మీకూ ఉందా హాఫ్‌గర్ల్‌ఫ్రెండ్..?!
జీవితంలో ఎన్నడూ చూడని రుచుల్లో కాఫీ టేస్ట్ కూడా ఒకటి అయినా, నచ్చిన అమ్మాయిని కాఫీ డేకి రమ్మని అడిగింతే ధైర్యం వస్తుంది! కాఫీ కొత్తదే, ప్రేమ కూడా కొత్త రుచే!
ఇంత వరకూ చేతన్ రచించిన నవలల్లో వేటికీ రానంత క్రేజ్ ఈ నవలకు కనిపిస్తోంది. అసలు హాఫ్ గర్ల్‌ఫ్రెండ్ ఏమిటనేదే ప్రశ్న! స్త్రీ, పురుష బంధాల్లో అంతగా వినిపించని ‘హాఫ్ గర్ల్‌ఫ్రెండ్’అనే పదానికి చేతన్ ఎలాంటి నిర్వచనం ఇస్తాడనేది ఆసక్తికరంగా మారింది.
ఈ విషయం గురించి చేతన్ యూట్యూబ్‌లో విడుదల చేసిన టీజర్ ద్వారా కొంత వివరణ ఇచ్చాడు. ‘ఒకానొకప్పుడు మాధవ్ అనే బీహారీ అబ్బాయి ఉండేవాడు. అతడు రియా అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే మాధవ్ ఇంగ్లిష్‌లో సరిగా మాట్లాడలేడు. అతడు రియాతో బంధాన్ని కోరుకొంటాడు. అయితే రియా అందుకు అంగీకరించదు. రియా అతడితో స్నేహితురాలిగా ఉంటానని అంటుంది.కానీ దానికి మాధవ్ ఒప్పుకోడు. ఇటువంటి పరిస్థితుల మధ్య ఆమె ఒక ఒప్పందానికి వద్దామంటుంది. అతడికి ‘హాఫ్ గర్ల్‌ప్రెండ్’గా ఉండటానికి ఆమె సిద్ధపడుతుంది...’ అంటూ నవలకు సంబంధించి ఉపోద్ఘాతాన్ని వీడియో రూపంలో విడుదల చేశారు.
ఇది పూర్తిగా ప్రేమ కథ అని అంటున్నారు రచయిత. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన యువకుడికి, నగర జీవితంలోని యువతికి మధ్య నడిచే ప్రేమ కథ ఇది. మరి ఎటొచ్చీ హాఫ్‌గర్ల్ ఏమిటి?అంటే మాత్రం చేతన్ చెప్పడం లేదు. దాన్ని నవలను చదివి తెలుసుకోవాలని అంటున్నారు.
తప్పు అతడిది కాదు... పెనిలిథామిన్‌ది! ఇష్టమైన అమ్మాయి దూరంగా కనిపిస్తూ ఉంటేఆమెకు దగ్గర కావాలనే కోరికను కలిగిస్తుంది ఈ రసాయనం.. అలాగే ఎగజిమ్మే ఎడ్రినలిన్ అయితే ఆమెవైపు చూడకూడదని బలవంతంగా నిర్ణయించుకొన్నా నియంత్రణ లేకుండా చేస్తుంది! ఇక ఆక్సిటోసిన్ అయితే ఆమె దగ్గరగా ఉన్నప్పుడు తాకాలనిపించే కోరికను జనింపజేస్తుంది... మాధవ్‌ది అచ్చం ఇలాంటి స్థితే. ఆమె పాలరాతి శిల్పంలా ఫ్రీజ్డ్‌గా ఉన్నా... అతడు పలుచన అవుతాడు. ఆమె పట్టించుకోకపోయినా ప్రేమ ప్రతిపాదన వరకూ వెళతాడు....అంటూ చేతన్ తన నవల సారాంశాన్ని ఇంటర్వ్యూలలో వివరిస్తున్నారు. ప్రేమ ఒక జరిగితీరాల్సిన ప్రక్రియ. శరీరంలోని రసాయనాలు పెట్టే గిలిగింతలతో ప్రేమలో పడటం జరుగుతుందంటారు శాస్త్రవేత్తలు. అలాంటి ప్రేమ ఎప్పుడూ ఒకేసారి రెండు గుండెల తలుపులనూ తట్టకపోవచ్చు. ఒకరు గుండెకు భద్రంగా కీ వేసుకొని కూర్చొండవచ్చు. రియా అలాంటి అమ్మాయేనేమో!
మళ్లీ చేతన్ భగత్ దగ్గరకు వస్తే... యుక్తవయసులో ఉన్న వారి సమస్యల గురించి చర్చించడం, వాటినే కథలుగా తీర్చిదిద్దడం ఆయన ఐఐటీలో ఒంటబట్టించుకొన్న విద్య. విభిన్న సంప్రదాయాల నుంచి వచ్చిన అబ్బాయి, అమ్మాయిల ప్రేమ కథ ‘2స్టేట్స్’ ను అబ్బాయి కోణం నుంచి చెప్పుకొచ్చి, అనేకమంది ప్రేమకథలను తడిమిన చేతన్‌భగత్ ఇప్పుడు అనేక జీవితాల్లోని అస్పష్టమైన ప్రేమ రూపాన్ని తడుముతాను అంటున్నాడు. ఈ ప్రేమ కథ కొత్తది కాదు. అనేకమంది జీవితాల్లో ఉన్నదే... ఇప్పుడు హాఫ్‌గర్ల్‌ఫ్రెండ్ అంటే అర్థం కావడం లేదని చాలా మంది అంటున్నారు... కానీ, మనలో చాలా మందికి టీనేజ్‌లోనో, కాలేజీడేస్‌లోనో హాఫ్‌గర్ల్‌ఫ్రెండ్ కచ్చితంగా ఉండి తీరుతుందని చేతన్ అంటున్నారు. ఇక్కడే ఫెమినిస్టులకు కోపం వస్తోంది. హాఫ్‌గర్ల్‌ఫ్రెండ్ అనే పదం అమ్మాయి వ్యక్తిత్వాన్ని అవమానించేదని వారు అంటున్నారు.
ఇక హాఫ్‌గర్ల్‌ఫ్రెండ్‌ను ఫుల్‌లెంగ్త్‌ఫ్రెండ్‌గా మార్చుకోవడం కూడా అబ్బాయిలకు తెలియని విద్య ఏమీ కాదు. జీవితంలో ఎన్నడూ చూడని రుచుల్లో కాఫీ టేస్ట్ కూడా ఒకటి అయినా, నచ్చిన అమ్మాయిని కాఫీ డేకి రమ్మని అడిగేంత ధైర్యం వస్తుంది! కాఫీ కొత్తదే, ప్రేమ కూడా కొత్త రుచే! అలా ఒక్కొక్కరిదీ ఒక్కోదారి. మరి చేతన్‌భగత్ హీరో ఎలాంటి దారిని ఎంచుకొన్నాడో, అతడి హాఫ్‌గర్ల్‌ఫ్రెండ్ చేతన్ అభిమానులను ఎలా ఉక్కిరిబిక్కిరి చేస్తుందో వేచి చూడాలి.
-జీవన్‌రెడ్డి.బి