![Hemalata founded by the electronic vehicle manufacturing industry - Sakshi](/styles/webp/s3/article_images/2019/03/17/hema.jpg.webp?itok=_KMS_L8M)
ఒక మహిళ.. పారిశ్రామిక రంగంలోకి అడుగు పెట్టడమే వైవిధ్యం. అది కూడా ఆటోమొబైల్ పరిశ్రమ స్థాపిస్తే అది విశేషం. అందులోనూ మరింత వినూత్నంగా ఎలక్ట్రానిక్ ఆటోమొబైల్ పరిశ్రమ స్థాపిస్తే.. ఒక సంచలనం అవుతుంది. అలాంటి సంచలనమే హేమలతా అన్నామలై.
కోయంబత్తూరుకు చెందిన హేమలతా అన్నామలై ‘యాంపేర్ వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ పరిశ్రమ స్థాపించి ఏడాదికి అరవై వేల వాహనాలను తయారు చేస్తున్నారు. తన పరిశ్రమల్లో నలభై శాతం ఉద్యోగాల్లో మహిళలనే నియమించారు. ఈ విజయ ప్రస్థానం వెనుక ఒక కథ ఉంది. హేమలతకు ఓ రోజు జపాన్ నుంచి ఊహించని ఫోన్ కాల్ ఒకటి వచ్చింది. ఆ ఫోన్ కాల్‌తో వెంటనే ఆమె జపాన్‌కు ప్రయాణమయ్యారు. అయితే ఆ ఫోన్ కాల్ వచ్చింది ఆమె భర్త బాల పచ్చయ్యప్ప నుంచే. జపాన్‌లో ఆటోమొబైల్ కాన్ఫరెన్స్‌కు వెళ్లారాయన. ఆటోమోటివ్ దిగ్గజం టొయోటా అధిపతి ప్రసంగం పచ్చయ్యప్పలో కొత్త ఆలోచనకు తెర లేపింది. వెంటనే భార్యకు ఫోన్ చేసి ఈ ప్రాజెక్ట్ గురించి సమగ్రంగా చర్చించాల్సిన అవసరం ఉంది, కాబట్టి వెంటనే బయల్దేరమని చెప్పారు. హేమలత ఆ వివరాలను చెప్తూ ‘‘ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ గురించి అధ్యయనం మొదలు పెట్టాను.
2007లో జెనీవాలో జరిగిన సదస్సుకు కూడా వెళ్లాను. అక్కడికి వచ్చిన వాళ్లతో మాట్లాడిన తరవాత నా ప్రాజెక్టుకు ఒక రూపం స్పష్టంగా కళ్ల ముందు మెదిలింది. 2008లోఎలక్ట్రిక్ స్కూటర్‌లు, సైకిళ్లు, ట్రై సైకిళ్లు, వేస్ట్ క్యారియర్‌ల తయారీ ప్రారంభించాను. పద్దెనిమిదేళ్ల పాటు సింగపూర్‌లో పని చేసిన అనుభవం కూడా తోడైంది. పేద, మధ్య తరగతికి అందుబాటు ధరల్లో వాహనాన్ని తయారు చేయడం, మహిళలు ఉపయోగించడానికి అనువుగా డిజైన్ చేయడం నా ఉద్దేశం. అందులో విజయవంతమయ్యాను. ఇప్పుడు మా కంపెనీ నుంచి ఏడాదికి అన్ని రకాలు కలిపి అరవై వేల వాహనాలు తయారవుతున్నాయి. మా వాహనాలు పర్యావరణ హితమైనవి కావడం నాకు గర్వంగా ఉంది’’ అన్నారామె.పరిశ్రమ స్థాపించడం, లాభాలార్జించడం వరకే పరిధులు విధించుకోవడం లేదు హేమలత.
సరికొత్త డిజైన్‌ల రూపకల్పన కోసం రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగాన్ని రూపొందించారు. యువ ఇంజనీర్లను నియమించుకుని కొత్త డిజైన్‌ల కోసం పరిశోధనలను ప్రోత్సహిస్తున్నారామె. ‘మిత్ర’ పేరుతో ఆమె తయారు చేసిన మూడు చక్రాల వాహనం కూడా అలాంటిదే. ఇళ్ల నుంచి వ్యర్థాలను సేకరించి ఊరి బయట కంపోస్ట్ యార్డుకు తరలించడానికి అనువుగా తయారైన వాహనంలో 250 కిలోలు, 450 కిలోల కెపాసిటీతో రెండు మోడళ్లు తయారవుతున్నాయి. గ్రామాలు, పట్టణాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన వాహనం అది. తమిళనాడులోని రూరల్ డెవలప్‌మెంట్ విభాగం ఈ వాహనాలను వినియోగించాలనే ఆలోచనలో ఉన్నట్లు కూడా చెప్పారు హేమలత.
– మంజీర
Comments
Please login to add a commentAdd a comment