
ఆరోగ్యమా! అనర్థమా!
బ్రూస్‌లీ ఒక్కసారిగి ఛాతీని విశాలంగా చేస్తే, కెమెరా జూమ్‌లో చూపిస్తుంటే కళ్లు పెద్దవి చేసి చూశారు. అంతటితో ఆగిపోక ఆ ప్రయత్నం తామూ చేస్తే ఎలా ఉంటుందని సరదా పడ్డారు మన నటులు. ఇప్పుడా క్రేజ్ ముదిరి యువత ముందు సవాల్‌గా నిలిచింది. సిక్స్‌ప్యాక్ ఆబ్స్ లేకపోవడం అవమానంగా భావించే వాళ్లు కూడా ఉన్నారు.
ఛాతీ వెడల్పుగా ఉండి, పొట్ట పలుచగా ఉంటే దేహాకృతి చక్కగా ఉంటుంది. చక్కటి బాడీషేప్ మనిషిలో ఆత్మస్థయిర్యాన్ని పెంచుతుంది. ఏ దుస్తులు ధరించినా చక్కగా కనిపిస్తారు. అయితే వ్యాయామం దేహమంతటినీ ఉత్తేజితం చేసేదిగా ఉండాలి. ఏదో ఒక భాగానికి పరిమితం చేస్తూ (లోకల్ ఎక్సర్‌సైజ్) వ్యాయామం చేయకూడదు. సిక్స్‌ప్యాక్ కోసం చేసే విపరీతమైన వ్యాయామం వల్ల దేహంలో సమతుల్యం దెబ్బతింటుంది.
ఆహారంలో ప్రోటీన్లు పెంచుతున్నారు, దేహంలో ప్రోటీన్లు ఓవర్‌లోడ్ అయితే వాటిని తొలగించడానికి కిడ్నీలు ఎక్కువగా పనిచేయాలి. ఒక కిలో దేహం బరువుకి ఒక రోజుకు 1.2 గ్రాముల ప్రోటీన్లు సరిపోతాయి. అంతకంటే ఎక్కువగా తీసుకున్నప్పటికీ దేహం వాటిని నిల్వ ఉంచుకోదు. ఈ సాధనలో సహజమైన ఆహారాన్ని తగ్గించి సప్లిమెంట్‌ల మీద ఆధారపడుతుంటారు. అది దీర్ఘకాలంలో దుష్ర్పభావాన్ని చూపిస్తుంది.
వ్యాయామం చాలా బాలెన్స్‌డ్‌గా ఉండాలి. దేహంలో భాగాలు ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఆపోజిట్ గ్రూప్స్‌లో సమతుల్యాన్ని కలిగి ఉంటాయి. అబ్డామిన్ ఎక్సర్‌సైజ్ వల్ల నడుము మీద ఒత్తిడి పెరుగుతుంది. నడుమునొప్పి, హెర్నియా సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. నడుము నొప్పి సమస్య ఉన్న వాళ్లు ఈ వ్యాయామం చేస్తే డిస్క్ ప్రొలాప్స్ ప్రమాదం కూడా ఉంటుంది.
సిక్స్‌ప్యాక్ ఫ్యాషన్ ప్రభావంతో చేసేదంతా అశాస్త్రీయమైన సాధన అనే చెప్పాలి. ఇందులో నీరు తక్కువగా తాగడం ఒకటి. నీరు తక్కువగా తీసుకోవడం వల్ల దేహంలోని మలినాల విసర్జన సరిగా జరగదు. పైగా వ్యాయామం చేసినప్పుడు చెమట బయటకు రావాలి. ఈ సహజధర్మాలను నియంత్రించడం వల్ల శరీర దుర్వాసన, ఇతర చర్మ సమస్యలు కూడా వస్తాయి.
- డా. భక్తియార్ చౌదరి,
స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ అండ్ ఫిట్‌నెస్ ఎక్సఫర్ట్