ఓ సరదా పందెం... వేల జీవితాలకు వెలుగు | he gives money to a charity trust for protection of ladies | Sakshi
Sakshi News home page

ఓ సరదా పందెం... వేల జీవితాలకు వెలుగు

Published Tue, Jul 22 2014 11:51 PM | Last Updated on Sat, Sep 2 2017 10:42 AM

ఓ సరదా పందెం... వేల జీవితాలకు వెలుగు

ఓ సరదా పందెం... వేల జీవితాలకు వెలుగు

పందేలు జీవితాలను పాడుచేస్తాయి కదా. కానీ, ఇక్కడ ఒక సరదా పందెం కొన్ని వందల జీవితాలకు వెలుగు నిచ్చింది. తమాషా ఏంటంటే.. అది ఇద్దరు తాగుబోతులు వేసుకున్న పందెం. ఆ పందెం మొదలైనప్పుడు ఆ విషయం అందులో పాల్గొన్నవారికి ఎవరికీ తెలియదు. ఏమిటా పందెం? ఎవరు వేశారది?
 
విజయవంతంగా

పందెం పూర్తి చేసిన పీటర్ ఆ సొమ్మును కంబోడియాలో వ్యభిచార కూపంలో దిగుతున్న అమాయకులైన ఆడపిల్లలను ఆదుకోవడానికి ఆస్ట్రేలియాకు చెందిన ఫ్రీటు షైన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థకు దానం చేశారు.
 
ఐర్లాండ్‌లోని ఆర్మోయ్ పట్టణం అది. ఒక గదిలో ఇద్దరు బ్యాచిలర్స్ ఉన్నారు. పార్టీలు, సరదాలు, షికార్లు... అప్పుడప్పుడు చదువులు! ఇదీ వారి వ్యాపకం. ఓ రోజు రాత్రి వారిద్దరు పార్టీ చేసుకున్నారు. పూటుగా మందు తాగి... మాటలు పెరిగాయి. అందులో ఒకరు ‘ఈ జీవితం బోర్ కొట్టిందిరా... ఓ వారం దీన్నుంచి పూర్తిగా దూరంగా ఉండాల’న్నారు... వారిద్దరిలో ఒకడైన పీటర్ లినాగ్ (33) ‘నువ్వు వారం ఉంటావా? అయితే నేను ఏడాది పాటు అమ్మాయిలకు దూరంగా ఉంటాను’ అన్నాడు.

మరో మిత్రుడు ‘‘కోతలు ఎందుకురా... నీ వల్ల కాదు’’ అన్నాడు. లేదు కచ్చితంగా ఉంటాను అన్నాడు పీటర్. ‘‘అయితే పందెం కడతా, నువ్వు ఏడాది ఉండలేవు’’ అన్నాడు మిత్రుడు. ఆ పందేనికి పీటర్ ఒప్పుకున్నాడు. ‘‘ఏడాది పాటు అమ్మాయిలకు దూరంగా ఉంటే నీకు నేను 2000 డాలర్లు ఇస్తాను’’ అన్నాడు మిత్రుడు. ‘‘పందెం ఓకే గానీ ఆ డబ్బు నేను చారిటీకి ఇస్తాను నీకు ఓకేనా?’’ అని పీటర్ ప్రతిపాదించాడు. ‘‘ఒరే నువ్వు మొదట పందెం గెలువు, అప్పుడు కదా. అయినా నువ్వు ఏమైనా చేసుకో ఆ డబ్బుతో’’ అని ఆ  రోజు పార్టీ ముగించారు.
 
పీటర్ ఎంత అమ్మాయిలతో తిరిగేవాడైనా పుస్తకాల పురుగు. కాస్త దాతృత్వం కూడా ఉన్న వ్యక్తి. వెంటనే తనకు పరిచయం ఉన్న ఓ ఫౌండేషన్ నిర్వహకుడికి ఫోన్ చేసి, ఈ విషయం చెప్పి ‘‘నేను మీ సంస్థకు డొనేట్ చేస్తాను’’ అన్నాడు. ఆయన నవ్వుతూనే ‘‘సరే, సంతోషం’’ అన్నాడు. అయితే ఈ పందేన్ని పీటర్ మనసులో పెట్టుకోకుండా ఫేస్‌బుక్‌లో షేర్ చేశాడు. ‘పందెంపై వెనక్కు తగ్గే ఆలోచనే రాకుండా ఈ పందెం అందరికీ చెబుతున్నాను’ అంటూ దాని గురించి ఫేస్‌బుక్‌లో పెట్టాడు. ఆ పందెం డబ్బులు దానం చేస్తాను అన్న విషయం కూడా ఆ పోస్టులో పెట్టాడు. దానికి ‘పీటీస్ ఛేస్టిటీ ఫర్ చారిటీ’ అనే టైటిల్ కూడా పెట్టారు. ఈ పందెం కాలం 2013 జనవరి 1 నుంచి 2014 జనవరి ఒకటి వరకు.  
 
ఈ విచిత్రమైన పోస్టుకు మిత్రుల నుంచి కామెంట్లు వెల్లువెత్తాయి. కొందరు నవ్వితే ఇంకొందరు రకరకాల సెటైర్లు వేశారు. కొందరు మిత్రులయితే ఏకంగా నేను కూడా పందెం కడుతున్నాను... నా వంతు 400 డాలర్లు, నా వంతు 600 డాలర్లు, నాది వెయ్యి డాలర్లు అంటూ మిత్రులు కామెంట్లలో మరిన్ని పందేలు కాశారు. అలా ఉబుసుపోక వేసుకున్న ఈ పందెం మిత్రుల సర్కిల్‌లో ప్రాచుర్యం పొంది.. ఇంకొందరు పందెం కట్టారు. దీంతో ఏడాది ముగిసే నాటికి అన్ని పందెం డబ్బులు కలిసి 50 వేల డాలర్లు అయ్యాయి. అంటే మన కరెన్సీ ప్రకారం 30 లక్షల రూపాయలు.
 
విజయవంతంగా పందెం పూర్తి చేసిన పీటర్ ఆ సొమ్మును కంబోడియాలో వ్యభిచార కూపంలో దిగుతున్న అమాయకులైన ఆడపిల్లలను ఆదుకోవడానికి ఆస్ట్రేలియాకు చెందిన ఫ్రీ టు షైన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థకు దానం చేశారు. కంబోడియా కరెన్సీ ప్రకారం లెక్కేస్తే అది 20 కోట్ల రూపాయల సొమ్ము. ఉబుసుపోక వేసుకున్న ఒక పందెం ఒక మంచి పనికి ఇంత పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని ఎవరూ ఊహించలేదు.  చిత్రమైన విషయం ఏంటంటే... అమ్మాయిలకు దూరంగా ఉండటానికి వేసుకున్న ఈ పందెం కొన్ని వేల మంది అమ్మాయిలకు ఆసరాగా నిలిచింది. వారికి చదువు, గూడు, గుడ్డ ఇచ్చింది.
 
అంతేకాదు, పీటర్ జీవితం, ఆలోచనలు ఈ ఏడాదిలో పూర్తిగా మారిపోయాయి. అతను స్వయంగా కంబోడియా వెళ్లి వారికి ఎలా సాయం అందుతుందో చూశాడు. అంతేకాదు, భవిష్యత్తులో స్వంతంగా ఒక చారిటీ సంస్థను స్థాపించి... మరిన్ని నిధులు సేకరించి వీలైనంత మంది జీవితాలకు అండగా నిలుస్తానన్నారు. ఈ విచిత్రమైన పందెంతో సెలబ్రిటీగా మారిన పీటర్ ఇపుడు నేపాల్‌తో పాటు మరికొన్ని దేశాల్లో రకరకాల చారిటీలకు మద్దతుగా నిలుస్తుండడం మేలి మలుపు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement