కర్ణాటక,దొడ్డబళ్లాపురం: ఇంట్లో అద్దెకు ఉంటున్న వారిని ఖాళీ చేయించడానికి పెద్ద మాస్టర్ ప్లాన్ వేసిన వ్యక్తికి ఉపాయం కాస్త బెడిసికొట్టి అతడే జైలుపాలైన సంఘటన రామనగరలో చోటుచేసుకుంది. రామనగరలోని ఎక్స్‌టెన్షన్ కాలనీలో నివసిస్తున్న మహమ్మద్ ఇక్బాల్ (76) అరెస్ట్ కాగా ఇతడి అల్లుడు పర్వేజ్ (35) పరారీలో ఉన్నాడు. వివరాలు... ఇక్బాల్ సోదరుడు జాకీర్ విదేశాల్లో ఉంటున్నాడు. రామనగరలోని ఎక్స్‌టెన్షన్ కాలనీలో జాకీర్‌కు ఇల్లు ఉంది.
ఆ ఇంట్లో ఇద్దరు యువకులు అద్దెకు ఉంటున్నారు. అయితే ఆ ఇంటిపై కన్నేసిన ఇక్బాల్ అద్దె ఉంటున్న యువకులను ఖాళీ చేయించడానికి చేసిన అనేక ప్రయత్నాలు ఫలించలేదు. గత కొన్ని నెలలుగా పలుసార్లు అటవీశాఖ అధికారులను కలిసి తమ ఇంట్లో అద్దెకు ఉంటున్న యువకులు వన్యప్రాణుల మాంసం తెచ్చుకుంటున్నారని, సమాచారమిస్తామని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో రెండు రోజులక్రితం ఇక్బాల్ తన అల్లుడు పర్వేజ్‌తో కలిసి నెమలి మాంసం, జింక మాంసం, తీసుకువచ్చి అద్దె ఇంట్లో ఉంచారు. అటవీశాఖ అధికారులకు ఫోన్ చేసి విషయం తెలిపారు. అధికారులు యువకులను విచారించి విషయం తెలుసు కున్నారు. అసలు సంగతి వెలుగు చూడడంతో పర్వేజ్ పరారయ్యాడు. అటవీశాఖ అధికారులు ఇక్బాల్‌ను అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment