సత్కరించడం ఆయన ఆనవాయితీ. మిత్రుల వివాహాది శుభకార్యాలకు హ్యాండ్లూమ్ షోరూంను సందర్శించేలా చేసి, నచ్చిన వస్త్రాలు తక్కువ ధరలకు లభ్యమయ్యేలా ప్రోత్సహిస్తున్న తీరును ప్రత్యక్షంగా వివరిస్తున్నారు. హ్యాండ్లూమ్‌ను ఆదరిస్తే.. ఒక నేత కార్మికుడి కుటుంబాన్ని ఆదుకున్నట్లేనని ఆయన అభిప్రాయం. మిత్రులు కలిసిన సందర్భంగా డియర్ ఫ్రెండ్.. వీఆర్ హ్యాండ్లూమ్ అంటూ కరచాలనం చేయడం ఆయన ప్రత్యేకత.
Comments
Please login to add a commentAdd a comment