నా పేరు లుగ్డీదేవి... మా ఆయన పేరు కేదార్‌నాథ్
శాంతిదేవి 1926 డిసెంబర్‌లో ఢిల్లీలో పుట్టింది. 1930లో అంటే నాలుగేళ్ల వయసు నుంచి తన గతజన్మ విషయాలను చెప్పడం మొదలుపెట్టింది. మహాత్మాగాంధీ సైతం ఈ కేస్ పట్ల శ్రద్ధ తీసుకొని శోధించమని కమిషన్‌కు సిఫారస్ చేశారు. 1936లో కమిషన్ రిపోర్ట్ ఆధారంగా బాల్‌చంద్ నహతా అనే వ్యక్తి ‘పునర్జన్మ కీS పర్యాలోచన’ అనే పేరుతో పుస్తకం తీసుకొచ్చారు. ఆ తర్వాత కాలంలో విదేశాల నుంచి వచ్చిన పలువురు ప్రముఖులు శాంతిదేవిని ఇంటర్వూ్య చేశారు. పత్రికలలో ప్రముఖంగా వ్యాసాలు రాశారు. ఆమె కథనం ఇలా ఉంది.. శాంతిదేవి నాలుగేళ్ల వయసులో తల్లిదండ్రులతో ‘నా సొంత ఇల్లు మధురలో ఉంది..’ అని చెబుతుండేది.
తల్లితండ్రులు మొదట్లో ఆమె మాటలను పట్టించుకోలేదు. ఆరేళ్ల వయసులో ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయి మధురకు చేరుకుంది. ఎలాగో తంటాలు పడి ఆమెను వెతుక్కొచ్చారు తల్లీతండ్రి. స్కూల్‌కి వెళితే టీచర్లు, ప్రిన్సిపల్‌తో ‘మధురలోని ఓ ప్రాంతానికి చెందిన మాండలికంలో మాట్లాడేది శాంతిదేవి. తన భర్త కేదార్‌నాథ్ అని, అతను ఒక చిన్న వ్యాపారి అని, తన పేరు లుగ్డీదేవి అని, తొమ్మిదేళ్ల క్రితం తనకు ఓ కొడుకు పుట్టాడని, వాడు పుట్టిన పది రోజులకు జబ్బు చేసి తను మరణించానని చెప్పింది. వాళ్లు ఆమె చెప్పిన అడ్రెస్‌కు ఈ విషయం తెలియజేశారు. కేదార్‌నాథ్ ఢిల్లీ వచ్చారు. అతనితో పాటు ఉన్న కొడుకును శాంతిదేవి వెంటనే గుర్తుపట్టింది. కేదార్‌నాథ్ భార్యగా ఉన్నప్పుడు తను ఏమేం పనులు చేసేది వివరించింది. కమిషన్ సభ్యులు ఆ తర్వాత శాంతిదేవిని తీసుకొని మధుర వెళ్లారు. అక్కడ లుగ్డీదేవి తాతతో సహా చాలా కుటుంబాలను గుర్తించింది. వారి యోగక్షేమాలు అడిగింది. మరణశయ్య మీద ఉన్న తనకు కేదార్‌నాథ్ ఎన్నో ప్రమాణాలు చేశాడని, అవన్నీ అతను నిర్లక్ష్యం చేశాడని చెప్పింది. చనిపోవడానికి కొన్ని రోజులు ముందు తను భూమిలో దాచిన డబ్బును తవ్వి తీసుకొచ్చి ఇచ్చింది. తిరిగి తన తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. కమిషన్ సభ్యులు శాంతిదేవికి ఇది ‘పునర్జన్మ ’అని రిపోర్ట్ ఇచ్చారు.
శాంతిదేవి యుక్తవయసు వచ్చినా పెళ్లి చేసుకోలేదు. 1950లో అమెరికన్ సైకాలజిస్ట్ ‘ఐయాన్ స్టీవెన్‌సన్ శాంతిదేవి విషయం తెలుసుకొని ఇంటర్వూ్య చేయడంతో ఆమె పునర్జన్మ కథ ప్రపంచవ్యాప్తం అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా 3000 మంది గతజన్మ అనుభవాల మీద పరిశోధనలు చేసిన స్టీవెన్‌సన్‌కి మరణానికి ముందు లుగ్డీదేవి అనుభవించిన కష్టం, శాంతిదేవి చెప్పిన విషయాలు ఒకేలా ఉండటం ఆశ్చర్యపరిచాయి. 1987 డిసెంబర్ 27న ఆమె చనిపోవడానికి నాలుగు రోజులు ముందు శాంతిదేవిని కలిసి, ఇంటర్వూ్య చేసిన కె.ఎస్.రావత్ ఆమె కథనాన్ని తిరిగి ప్రచురించారు.