
న్యూఢిల్లీ: తమకు రావాల్సిన రూ.1,200 కోట్ల సబ్సిడీ బకాయిలు విడుదల చేసేలా కేంద్ర ప్రభుత్వానికి సూచించాలని పార్లమెంటరీ ప్యానెల్‌ను ఎలక్ట్రిక్ వాహన తయారీదారుల సంఘం (ఎస్‌ఎంఈవీ) కోరింది. పరిశ్రమ నిధుల సమస్యను ఎదుర్కొంటుండడం ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణకు అవరోధంగా నిలుస్తోందని పేర్కొంది. ‘‘ఇప్పుడు యావత్‌దేశం ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి సరఫరా వ్యవస్థతో సిద్ధంగా ఉంది. ప్రభుత్వం వద్ద రూ.1,200 కోట్ల సబ్సిడీలు నిలిచిపోవడంతో పరిశ్రమ తీవ్ర నిధుల సమస్యను ఎదుర్కోవాల్సి వస్తోంది.
ప్రభుత్వం, పరిశ్రమ కలసి సమస్యలను పరిష్కరించుకుని, ఎలక్ట్రిక్ వాహన లక్ష్యాలను చేరుకునేందుకు పనిచేయాల్సిన అవసరం ఉంది’’అని ఈవీ పరిశ్రమ కోరింది. ఫేమ్ పథకం కింద సబ్సిడీలను కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నట్టు ఆరోపణలు రావడం తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు సైతం తెలిపింది. ఫేమ్–2 పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల కాలానికి ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లకు రూ.10వేల కోట్లను ప్రోత్సాహకాలను 2019 నుంచి ఇస్తోంది.