
ఫిట్... ఫటాఫట్
ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు ఎప్పుడో చెప్పారు గానీ...
అంత తీరిక మాకెక్కడిది అన్నది ఈ తరం చెప్పే సాకు!
ఇందులో కొంతవరకూ నిజం ఉండవచ్చు కూడా. అయితే..
మనసుండాలేగానీ.. రోజులో ఎంతో కొంత సమయాన్ని
ఆరోగ్య రక్షణకు కేటాయించడం పెద్ద కష్టమేమీ కాదు.
స్మార్ట్‌ఫోన్లు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో ఇందుకోసం ఎన్ని అప్లికేషన్లో...
పాకెట్ యోగా...
యోగా మెరుగైన వ్యాయామమని ప్రపంచం మొత్తం గుర్తించింది. కానీ మనలో చాలామందికి ఆసనాలు ఎలా వేయాలబ్బా అన్న సంశయం మాత్రం ఉండే ఉంటుంది. అలాంటి వారి కోసం ఉద్దేశించిన అప్లికేషనే ఈ పాకెట్ యోగా. దాదాపు 200 యోగాసనాలతోపాటు కొన్నింటి యానిమేషన్లు ఉన్న ఈ అప్లికేషన్‌ను వాడుకునేందుకు దాదాపు రూ.200 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆసనాలు ఎలా వేయాలన్నదానిపై వాయిస్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఉండటం విశేషం. ఇంత డబ్బు చెల్లించడం ఎందుకని అనుకుంటే... ‘యోగా అండ్ హెల్త్ టిప్స్’ పేరుతో అందుబాటులో ఉన్న మరో అప్లికేషన్‌ను వాడి చూడండి. ఉచితంగా లభించే ఈ ఆప్‌లో దాదాపు 50 రోజువారీ ఆసనాల వివరాలు ఉన్నాయి.
గూగుల్ ఫిట్...
గూగుల్ కంపెనీ అభివృద్ధి చేసిన అప్లికేషన్ ఇది. రోజులో మీరు యాక్టివ్‌గా ఉన్న సమయంతోపాటు ఏ వ్యాయామం ద్వారా ఎన్ని కేలరీలు ఖర్చుపెట్టింది తెలుసుకోవచ్చు. మీకై మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకున్నారా? లేదా? అన్నది తెలుసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌ను మీ దగ్గర ఉంచుకోవడం ఒక్కటే మీరు చేయాల్సిన పని. ఎంత దూరం నడిచారు? మోటర్ బైక్ సవారీ ద్వారా ఖర్చు చేసిన కేలరీలు ఎన్ని వంటి వివరాలు రోజువారీగా, వారం, నెలవారీగానూ చూసుకుని తదనుగుణంగా మీ ఫిట్‌నెస్ రెజీమ్‌ను మార్చుకోవచ్చు.
కౌచ్ టు 5కే...: 10 కే రన్, 5కే రన్, రన్ ఫర్ హార్ట్.. ఇలా ఈ మధ్యకాలంలో అనేక రకాల పరుగు పందేలు వచ్చేశాయి. ఇలాంటి వాటిల్లో పాల్గొనాలన్న ఉత్సాహమున్నా తగినంత తర్ఫీదు లేకపోవడం చాలామంది వెనకడుగు వేసేందుకు కారణమవుతోంది. అటువంటి వారికి, రన్నింగ్‌ను వ్యాయామంగా ఎంచుకునే వారికి కూడా ఈ ‘కౌచ్ టు 5కే’ అప్లికేషన్ ఎంతో ఉపయోపడుతుంది. రకరకాల వర్కవుట్ ప్లాన్లు అందుకు తగ్గట్టుగా మ్యూజిక్ లిస్ట్‌ను తయారు చేసుకునే సౌకర్యం దీంట్లో ఉన్నాయి. హాఫ్ మారథాన్ నుంచి 10 కే వరకూ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లు ఉన్న ఈ అప్లికేషన్‌ను కొద్దికాలం పాటు ఉచితంగా వాడుకోవచ్చు. పూర్తిస్థాయి అప్లికేషన్‌కు మాత్రం దాదాపు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.
ఫిట్‌నోట్స్ జిమ్...: ఫిట్‌నెస్ అప్లికేషన్లు... మీరు ఇలా చేయండి. అలా చేయండి అని చెబుతూంటే ఈ ఫిట్‌నోట్స్ జిమ్ మాత్రం దీనికి పూర్తిగా భిన్నం. మీరు మీకు నచ్చిన పద్ధతిలో వ్యాయామం చేస్తూపోతారు. ఈ అప్లికేషన్ మీరు ఏం చేశారన్నదాన్ని మాత్రమే స్టోర్ చేసి చూపుతూంటుంది. ప్రకటనలేవీ లేని ఈ అప్లికేషన్ ద్వారా మీ వ్యాయామ వివరాలన్నీ ఒకదగ్గర క్రమపద్ధతిలో అమర్చుకోవచ్చు.
కేలరీ కౌంటర్... మై ఫిట్‌నెస్ పాల్...: గంటల కొద్దీ వ్యాయామం చేసినా... సరైన ఆహారం తీసుకోకపోతే దాని ఫలితం దక్కదని అందరికీ తెలుసు. తినే ఆహారంతో మనకు ఎన్ని కేలరీల శక్తి చేరుతోందో తెలుసుకోగలిగితే నియంత్రణ సులువు అవుతుంది. కేలరీ కౌంటర్ - మై ఫిట్‌నెస్ పాల్ అచ్చంగా ఈ పనే చేసిపెడుతుంది. దాదాపు 40 లక్షల ఆహార పదార్థాల్లో ఉండే కేలరీల మోతాదు అందుబాటులో ఉన్న ఈ అప్లికేషన్ మీ దగ్గరుంటే.. అతిగా తినడం తగ్గుతుందని, తద్వారా ఫిట్‌గా ఉండవచ్చునని అంచనా. మొబైల్ ఆప్‌తోపాటు డెస్క్‌టాప్ వెర్షన్ కూడా ఉన్న ఈసాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ వెర్షన్‌కు దాదాపు రూ.70 చెల్లించాలి.
సెవెన్ మినిట్ ఫుల్ వర్కవుట్...
ఎక్సర్‌సైజ్ చేసేందుకు టైమ్ లేదనే వారి కోసం ఈ అప్లికేషన్. కేవలం ఏడే నిమిషాల్లో మీరు ఎక్కడున్నా చెమటలు పట్టేలా వ్యాయామం చేయించడం దీని ప్రత్యేకత. పైగా వీడియో గేమ్స్ మాదిరిగా దీంట్లో మీకు ‘లైవ్స్’ ఉంటాయి. ఒకరోజు వర్కవుట్ చేయకున్నా ఒక లైవ్ పోతుంది. నెలలో మూడు లైవ్స్ పోగొట్టుకుంటే అప్పటివరకూ మీరు చేసిన ఎక్సర్‌సైజ్‌ల తాలూకూ ఫలితం మొత్తం శూన్యమవుతుంది. ఇదంతా కేవలం కల్పనే అయినప్పటికీ వ్యాయామం చేసేందుకు మిమ్మల్ని ప్రేరేపించేందుకు మంచి మార్గమే. చిన్న కుర్చీ సాయంతో చేసే ఈ సెవెన్ మినిట్ ఎక్సర్‌సైజ్ ఇప్పటికే బాగా పాప్యులర్.
జేఫిట్ ఎక్సర్‌సైజ్ ట్రైనర్...
దాదాపు 1300 ఎక్సర్‌సైజ్‌ల వివరాలు, యానిమేషన్లు ఉన్న అప్లికేషన్ ఇది. దీంతోపాటు ఫిట్‌నెస్ ప్లాన్స్, కండలు పెంచాలనుకునే వారికి ఏ వ్యాయామం ద్వారా ఏ కండరానికి బలం చేకూరుతుంది? వంటి వివరాలు కూడా ఇస్తుంది ఇది. మీతోపాటు మీ మిత్రుల బృందం కూడా దీన్ని డౌన్‌లోడ్ చేసుకుందనుకోండి. మీలో మీరు ఫిట్‌నెస్ పోటీలు పెట్టుకోవచ్చు. అంతేకాకుండా మీ ఫిట్‌నెస్ ప్లాన్స్‌ను మిత్రులతో పంచుకోవచ్చు కూడా. మీరు చేసే వ్యాయామం తాలూకూ ఫలితాలను ఎప్పటికప్పుడు విశ్లేషించి ఇవ్వడమూ దీని ప్రత్యేకతే. గూగుల్ ప్లే స్టోర్‌లో ఉచితంగా లభిస్తుంది.
- గిళియార్
ఎండోమొండో...
ఆండ్రాయిడ్ ఫిట్‌నెస్ అప్లికేషన్లలో ఇది బెస్ట్ అని చాలామంది నిపుణులు అంటున్నారు. ప్లే స్టోర్‌లో అప్లికేషన్ ఉచితంగానే లభిస్తుంది. కాకపోతే పూర్తిస్థాయి ఫీచర్లు అందుబాటులో ఉండవు. ఇన్ ఆప్ పర్చేసస్ ద్వారా అనేక ఇతర సౌకర్యాలు పొందవచ్చు. నెలకు దాదాపు రూ.160 చెల్లిస్తే మీకోసం ప్రత్యేకమైన టైనింగ్ ప్రోగ్రామ్‌ను రూపొందించుకోవచ్చు. హార్ట్‌రే ట్‌ను విశ్లేషించుకోవచ్చు. ప్రకటనలేవీ లేకుండా వ్యాయాయం చేసుకునే అవకాశం ఉంటుంది. వ్యాయామంలో మీ పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు వెబ్‌సైట్ ఎడిషన్ కూడా ఉండటం విశేషం.