FAME-II subsidy reduction to hit electric two-wheelers sales in India - Sakshi
Sakshi News home page

ఎలక్ట్రిక్ టూ వీలర్స్ జోరు తగ్గనుందా? కారణం ఇదే అంటున్న నిపుణులు!

Published Tue, Jun 6 2023 8:24 AM | Last Updated on Tue, Jun 6 2023 8:46 AM

Sales of electric two wheelers will decrease due to decrease in FAME-2 subsidy - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలు మరింత ప్రియం అయ్యాయి. ఇప్పటికే ప్రధాన కంపెనీలు వివిధ మోడళ్ల ధరలను పెంచాయి. ఇతర కంపెనీలు వీటిని అనుసరిస్తున్నాయి. ఫేమ్‌–2 పథకం కింద ఇచ్చే సబ్సిడీకి భారీ పరిశ్రమల శాఖ కోత విధించడమే మోడళ్లు ఖరీదవడానికి కారణం. భారత్‌లో ఎలక్ట్రిక్, హైబ్రిడ్‌ వాహనాల వినియోగం పెరిగేందుకు 2015లో కేంద్రం తీసుకొచ్చిన ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ఆఫ్‌ (హైబ్రిడ్‌) ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ ఇన్‌ ఇండియా (ఫేమ్‌) పథకం దేశీ ఈవీ రంగానికి బూస్ట్‌ ఇచ్చింది అనడంలో  సందేహం లేదు. అయితే ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల సబ్సిడీని అకస్మాత్తుగా తగ్గించడం వల్ల అమ్మకాల్లో భారీ క్షీణతకు దారితీయవచ్చని సొసైటీ ఆఫ్‌ మాన్యుఫాక్చరర్స్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ (ఎస్‌ఎంఈవీ) హెచ్చరించింది. 

సబ్సిడీ తగ్గుదల ఇలా..
2023 జూన్‌ 1 లేదా ఆ తర్వాత రిజిస్టర్‌ అయ్యే ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలపై ఫేమ్‌–2 పథకం కింద సబ్సిడీని తగ్గిస్తూ కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు వెలువరించింది. దీని ప్రకారం కిలోవాట్‌ అవర్‌కు గతంలో ఇచ్చిన రూ.15,000 సబ్సిడీ కాస్తా ఇక నుంచి రూ.10,000 ఉంటుంది. ప్రోత్సాహకాలపై పరిమితి ఎక్స్‌–ఫ్యాక్టరీ ధరలో గతంలో ఉన్న 40 శాతం నుండి 15 శాతానికి చేర్చారు. రానున్న రోజుల్లో పరిశ్రమ వాస్తవిక వృద్ధి చూస్తుందని బజాజ్‌ అర్బనైట్‌ ప్రెసిడెంట్‌ ఎరిక్‌ వాస్‌ సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. కాగా, 2023 మే నెలలో దేశవ్యాప్తంగా అన్ని కంపెనీలవి కలిపి ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలు 1,04,755 యూనిట్లు రోడ్డెక్కాయి. ఏప్రిల్‌తో పోలిస్తే ఇది 57 శాతం అధికం. జూన్‌ 1 నుంచి కొత్త ధరలు అమలులోకి వస్తున్నాయన్న నేపథ్యం కూడా ఈ విక్రయాల జోరుకు కారణమైంది. ఓలా, టీవీఎస్, ఏథర్, బజాజ్, ఆంపియర్‌ టాప్‌–5లో నిలిచాయి.

వృద్ధి వేగానికి కళ్లెం.. 
ప్రభుత్వ చర్యతో ఈ–టూ వీలర్ల వేగానికి కళ్లెం పడుతుందని ఎస్‌ఎంఈవీ తెలిపింది. పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనాలు, ఈ–టూవీలర్ల మధ్య ధర వ్యత్యాసం అమాంతం పెరుగుతుందని రేటింగ్స్‌ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది.  ఈవీల జోరు పెరిగే వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతివ్వాలని అవేరా ఏఐ మొబిలిటీ ఫౌండర్‌ రమణ తెలిపారు.

(ఇదీ చదవండి: భారీగా పెరిగిన వెహికల్ సేల్స్ - గత నెలలో అమ్మకాలు ఇలా..)

కస్టమర్లు సన్నద్ధంగా లేరు.. 
భారత్‌లో ధర సున్నితమైన అంశం అని ఎస్‌ఎంఈవీ ఎస్‌ఎంఈవీ డైరెక్టర్‌ జనరల్‌ సోహిందర్‌ గిల్‌ తెలిపారు. ద్విచక్ర వాహనం కోసం అధికంగా ఖర్చు పెట్టేందుకు కస్టమర్లు సన్నద్ధంగా లేరని స్పష్టం చేశారు. ‘పెట్రోలుతో నడిచే ద్విచక్ర వాహనాల్లో అధిక భాగం మోడళ్లు రూ.1 లక్ష కంటే తక్కువ ధరలో లభిస్తున్నాయి. ఈవీ కోసం రూ.1.5 లక్షలకు పైగా ఖర్చు చేసే అవకాశాలు చాలా తక్కువ. మార్కెట్‌ వృద్ధి చెందే వరకు సబ్సిడీలను కొనసాగించాల్సిందే. భారత్‌లో మొత్తం ద్విచక్ర వాహనాల్లో ఈవీల వాటా ప్రస్తుతం 4.9 శాతమే. అంతర్జాతీయ బెంచ్‌మార్క్‌ ప్రకారం ఇది 20 శాతానికి చేరుకోవడానికి నిరంతర రాయితీలు ఇవ్వాల్సిందే’ అని వివరించారు.

(ఇదీ చదవండి: యూపీఐ నుంచి పొరపాటున డబ్బు పంపించారా? ఇలా చేస్తే మళ్ళీ వస్తాయ్..)

వరుసలో బజాజ్‌ చేతక్‌.. 
బజాజ్‌ చేతక్‌ ధర రూ.22,000 పెరిగింది. దీంతో చేతక్‌ ప్రారంభ ధర ఎక్స్‌షోరూంలో రూ.1.44 లక్షలకు చేరింది. టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ ఐక్యూబ్‌ ధర వేరియంట్‌ను బట్టి రూ.17–22 వేల మధ్య పెరిగింది. ఏథర్‌ 450ఎక్స్‌ ప్రో సుమారు రూ.8,000 అధికం అయింది. దీంతో ఈ మోడల్‌ ప్రారంభ ధర బెంగళూరు ఎక్స్‌షోరూంలో రూ.1,65,435లకు చేరింది. ఓలా ఎలక్ట్రిక్‌ టూ–వీలర్లు రూ.15,000 వరకు ప్రియం అయ్యాయి. ప్రస్తుతం ఎస్‌1–ప్రో రూ.1,39,999, ఎస్‌1 రూ.1,29,999, ఎస్‌1 ఎయిర్‌ ధర రూ.1,09,999 పలుకుతోంది. ఈ–స్కూటర్‌ మోడల్స్‌ ధరలను పెంచబోమని హీరో ఎలక్ట్రిక్‌ ఇప్పటికే తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement