పులి వెనుక పవర్‌ | Her Husband Uddhav Thackeray Played A Key Role In The Political Life Of Rashmi Thackeray | Sakshi
Sakshi News home page

పులి వెనుక పవర్‌

Published Fri, Nov 29 2019 1:36 AM | Last Updated on Fri, Nov 29 2019 5:04 AM

Her Husband Uddhav Thackeray Played A Key Role In The Political Life Of Rashmi Thackeray - Sakshi

ముంబై శివాజీ పార్క్‌ గ్రౌండ్‌లో గురువారం సాయంత్రం శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమైనప్పుడు ఆయన వెనుక ఉన్నది ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీలే కావచ్చు. అయితే రాజకీయాలలో ఆయన అంత దూరం రావడం వెనుక ఉన్న నమ్మకమైన భాగస్వామి మాత్రం ఆయన సతీమణి రశ్మి ఠాక్రే ఒక్కరే! ఎన్సీపీ, కాంగ్రెస్‌లు ఉద్ధవ్‌ని ఈ రోజు నుంచి ఏ క్షణాన్నయినా వదిలిపోవచ్చు. అప్పుడు కూడా ఠాక్రే వెంట ఉండి ఆయనకు దిశానిర్దేశం చేయగల సమర్థురాలు అమె ఒక్కరే. ఉద్ధవ్‌ అనే పులి వెనుక ఉన్న పవర్‌ రశ్మి!!

గత నెల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వర్లీ నియోజకవర్గం నుంచి తమ కుమారుడు ఆదిత్య ఠాక్రేని గెలిపించుకోవడంలో ఉద్ధవ్‌ కంటే కూడా రశ్మినే కీలక పాత్రను పోషించారు. ఆమె వక్త కాకపోవచ్చు. ఆదిత్యకు ప్రసంగకర్త అయ్యారు. ‘‘ప్రజలకు హామీలు కావలసిందే. అంతకన్నా ముందు నమ్మకం కావాలి. అదివ్వు నువ్వు’’ అని కొడుక్కి నుదుటిపై సిందూరం దిద్ది బరిలోకి పంపారు. గెలిచి వచ్చినప్పుడు హారతి పట్టి, నుదుటిపై చుంబనాన్ని అద్దారు. 1966లో బాల్‌ ఠాక్రే శివసేన పార్టీని స్థాపించాక ఆ కుటుంబంలో ఎన్నికల్లో పోటీ చేసిన తొలి వ్యక్తి ఆదిత్య ఠాక్రే. ఇవాళంటే కొడుకు వెనుక ఉన్నారు రశ్మి. భర్త వెనుక వాళ్ల పెళ్లి కాకముందు నుంచే ఉన్నారు! లవ్‌ మ్యారేజ్‌ వాళ్లది. రశ్మి, ఉద్ధవ్‌ తొలిసారి ఒకర్నొకరు చూసుకున్నది ‘జెజె స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్‌’లో. ఇద్దరూ కాలేజ్‌మేట్స్‌. కంబైడ్‌ సబ్జెక్ట్స్‌ ఉన్నప్పుడు క్లాస్‌మేట్స్‌. ఉద్ధవ్‌ వైల్డ్‌గా ఉండేవాడు. ఉండేవాడో లేదో.. పులిలాంటి బాల్‌ ఠాక్రే కొడుకన్న ఇమేజ్‌ మాత్రం ఉండేది. రశ్మి సాఫ్ట్‌గా ఉండేవారు.

ఉండేవారో లేదో.. వ్రతాలప్పుడు ఆమె పెట్టుకొచ్చే కుంకుమ అలాంటి ఇమేజ్‌ని ఇచ్చేది. విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. అలాగే ఆ వైల్డ్, ఈ సాఫ్ట్‌ ఆకర్షించుకున్నాయి. ‘‘హాయ్‌.. నా పేరు ఠాక్రే. ఉద్ధవ్‌ ఠాక్రే’’ ‘‘తెలుసు’’ అని ఊరుకోలేదు రశ్మి. ‘‘నేను రశ్మి’’ అని తన పేరు చెప్పుకుంది. అది నచ్చింది ఉద్ధవ్‌కి. ముంబై దగ్గరి దొంబివ్లీలోని బిజినెస్‌ మ్యాన్‌ కూతురుగా రశ్మి పేరు కాలేజ్‌లో అందరికీ తెలుసు. అయినా తన పేరు చెప్పుకుంది. ‘‘మీది పొలిటికల్‌ ఫ్యామిలీ కదా’’ – రశ్మి. ‘‘అవును. కానీ నాకు ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. వైల్డ్‌ ఫొటోగ్రఫీ’’ ‘‘మీది బిజినెస్‌ ఫ్యామిలీ కదా’’ – ఉద్ధవ్‌ ‘‘అవును. కానీ నాకు ఉస్తాద్‌ గులామ్‌ అలీ అంటే ఇష్టం. ఆయన గజల్స్‌’’. ఉద్ధవ్‌ నవ్వాడు. ‘‘అనుకున్నా, మీరు ఇప్పటికే ఎవర్నో లవ్‌ చేస్తూ ఉండి ఉంటారని. నేనూ.. లవ్‌ చేస్తున్నాను.. నా ఫొటోగ్రఫీతో పాటు మీ వాయిస్‌ని. ఉస్తాద్‌ మీ చేత రాగం తీయిస్తున్నట్లుగా ఉంటుంది మీరు మాట్లాడుతుంటే’’ అన్నాడు.

అప్పుడు మొలకెత్తిందేమో తెలీదు, అప్పుడు మొలకెత్తేదేమో తెలియదు.. వాళ్ల మధ్య ప్రేమ. కానీ కాలేజ్‌ అయిపోయింది. ఆరోజుకు అయిపోవడం కాదు. కాలేజ్‌ చదువే అయిపోయింది. రశ్మి, ఉద్ధవ్‌.. ఎవరి జీవితాల్లోకి వాళ్లు. ‘180 డే’ అని 1987లో ఎల్‌.ఐ.సి. ఒక కొత్త స్కీమ్‌ని తెచ్చింది. అందులో కాంట్రాక్ట్‌ ఎంప్లాయీగా చేరారు రశ్మి. అక్కడే జయజయవంతి అనే అమ్మాయి చేరింది. జయజయవంతి రాజ్‌ ఠాక్రే సిస్టర్‌. ఓరోజు ఆమె రశ్మికి ఒక వ్యక్తిని పరిచయం చేసింది. ‘‘ఈయన మా పెదనాన్న కొడుకు ఉద్ధవ్‌ ఠాక్రే’’ అలా వైల్డ్‌ లైఫ్, సాఫ్ట్‌ సాంగ్‌ మళ్లీ కలుసుకున్నాయి. రశ్మి ఎల్‌.ఐ.సి.లో చేస్తుంటే ఉద్ధవ్‌ సొంత యాడ్‌ ఏజెన్సీ నడుపుతున్నాడు. ‘చౌరంగ్‌’ ఆ ఏజెన్సీ పేరు. ‘‘చౌరంగ్‌ ఎలా నడుస్తోంది?’’ అన్నారు రశ్మి. ‘‘నన్ను నడిపిస్తోంది’’ అని నవ్వాడు ఉద్ధవ్‌. రశ్మీకి అర్థమైంది. ఫొటోగ్రఫీ నా లైఫ్‌ అని చెబుతున్నాడు అతను. మనిషిని సేద తీర్చేందుకు ఒక ఇష్టం ఉండాలి. అయితే సేద తీరేందుకు అవసరమైనంత వ్యాపకం ఒకటి ఉండాలి.

రశ్మి అప్పటికే పుట్టింటి వ్యాపారాలలో సలహాల భాగస్వామి. సమాంతరంగా ఒక చిన్న ఉద్యోగం. వీటి నుంచి సేద తీరేందుకు ఉస్తాద్‌ అలీ. ఉద్ధవ్‌కి వ్యాపకం, జీవితం.. రెండూ ఫొటోగ్రఫీనే. ఉద్ధవ్‌ రాజకీయాల్లోకి వెళితే బాగుంటుందని రశ్మికి అనిపించింది. అనిపించింది అంతే. ఆ మాటను అతడితో అనలేదు. అనే అవసరం త్వరలోనే వస్తుందని ఆమెకు కూడా తెలీదు. 1989 డిసెంబర్‌ 13న రశ్మి, ఉద్ధవ్‌ల పెళ్లి జరిగింది. తండ్రి మాధవ్‌ పటంకర్, తల్లి మీనాతాయ్, ఓ సోదరి.. ఇదీ రశ్మి పుట్టిల్లు. మామగారు బాల్‌ ఠాక్రే, అత్త మీనా ఠాక్రే, భర్త ఉద్ధవ్‌ ఠాక్రే, భర్త సోదరులు బిందు మాధవ్‌ ఠాక్రే, జయ్‌దేవ్‌ ఠాక్రే, ఆ ఇంటికి రాకపోకలు సాగిస్తుండే భర్త చిన్నాన్న కొడుకు రాజ్‌ ఠాక్రే.. ఇదీ పెళ్లయ్యే నాటికి రశ్మి మెట్టిల్లు. రెండిళ్ల కూతురిగా రెండిళ్లకూ కావలసినంత బలాన్ని ఇచ్చారు రశ్మి. ఇంట్లో సలహాలకు రశ్మి, సందేహాలొస్తే రశ్మి. పార్టీ సంశయాలలో రశ్మి, సంకోచాలలో రశ్మి. అత్తగారు ఉన్నంతకాలం కోడలు తన పక్కనే ఉండాలని కోరుకున్నారు.

మామగారు ఉన్నంతకాలం ఆయనకు, పార్టీకీ అండగా ఉన్నారు రశ్మి. బాల్‌ ఠాక్రే జబ్బన పడినప్పుడు ఆయన్ని చూడ్డానికి వచ్చే శివసైనికులకు భోజనం పెట్టకుండా పంపించలేదు రశ్మి! ఠాక్రే వార్థక్యంలో శివసేనకు వారసుడెవరన్న ప్రశ్న వచ్చింది. వాస్తవానికి ఆ ప్రశ్న అప్పటికి ఆరేళ్ల ముందరే తలెత్తింది. ఉద్ధవ్‌కి రాజకీయాలంటే ఆసక్తి లేదు. రాజ్‌కి రాజకీయాలు తప్ప వేరే ఆసక్తి లేదు. పెద్దయాన తల కూడా రాజ్‌ వైపే తిరిగింది. సరిగ్గా ఆ సమయంలో రశ్మి రంగంలోకి దిగారు. మామగారిని, భర్తను ఒప్పించి పార్టీ ఇల్లుదాటిపోకుండా చేయగలిగారు. రాజ్‌ బయటికి వెళ్లిపోయాడు. ‘మహారాష్ట్ర నవనిర్మాణ సేన’ను పెట్టుకున్నాడు. రశ్మి మీద ఉద్ధవ్‌కి ప్రేమ కన్నా గౌరవం ఎక్కువ.

ఆ సంగతి తరచు ఆయన సోషల్‌ మీడియాలో విడుదల చేసే ఫొటోల్లో కనిపిస్తుంది. ప్రతి ముఖ్య కార్యక్రమంలో ఉద్ధవ్‌ పక్కన రశ్మి ఉండాల్సిందే. ఆమె చిరునవ్వులు చిందిస్తూ ఉండాల్సిందే. ఉద్ధవ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్న వార్త వచ్చినప్పటి నుంచీ రశ్మి నిర్విరామంగా రింగ్‌ అవుతూనే ఉంది. ఉద్ధవ్‌ ముఖ్యమంత్రి అవుతున్నందుకు వచ్చే అభినందనలతో పాటు, ఉద్ధవ్‌వి ముఖ్యమంత్రి చేసినందుకు రశ్మికి వస్తున్న ఆత్మబంధువుల ఆశీస్సులూ వాటిల్లో ఉన్నాయి! రశ్మి నేరుగా అందుబాటులో లేకపోవడంతో ఆమె మేనమామ దిలీప్‌ శృంగార్‌పూర్‌కూ మీడియా తాకిడి ఎక్కువైంది. ‘‘చాలా పట్టుదల గల అమ్మాయి. పెద్దగా మాట్లాడదు. ఎప్పుడూ తన పనిలో లీనమై ఉంటుంది’’ అని మాత్రమే ఆయన చెప్పగలిగింది చెబుతున్నారు.

ఏమిటి రశ్మి అంతగా లీనం అయ్యే పని?! రెండు కంపెనీలకు ఆమె డైరెక్టర్‌. సంవేద్‌ రియల్‌ ఎస్టేట్‌ లిమిటెడ్, సహయోగ్‌ డీలర్స్‌ ప్రైవేట్‌ లిమిడెట్‌ ఆమె సారథ్యంలో నడుస్తున్నాయి. వీటితోపాటు మరో మూడు కంపెనీల్లో రశ్మికి వాటా ఉంది. తల్లీ కొడుకులు కలసి ఎలోరియా సోలార్‌ ఎల్‌ఎల్‌పి, హైబిస్కస్‌ ఎల్‌ఎల్‌పి, కోమో స్టాక్స్‌ అండ్‌ ప్రాపర్టీస్‌ ఎల్‌ఎల్‌పి అనే కంపెనీలకు కో–డైరెక్టర్‌లు. ఇప్పుడిక ఆ కంపెనీల పూర్తి బాధ్యలు ఆమే చూసుకోవాలి. ముఖ్యమంత్రిగా భర్త, ఎమ్మెల్యేగా కొడుకు రశ్మికి ఇప్పుడు అదనంగా పెట్టిన మరొక బాధ్యత ఎటూ ఉంటుంది.. ప్రజలకు వారిద్దరినీ ఎల్లవేళలా అందుబాటులో ఉంచడం.   

అటు రశ్మి.. ఇటు సుప్రియ
రశ్మీ ఠాక్రే తన భర్త ఉద్ధవ్‌ ఠాక్రే రాజకీయ జీవితంలో ఎలాగైతే కీలకమైన పాత్ర పోషించారో.. సుప్రియా సూలె తన తండ్రి శరద్‌ పవార్‌ రాజకీయ జీవితపు ఒత్తిళ్లలో అంతగా అండగా ఉన్నారు. ఇటీవలి మహారాష్ట్ర పరిణామాలనే చూడండి. ఉద్ధవ్‌ ఠాక్రే ముఖ్యమంత్రి అవడం దాదాపుగా ఖరారు అయిన గడియల్లో సొంత పార్టీ నుంచి పెదనాన్న కొడుకు అజిత్‌ పవార్‌ ప్రత్యర్థి వర్గంలోకి వెళ్లడంతో అకస్మాత్తుగా సమీకరణలు మారిపోయి ఫడ్నవిస్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పవార్‌ దిగ్భ్రాంతికి లోనయ్యారు. సుప్రియ ఆ సమయంలో తండ్రికి తోడుగా ఉండి.. కుటుంబాన్ని, పార్టీని కలిపి ఉంచే ప్రయత్నాలన్నీ తనే స్వయంగా చేశారు. అజిత్‌ని తిరిగి బీజేపీ కూటమి నుంచి బయటికి రప్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement