మితిమీరిన సంతోషమూ హానికరమే! | Harmful Substance hilarious | Sakshi
Sakshi News home page

మితిమీరిన సంతోషమూ హానికరమే!

Published Mon, Apr 11 2016 12:12 AM | Last Updated on Sun, Sep 3 2017 9:38 PM

మితిమీరిన సంతోషమూ హానికరమే!

మితిమీరిన సంతోషమూ హానికరమే!

పరి పరిశోధన

 

ఏదైనా ఘోరమైన వార్త విన్నప్పుడు సినిమాల్లో కొన్ని పాత్రలు గుండెపట్టుకొని కుప్పకూలిపోతాయి. షాకింగ్ వార్త ఏదైనా విన్నప్పుడు ఇలా గుండె బద్దలయ్యే సన్నివేశాలు మనం సాధారణంగా చూసే సన్నివేశాలే. ఇలా జరగడాన్ని ‘బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్’ అంటారు. వైద్యపరిభాషలో దీన్నే ‘టకోట్సుబో సిండ్రోమ్’ అని లేదా స్ట్రెస్ ఇండ్యూస్‌డ్ కార్డియోమయోపతి అంటారు. తీవ్రమైన ఉద్వేగాన్ని కలిగించే ఏదైనా వార్త విన్నప్పుడు గుండె కండరం తాత్కాలికంగా బలహీనమవుతుంది. దాంతో గుండె ఎడమ వెంట్రికిల్ బెలూన్‌లాగా ఉబ్బుతుంది. అలాంటప్పుడు గుండె సరిగా పనిచేయకపోవడం కూడా జరగవచ్చు. ఇది ప్రమాదకరమైన పరిస్థితి. టకోట్సుబో సిండ్రోమ్ అనేది జాపనీస్ పదం.

 
అయితే ఇప్పటివరకూ భరించలేనంత విచారం కలిగించే సందర్భాలు, తీవ్రమైన దుఃఖం కలిగించే పరిస్థితుల్లోనే ఇలా గుండెబద్దలైపోయే అపాయకరమైన పరిణామాలు సంభవించవట. అమితంగా సంతోషం కలిగించే అంశాలు కూడా అచ్చం ‘బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్’ లాంటి పరిస్థితినే కల్పిస్తాయని స్విస్ అధ్యయనం పేర్కొంటోంది. మరీ ఎక్కువగా సంతోషం కూడా అంత మంచిది కాదని సూచిస్తోంది. ఇలా అపరిమితమైన సంతోషంతో గుండె కండరం బలహీనం అయ్యే కండిషన్‌కు సరిగ్గా ‘బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్’కు వ్యతిరేకమైన పేరు పెట్టారు అధ్యయనవేత్తలు. ఈ కండిషన్ పేరు ‘హ్యాపీ హార్ట్ సిండ్రోమ్’ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు మంది నుంచి గుండె స్పందనల తీరు తెన్నులపై వివరాలు సేకరించారు. ఆ సేకరించిన అంశాలతో ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. గుండెబద్దలైపోయి చనిపోయిన వారి వివరాలు తెలుసుకుంటున్నప్పుడు వారికి ఒక విచిత్రమైన విషయమూ తెలిసింది. అదేమిటంటే... అత్యంత ప్రియమైన వారి చావుకబురు విన్నప్పుడు లేదా అలాంటి వారి అంతిమయాత్రలో పాల్గొని వచ్చాక లేదా తమకు ప్రియమైన వారికి ఏదో కోలుకోలేనంతగా జబ్బు సోకిందని తెలిశాక 96 శాతం మందిలో గుండె బద్దలైపోయిందని తేలింది.


అయితే దీనికి వ్యతిరేకంగా నాలుగు శాతం మందిలో మాత్రం పట్టలేనంత ఆనందం కలిగినప్పుడు కూడా ‘హ్యాపీ హార్ట్ సిండ్రోమ్’కు గురైన సందర్భాలూ ఉన్నాయి.  స్విస్ అధ్యయనంలో తేలిన ఈ అంశాన్ని ‘యూరోపియన్ హార్ట్ జర్నల్’లో పొందుపరిచారు. తమకు అత్యంత ప్రియమైన జట్టు పోటీల్లో గెలిచిందనీ, తమకు మనవలు పుట్టారని తెలిసిన కొందరు ఆ సంతోషాన్ని పట్టలేక ఈ హ్యాపీ హార్ట్ సిండ్రోమ్’కు గురైనట్లు అథ్యయనాల విశ్లేషణలో తేలింది. దాంతో భరించలేనంత విషాదం కలిగించే ప్రభావాన్నే పట్టరాని సంతోషమూ కలిగిస్తోందని పేర్కొంటున్నారు నిపుణులు.

 

Advertisement

పోల్

Advertisement