
పండగే... సంతోషం
హ్యాపీ కుటుంబం
అమ్మకు బెల్లం అరిసెలు ఇష్టం. నాన్నకు చక్కెర అరిసెలు మక్కువ. ఇద్దరూ వాదులాడుకోరు. ‘రెండూ చేస్తాలే ఈసారి’ అని నానమ్మ అంటే ‘సరే’ అని నవ్వుతారు. మిగిలిన పండుగలకు పట్టింపు లేదు. కాని సంక్రాంతికి మాత్రం పిండి వంటలు చేసి తీరాల్సిందే. ఇంట్లో పొయ్యి మీద బాండిలి, అందులో కాగే నూనె, దాని నుంచి వచ్చే చర్రుమనే చప్పుడూ... ఇవి లేకపోతే పండగ ఏం ఉన్నట్టు? మురుకులు– సన్నంవి, మందంవి, లడ్లు– జీడిపప్పూ ఎండు ద్రాక్షా అద్దినవి... ఇవి చేసి స్టీలు టిఫిన్లలో విడివిడిగా పెట్టకపోతే పండుగ ఆనందం రాదు. వాటిని ఇరుగూ పొరుగుకు పంచకపోతే అసలు ఆనందానికి అర్థమే లేదు. వీధి చివర ఉండే అత్తయ్యకు కొన్ని, పక్క వీధిలోని పెద్దమ్మకు కొన్ని, కొన వీధి పిన్నమ్మకి కొన్ని... వాళ్లింట్లో లేకనా? కాని నాన్న వాటిని ఇచ్చి వచ్చే వరకు ఊరుకోడు.
వాళ్లు కూడా తెచ్చినవి తీసుకొని ‘మా తల్లే మా బంగారే’ అని మెటికలు విరిచి శిరస్సు మీద చేయి ఉంచి ఆశీర్వదించి ముద్దుగా పండగ చిల్లర చేతిలో పెడితే అదంతా ఎంత ఆనందం. ఎప్పుడూ పనిలో ఉండి తనను తాను పట్టించుకోని నాన్న పండగరోజున శుభ్రంగా తల స్నానం చేసి కళకళలాడుతూ కనపడతాడు. తన మీద తాను శ్రద్ధ పెట్టని అమ్మ కొత్త చీర కట్టుకుని వీపును తడిపే తడి జుట్టుతో ఇంట్లో హడావిడి చేస్తుంటుంది. పెట్టెలో దాచి ఉంచిన పాత గొలుసేదో నానమ్మ తీరిగ్గా తన మెడలో మెరిపించుకుని ఏదో జ్ఞాపకంలో మునిగిపోతుంది. అన్నయ్య ఫ్రెండ్స్‌తో బైక్ మీద పెద్ద ఫోజుగా చక్కర్లు కొడుతుంటాడు. పక్కింటి స్నేహితురాలి కంటే మంచి ముగ్గు వేయడానికి ఇక్కడ కుస్తీ జరుగుతుంటుంది. ఇదంతా ఆనందమూ సంతోషమూ. అందుకే పండుగ వస్తే ఇంట్లో ఏదో పాజిటివ్ ఎనర్జీ తిరుగుతున్నట్టు ఉంటుంది. ఎదుటివాళ్ల మీద అభిమానం పొంగుతూ ఉంటుంది.
వాకిలి ముందుకు వచ్చిన గంగిరెద్దులూ, బుడబుడలూ, హరిదాసూ, ముసలి భిక్షువూ అందరూ ఆత్మీయులుగా కనిపించి వారికి తోచినది ఇస్తే సంతృప్తిగా ఉంటుంది. పండగ రోజు ఫ్యామిలీ ఫొటో దిగడం ఆనందం. పండుగ రోజు మధ్యాహ్నం భోజనం తర్వాత అందరం టీవీ చూడటం ఆనందం. సాయంత్రం చేతులు చేతులు పట్టుకొని సినిమాకు వెళ్లి ఇంటర్వెల్ తర్వాతి సినిమాను కూల్‌డ్రింక్ చప్పరిస్తూ చూడటం ఇంకా ఆనందం. రోజువారీ రొటీన్ అనుబంధాల పై కప్పే పరదాలను పండగ బద్దలు చేస్తుంది. నిరాశ నిస్సత్తువలను దూరం చేస్తుంది. ఒక చిన్నపాటి పువ్వు, ఒక చిన్నపాటి నవ్వు కూడా పండగపూట వెలిగి మరు పండుగ వరకూ అవసరమైన దీప్తిని జ్యోతిని జీవితం పట్ల అనురక్తిని ప్రసాదిస్తాయి. సంతోషమయ జీవితానికి అవసరమైన ముఖ్యమైన దినుసు, మైండ్ కెమికల్– పండగ.