ఆరోగ్యానికి సురక్షా కార్డు
ఇప్పుడు ఫ్యామిలీ ఫిజిషియన్ల కాలం అంతరించిపోయింది. చేయిలాగితే న్యూరాలజిస్టుకూ, ఛాతీ నొప్పెడితే కార్డియాలజిస్టుకూ చూపించుకుంటున్నారు. ఒక వ్యక్తి ఆరోగ్య చరిత్ర సమస్తమూ ఒక డాక్టర్ దగ్గర ఉండి... ఆ డాక్టర్ 24 గంటలూ మనకు అందుబాటులో ఉంటే ఎంత బాగుంటుందో ఊహించండి. అలా ఫ్యామిలీ ఫిజీషియన్‌ను మళ్లీ అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు ‘దేశీఎండీ’ అనే అంతర్జాతీయ సంస్థకు చెందిన ఔత్సాహికులైన ముగ్గురు డాక్టర్లు. కార్డియాలజిస్టు అయిన డాక్టర్ అజయ్ త్రిపురనేని సీఈవోగా, ఆంకాలజిస్టు డాక్టర్ రాకేశ్ సూరపనేని సీవోవోగా, జనరల్ ఫిజీషియన్ అయిన సతీశ్ పోట్లూరి సీఎమ్‌వోగా వ్యవహరిస్తూ నెలకొల్పిన ఈ సంస్థ ఆన్‌లైన్‌లో... ఆ మాటకొస్తే ఫోన్‌లైన్‌లోనే ఒక ఫ్యామిలీ ఫిజీషియన్ భూమికను పోషిస్తుంటుంది.
డయాబెటిస్, రక్తపోటు, గుండెజబ్బుల వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారూ లేదా ఆరోగ్యవంతులైనా సరే ముందుగా ‘దేశీఎండీ’ సంస్థనుంచి ఒక ‘సురక్షా కార్డు’ తీసుకోవాలి. ఇందుకు రోగి చెల్లించాల్సిన మొత్తం ఏడాదికి రూ. 1250. ఇక ఆ తర్వాత ఈ కార్డు హోల్డరు ఏడాదిపాటు రోజులోని ఏ సమయంలోనైనా, ప్రయాణం చేస్తున్నా తన ఆరోగ్యం గురించి ఏ అనుమానం వచ్చినా సరే... ఫోన్లోనే డాక్టరును సంప్రదించవచ్చు. సమస్య చిన్నదైతే డాక్టర్ ఫోన్లోనే మందులు సూచిస్తారు. పెద్దదైతే దగ్గర్లోని ఆసుపత్రికి వెళ్లమని సూచిస్తారు. ఒకవేళ ఏవైనా పరీక్షలు అవసరమైతే వాటిని చేయిస్తారు. ఆ పరీక్షలు రిపోర్టులను ‘దేశీఎండీ’ డేటాబేస్‌లో నిక్షిప్తం చేసి ఉంచుతారు. ఒకవేళ రోగికే ఫలానా డాక్టర్ మీద గురి, నమ్మకం ఉండి అక్కడికే వెళ్తానన్నా సరే... తమ వద్ద ఉన్న డేటాబేస్‌లోని రోగి వివరాలన్నింటినీ రోగి కోరిన డాక్టర్‌కు అందజేస్తారు. ఉదాహరణకు రోగి ప్రయాణంలో ఉండి... వేరే ఊళ్లో ఉన్నాడనుకుందాం. ఆ సమయంలో అతడికి ఏదో సమస్య వచ్చింది. సదరు రోగి వెంటనే ‘దేశీఎండీ’కి ఫోన్ చేసి, తన సమస్య వివరిస్తే... రోగి ఆ సమయానికి ఉన్న ఊళ్లో ఉన్న ఆసుపత్రుల వివరాల ఆధారంగా అతడికి సరైన చికిత్స దొరికే ఆసుపత్రిని సూచిస్తారు. ఇలా రోగి డాక్టర్ కోసం క్యూలో వేచి ఉండాల్సిన ఆవశ్యకత లేదు. చిన్న సమస్యకైతే ఉన్న చోటి నుంచి కదలాల్సిన అవసరం లేదు. ఏడాది పాటు రోగి ఎప్పుడు కోరితే అప్పుడు తన ఆరోగ్య వివరాలను ఫోన్ ఫిజీషియన్‌తో సంప్రదించవచ్చు. ఒక డాక్టర్‌ను సంప్రదించాక రోగి సెకండ్ ఓపీనియన్ కోసం ఎవరినైనా కలవాలనుకుంటే వారిని సూచిస్తారు. ఒకవేళ రోగే ప్రత్యేకంగా ఫలానా డాక్టర్‌ను కలవాలని కోరుకున్నా వారికే తమ వద్ద ఉన్న రోగి ‘ఆరోగ్య చరిత్ర’ను ఫోన్ ఫిజీషియన్ వివరిస్తారు.
మరి డాక్టర్ల వైపు నుంచో...
దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారు ఈ సురక్షాకార్డు తీసుకుంటే... అక్కడి డాక్టర్లు నెలకొకసారి రోగి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తారు. రోగులు తాము క్రమం తప్పకుండా చేయించాల్సిన పరీక్షలనూ, ఫాలో అప్‌ను మరచిపోతుంటారు కదా... అలాంటి వారిని ఆసుపత్రికి వెళ్లమని హెచ్చరిస్తుంటారు. వెళ్లే ముందు చేయించాల్సిన పరీక్షలను సూచిస్తుంటారు. వెళ్లి వచ్చాక ఆ రిపోర్టులను దాచి ఉంచడం కోసం పంపమని కోరుతుంటాడు. ఇవీ సురక్షాకార్డుతో కలిగే కొన్ని ఉపయోగాలు. మరింతగా తెలుసుకోవాలనుకుంటే సంప్రదించాల్సిన ఫోన్ నెం. 040-42428282. అలాగే వెబ్‌సైట్ అడ్రస్ : www.desimd.com