Rashmi Thackeray
-
మహారాష్ట్ర సీఎం భార్యపై అభ్యంతరకర పోస్టు..
పుణె: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే భార్య రశ్మీ ఠాక్రేను బిహార్ మాజీ సీఎం రబ్రీదేవిగా పేర్కొంటూ ట్వీట్ చేసిన బీజేపీ సోషల్ మీడియా సెల్ ఇన్చార్జి జితేన్ గజారియాపై పుణె పోలీసులు కేసు నమోదు చేశారు. రశ్మీ ఠాక్రే ఫొటోపై మరాఠీ రబ్రీదేవిగా పేర్కొంటూ గజారియా పెట్టిన వివాదాస్పద పోస్టుపై శివసేన కార్యకర్త ఒకరు ఫిర్యాదు చేశారు. దీంతో, ముంబై పోలీసులు గురువారం గజారియాను సుమారు నాలుగున్నర గంటలపాటు ప్రశ్నించి, వాంగ్మూలాన్ని నమోదు చేశారు. -
‘మీ భార్యకు ఎలా ఉంది ఉద్దవ్‌జీ?’ ప్రధాని ఆరా
ముంబై: కరోనా వైరస్ బారిన పడిన ప్రముఖుల ఆరోగ్య వివరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీస్తున్నారు. వారి ఆరోగ్యం, అందుతున్న వైద్యం, యోగక్షేమాలు తదితర అంశాలపై సంబంధీకులతో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో కరోనా బారినపడిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే సతీమణి రష్మీ ఠాక్రే ఆరోగ్యం గురించి ప్రధాని అడిగి తెలుసుకున్నారు. మార్చి 23వ తేదీన ఆమె కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే తీవ్రమైన దగ్గు ఉండడంతో ఆమె ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా ప్రధాని ఆమె ఆరోగ్య విషయాలు ఆరా తీశారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రధాని ప్రార్థించారు. ఆమె దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. దీంతో పాటు మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ ఆరోగ్య పరిస్థితిని ప్రధాని మోదీ తెలుసుకున్నారు. దేవెగౌడ, ఆయన భార్య చెన్నమ్మకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారు కుటుంబసభ్యులతో కలిసి హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా వారి ఆరోగ్య విషయాలు తెలుసుకున్నట్లు మోదీ బుధవారం ట్వీట్ చేశారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. వారి ఆరోగ్యంపై కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రత్యేక దృష్టి పెట్టారు. వారికి చికిత్స అందిస్తున్న వైద్యులతో సంప్రదింపులు చేస్తున్నట్లు యడియూరప్ప తెలిపారు. చదవండి: అర్ధరాత్రి ఆస్పత్రిలో చేరిన ముఖ్యమంత్రి సతీమణి -
అర్ధరాత్రి ఆస్పత్రిలో చేరిన ముఖ్యమంత్రి సతీమణి
ముంబై: మహమ్మారి కరోనా వైరస్ బారిన పడిన ముఖ్యమంత్రి సతీమణి అర్ధరాత్రి ఆస్పత్రిలో చేరారు. కరోనా బారిన పడిన అనంతరం హోం ఐసోలేషన్‌లో ఉన్న ఆమె అకస్మాత్తుగా మంగళవారం అర్ధరాత్రి ప్రైవేటు ఆస్పత్రిలో చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఆమె ఆరోగ్యం క్షీణించిందనే పుకార్లు వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సతీమణి రష్మీ ఠాక్రేకు మార్చ్ 23వ తేదీన పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అయితే అప్పటి నుంచి హోం క్వారంటైన్లో ఉన్న ఆమె మంగళవారం అర్ధరాత్రి ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో చేరారు. అంతకుముందు అంటే మార్చి 11వ తేదీన రష్మీ భర్తతో కలిసి కోవిడ్ టీకా తీసుకున్నారు. అయినా కూడా పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది. ఆమె తీవ్ర దగ్గుతో బాధపడుతున్నారని గుర్తించి వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో రష్మీ ఠాక్రే చేరారు. అంతకుముందు భర్త, సీఎం ఉద్దవ్‌కు, అతడి కుమారుడు, మంత్రి ఆదిత్య ఠాక్రే కూడా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో కరోనా మళ్లీ కరోనా విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. రోజుకు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. -
సీఎం సతీమణికి కరోనా పాజిటివ్
సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సతీమణి, సామ్నా దినపత్రిక సంపాదకురాలు రష్మీ ఠాక్రేకు కరోనా సోకింది. ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా రిపోర్టులో పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమె ముంబైలోని ప్రభుత్వ అధికార నివాసమైన వర్షా బంగ్లాలో హోం క్వారంటైన్లో ఉన్నారు. రెండు రోజుల కిందట రష్మీ ఠాక్రేకు జలుబు చేసింది. దీంతో పరీక్షలు చేయించుకున్నారు. అందులో ఆమెకు కరోనా సోకినట్లు నివేదిక రావడంతో అప్రమత్తమయ్యారు. వెంటనే హోం క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం రష్మీ ఠాక్రే ఆరోగ్యం నిలకడగానే ఉందని, మందులు వాడుతున్నారని వైద్యులు తెలిపారు. ఇటీవలే పర్యావరణ శాఖ మంత్రి, ఉద్ధవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రేకు కూడా కరోనా సోకింది. దీంతో కుటుంబ సభ్యులందరు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. చదవండి: (రాజకీయాలకు రాంరాం: దీప) -
‘సామ్నా’ఎడిటర్‌గా సీఎం సతీమణి
సాక్షి, ముంబై : శివసేన పార్టీ పత్రిక ‘సామ్నా’ సంపాదకురాలిగా ఆ పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సతీమణి రష్మీ ఠాక్రే ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ కొనసాగనున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే వరకూ, ఉద్ధవ్ సంపాదకుడిగా కొనసాగారు. సామ్నాకు మొదటి సంపాదకుడిగా బాల్ ఠాక్రే వ్యవహరించగా, ఆయన మరణాంతరం ఉద్ధవ్ ఠాక్రే బాధ్యతలు స్వీకరించారు. జనవరి 23,1988న సామ్నా పత్రికను దివంగత బాల్‌ఠాక్రే ప్రారంభించారు. 2012లో ఆయన మరణించేవరకు ఆయన సంపాదకుడిగా కొనసాగారు. అనంతరం ఆయన కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే ఆ బాధ్యతలు తీసుకున్నారు. గత ఏడాది ఆయనకు సీఎం పదవి వరించిన నేపథ్యంలో ఎడిటర్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. -
రశ్మికు అమృత ఫడ్నవిస్ అభినందనలు..
సాక్షి, ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సతీమణి రశ్మి ఠాక్రే శివసేన అధికార పత్రిక సామ్నా ఎడిటర్‌గా నియమితులైన విషయం తెలిసిందే. దీనిపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సతీమణి అమృత ఫడ్నవిస్ స్పందించారు. సామ్నా ఎడిటర్‌గా బాధ్యతలు స్పీకరించినందుకు రశ్మికి అభినందనలు తెలిపారు. అన్ని రంగాల్లో మహిళ ప్రాతినిథ్యం పెరగాలని ఆమె అభిప్రాయపడ్డారు. మహిళలు ముఖ్య స్థానాల్లో ఉంటేనే వారి అభిప్రాయాలను స్పష్టంగా బయటపెట్టగలరని పేర్కొన్నారు. ఈ మేరకు అమృత తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. (సామ్నా ఎడిటర్‌గా రశ్మి ఠాక్రే) కాగా ఆదివారం వెలువడిన సామ్నా పేపర్లో రశ్మిని ఎడిటర్‌గా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. సామ్నా ఎడిటర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ రశ్మినే కావడం విశేషం. మరోవైపు శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ యథావిథిగా సామ్నా కార్యనిర్వహక ఎడిటర్‌గా కొనసాగనున్నారు. -
రశ్మికి కీలక బాధ్యతలు..
ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సతీమణి రశ్మి ఠాక్రే కీలక బాధ్యతలు చేపట్టారు. శివసేన అధికార పత్రిక సామ్నా ఎడిటర్‌గా ఆమె నియమితులయ్యారు. ఆదివారం వెలువడిన సామ్నా పేపర్లో రశ్మిని ఎడిటర్‌గా పేర్కొన్నారు . సామ్నా ఎడిటర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ రశ్మినే కావడం విశేషం. కాగా, ఉద్ధవ్ రాజకీయాల్లో రాణించడానికి రశ్మి పాత్ర కూడా ఉందని ఆయన సన్నిహితులు చెబుతారు. మహా అసెంబ్లీ ఎన్నికల్లో వర్లీ నియోజకవర్గం నుంచి తమ కుమారుడు ఆదిత్య ఠాక్రేని గెలిపించుకోవడంలో ఉద్ధవ్ కంటే కూడా రశ్మినే కీలక పాత్రను పోషించారు. 1989 డిసెంబర్ 13న రశ్మి, ఉద్ధవ్‌ల పెళ్లి జరిగింది. బాల్ ఠాక్రే ఉన్నంతకాలం ఆయనకు, పార్టీకీ అండగా ఉన్నారు రశ్మి. బాల్ ఠాక్రే జబ్బన పడినప్పుడు ఆయన్ని చూడ్డానికి వచ్చే శివసైనికులకు భోజనం పెట్టకుండా పంపించలేదు రశ్మి! ఠాక్రే వార్థక్యంలో శివసేనకు వారసుడెవరన్న ప్రశ్న వచ్చింది. వాస్తవానికి ఆ ప్రశ్న అప్పటికి ఆరేళ్ల ముందరే తలెత్తింది. ఉద్ధవ్‌కి రాజకీయాలంటే ఆసక్తి లేదు. రాజ్‌కి రాజకీయాలు తప్ప వేరే ఆసక్తి లేదు. పెద్దయాన తల కూడా రాజ్ వైపే తిరిగింది. సరిగ్గా ఆ సమయంలో రశ్మి రంగంలోకి దిగారు. మామగారిని, భర్తను ఒప్పించి పార్టీ ఇల్లుదాటిపోకుండా చేయగలిగారు. మరోవైపు శివసేన సీనియర్ నాయకులు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ యథావిథిగా సామ్నా కార్యనిర్వహక ఎడిటర్‌గా కొనసాగనున్నారు. మహారాష్ట్రలో శివసేన వాయిస్ వినిపించాలనే లక్ష్యంతో ఆ పార్టీ వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే ఈ పత్రికను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. (పులి వెనుక పవర్) -
పులి వెనుక పవర్
ముంబై శివాజీ పార్క్ గ్రౌండ్లో గురువారం సాయంత్రం శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమైనప్పుడు ఆయన వెనుక ఉన్నది ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలే కావచ్చు. అయితే రాజకీయాలలో ఆయన అంత దూరం రావడం వెనుక ఉన్న నమ్మకమైన భాగస్వామి మాత్రం ఆయన సతీమణి రశ్మి ఠాక్రే ఒక్కరే! ఎన్సీపీ, కాంగ్రెస్‌లు ఉద్ధవ్‌ని ఈ రోజు నుంచి ఏ క్షణాన్నయినా వదిలిపోవచ్చు. అప్పుడు కూడా ఠాక్రే వెంట ఉండి ఆయనకు దిశానిర్దేశం చేయగల సమర్థురాలు అమె ఒక్కరే. ఉద్ధవ్ అనే పులి వెనుక ఉన్న పవర్ రశ్మి!! గత నెల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వర్లీ నియోజకవర్గం నుంచి తమ కుమారుడు ఆదిత్య ఠాక్రేని గెలిపించుకోవడంలో ఉద్ధవ్ కంటే కూడా రశ్మినే కీలక పాత్రను పోషించారు. ఆమె వక్త కాకపోవచ్చు. ఆదిత్యకు ప్రసంగకర్త అయ్యారు. ‘‘ప్రజలకు హామీలు కావలసిందే. అంతకన్నా ముందు నమ్మకం కావాలి. అదివ్వు నువ్వు’’ అని కొడుక్కి నుదుటిపై సిందూరం దిద్ది బరిలోకి పంపారు. గెలిచి వచ్చినప్పుడు హారతి పట్టి, నుదుటిపై చుంబనాన్ని అద్దారు. 1966లో బాల్ ఠాక్రే శివసేన పార్టీని స్థాపించాక ఆ కుటుంబంలో ఎన్నికల్లో పోటీ చేసిన తొలి వ్యక్తి ఆదిత్య ఠాక్రే. ఇవాళంటే కొడుకు వెనుక ఉన్నారు రశ్మి. భర్త వెనుక వాళ్ల పెళ్లి కాకముందు నుంచే ఉన్నారు! లవ్ మ్యారేజ్ వాళ్లది. రశ్మి, ఉద్ధవ్ తొలిసారి ఒకర్నొకరు చూసుకున్నది ‘జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్’లో. ఇద్దరూ కాలేజ్‌మేట్స్. కంబైడ్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు క్లాస్మేట్స్. ఉద్ధవ్ వైల్డ్‌గా ఉండేవాడు. ఉండేవాడో లేదో.. పులిలాంటి బాల్ ఠాక్రే కొడుకన్న ఇమేజ్ మాత్రం ఉండేది. రశ్మి సాఫ్ట్‌గా ఉండేవారు. ఉండేవారో లేదో.. వ్రతాలప్పుడు ఆమె పెట్టుకొచ్చే కుంకుమ అలాంటి ఇమేజ్‌ని ఇచ్చేది. విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. అలాగే ఆ వైల్డ్, ఈ సాఫ్ట్ ఆకర్షించుకున్నాయి. ‘‘హాయ్.. నా పేరు ఠాక్రే. ఉద్ధవ్ ఠాక్రే’’ ‘‘తెలుసు’’ అని ఊరుకోలేదు రశ్మి. ‘‘నేను రశ్మి’’ అని తన పేరు చెప్పుకుంది. అది నచ్చింది ఉద్ధవ్‌కి. ముంబై దగ్గరి దొంబివ్లీలోని బిజినెస్ మ్యాన్ కూతురుగా రశ్మి పేరు కాలేజ్‌లో అందరికీ తెలుసు. అయినా తన పేరు చెప్పుకుంది. ‘‘మీది పొలిటికల్ ఫ్యామిలీ కదా’’ – రశ్మి. ‘‘అవును. కానీ నాకు ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. వైల్డ్ ఫొటోగ్రఫీ’’ ‘‘మీది బిజినెస్ ఫ్యామిలీ కదా’’ – ఉద్ధవ్ ‘‘అవును. కానీ నాకు ఉస్తాద్ గులామ్ అలీ అంటే ఇష్టం. ఆయన గజల్స్’’. ఉద్ధవ్ నవ్వాడు. ‘‘అనుకున్నా, మీరు ఇప్పటికే ఎవర్నో లవ్ చేస్తూ ఉండి ఉంటారని. నేనూ.. లవ్ చేస్తున్నాను.. నా ఫొటోగ్రఫీతో పాటు మీ వాయిస్‌ని. ఉస్తాద్ మీ చేత రాగం తీయిస్తున్నట్లుగా ఉంటుంది మీరు మాట్లాడుతుంటే’’ అన్నాడు. అప్పుడు మొలకెత్తిందేమో తెలీదు, అప్పుడు మొలకెత్తేదేమో తెలియదు.. వాళ్ల మధ్య ప్రేమ. కానీ కాలేజ్ అయిపోయింది. ఆరోజుకు అయిపోవడం కాదు. కాలేజ్ చదువే అయిపోయింది. రశ్మి, ఉద్ధవ్.. ఎవరి జీవితాల్లోకి వాళ్లు. ‘180 డే’ అని 1987లో ఎల్.ఐ.సి. ఒక కొత్త స్కీమ్‌ని తెచ్చింది. అందులో కాంట్రాక్ట్ ఎంప్లాయీగా చేరారు రశ్మి. అక్కడే జయజయవంతి అనే అమ్మాయి చేరింది. జయజయవంతి రాజ్ ఠాక్రే సిస్టర్. ఓరోజు ఆమె రశ్మికి ఒక వ్యక్తిని పరిచయం చేసింది. ‘‘ఈయన మా పెదనాన్న కొడుకు ఉద్ధవ్ ఠాక్రే’’ అలా వైల్డ్ లైఫ్, సాఫ్ట్ సాంగ్ మళ్లీ కలుసుకున్నాయి. రశ్మి ఎల్.ఐ.సి.లో చేస్తుంటే ఉద్ధవ్ సొంత యాడ్ ఏజెన్సీ నడుపుతున్నాడు. ‘చౌరంగ్’ ఆ ఏజెన్సీ పేరు. ‘‘చౌరంగ్ ఎలా నడుస్తోంది?’’ అన్నారు రశ్మి. ‘‘నన్ను నడిపిస్తోంది’’ అని నవ్వాడు ఉద్ధవ్. రశ్మీకి అర్థమైంది. ఫొటోగ్రఫీ నా లైఫ్ అని చెబుతున్నాడు అతను. మనిషిని సేద తీర్చేందుకు ఒక ఇష్టం ఉండాలి. అయితే సేద తీరేందుకు అవసరమైనంత వ్యాపకం ఒకటి ఉండాలి. రశ్మి అప్పటికే పుట్టింటి వ్యాపారాలలో సలహాల భాగస్వామి. సమాంతరంగా ఒక చిన్న ఉద్యోగం. వీటి నుంచి సేద తీరేందుకు ఉస్తాద్ అలీ. ఉద్ధవ్‌కి వ్యాపకం, జీవితం.. రెండూ ఫొటోగ్రఫీనే. ఉద్ధవ్ రాజకీయాల్లోకి వెళితే బాగుంటుందని రశ్మికి అనిపించింది. అనిపించింది అంతే. ఆ మాటను అతడితో అనలేదు. అనే అవసరం త్వరలోనే వస్తుందని ఆమెకు కూడా తెలీదు. 1989 డిసెంబర్ 13న రశ్మి, ఉద్ధవ్‌ల పెళ్లి జరిగింది. తండ్రి మాధవ్ పటంకర్, తల్లి మీనాతాయ్, ఓ సోదరి.. ఇదీ రశ్మి పుట్టిల్లు. మామగారు బాల్ ఠాక్రే, అత్త మీనా ఠాక్రే, భర్త ఉద్ధవ్ ఠాక్రే, భర్త సోదరులు బిందు మాధవ్ ఠాక్రే, జయ్‌దేవ్ ఠాక్రే, ఆ ఇంటికి రాకపోకలు సాగిస్తుండే భర్త చిన్నాన్న కొడుకు రాజ్ ఠాక్రే.. ఇదీ పెళ్లయ్యే నాటికి రశ్మి మెట్టిల్లు. రెండిళ్ల కూతురిగా రెండిళ్లకూ కావలసినంత బలాన్ని ఇచ్చారు రశ్మి. ఇంట్లో సలహాలకు రశ్మి, సందేహాలొస్తే రశ్మి. పార్టీ సంశయాలలో రశ్మి, సంకోచాలలో రశ్మి. అత్తగారు ఉన్నంతకాలం కోడలు తన పక్కనే ఉండాలని కోరుకున్నారు. మామగారు ఉన్నంతకాలం ఆయనకు, పార్టీకీ అండగా ఉన్నారు రశ్మి. బాల్ ఠాక్రే జబ్బన పడినప్పుడు ఆయన్ని చూడ్డానికి వచ్చే శివసైనికులకు భోజనం పెట్టకుండా పంపించలేదు రశ్మి! ఠాక్రే వార్థక్యంలో శివసేనకు వారసుడెవరన్న ప్రశ్న వచ్చింది. వాస్తవానికి ఆ ప్రశ్న అప్పటికి ఆరేళ్ల ముందరే తలెత్తింది. ఉద్ధవ్‌కి రాజకీయాలంటే ఆసక్తి లేదు. రాజ్‌కి రాజకీయాలు తప్ప వేరే ఆసక్తి లేదు. పెద్దయాన తల కూడా రాజ్ వైపే తిరిగింది. సరిగ్గా ఆ సమయంలో రశ్మి రంగంలోకి దిగారు. మామగారిని, భర్తను ఒప్పించి పార్టీ ఇల్లుదాటిపోకుండా చేయగలిగారు. రాజ్ బయటికి వెళ్లిపోయాడు. ‘మహారాష్ట్ర నవనిర్మాణ సేన’ను పెట్టుకున్నాడు. రశ్మి మీద ఉద్ధవ్‌కి ప్రేమ కన్నా గౌరవం ఎక్కువ. ఆ సంగతి తరచు ఆయన సోషల్ మీడియాలో విడుదల చేసే ఫొటోల్లో కనిపిస్తుంది. ప్రతి ముఖ్య కార్యక్రమంలో ఉద్ధవ్ పక్కన రశ్మి ఉండాల్సిందే. ఆమె చిరునవ్వులు చిందిస్తూ ఉండాల్సిందే. ఉద్ధవ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్న వార్త వచ్చినప్పటి నుంచీ రశ్మి నిర్విరామంగా రింగ్ అవుతూనే ఉంది. ఉద్ధవ్ ముఖ్యమంత్రి అవుతున్నందుకు వచ్చే అభినందనలతో పాటు, ఉద్ధవ్వి ముఖ్యమంత్రి చేసినందుకు రశ్మికి వస్తున్న ఆత్మబంధువుల ఆశీస్సులూ వాటిల్లో ఉన్నాయి! రశ్మి నేరుగా అందుబాటులో లేకపోవడంతో ఆమె మేనమామ దిలీప్ శృంగార్పూర్కూ మీడియా తాకిడి ఎక్కువైంది. ‘‘చాలా పట్టుదల గల అమ్మాయి. పెద్దగా మాట్లాడదు. ఎప్పుడూ తన పనిలో లీనమై ఉంటుంది’’ అని మాత్రమే ఆయన చెప్పగలిగింది చెబుతున్నారు. ఏమిటి రశ్మి అంతగా లీనం అయ్యే పని?! రెండు కంపెనీలకు ఆమె డైరెక్టర్. సంవేద్ రియల్ ఎస్టేట్ లిమిటెడ్, సహయోగ్ డీలర్స్ ప్రైవేట్ లిమిడెట్ ఆమె సారథ్యంలో నడుస్తున్నాయి. వీటితోపాటు మరో మూడు కంపెనీల్లో రశ్మికి వాటా ఉంది. తల్లీ కొడుకులు కలసి ఎలోరియా సోలార్ ఎల్ఎల్పి, హైబిస్కస్ ఎల్ఎల్పి, కోమో స్టాక్స్ అండ్ ప్రాపర్టీస్ ఎల్ఎల్పి అనే కంపెనీలకు కో–డైరెక్టర్లు. ఇప్పుడిక ఆ కంపెనీల పూర్తి బాధ్యలు ఆమే చూసుకోవాలి. ముఖ్యమంత్రిగా భర్త, ఎమ్మెల్యేగా కొడుకు రశ్మికి ఇప్పుడు అదనంగా పెట్టిన మరొక బాధ్యత ఎటూ ఉంటుంది.. ప్రజలకు వారిద్దరినీ ఎల్లవేళలా అందుబాటులో ఉంచడం. అటు రశ్మి.. ఇటు సుప్రియ రశ్మీ ఠాక్రే తన భర్త ఉద్ధవ్ ఠాక్రే రాజకీయ జీవితంలో ఎలాగైతే కీలకమైన పాత్ర పోషించారో.. సుప్రియా సూలె తన తండ్రి శరద్ పవార్ రాజకీయ జీవితపు ఒత్తిళ్లలో అంతగా అండగా ఉన్నారు. ఇటీవలి మహారాష్ట్ర పరిణామాలనే చూడండి. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అవడం దాదాపుగా ఖరారు అయిన గడియల్లో సొంత పార్టీ నుంచి పెదనాన్న కొడుకు అజిత్ పవార్ ప్రత్యర్థి వర్గంలోకి వెళ్లడంతో అకస్మాత్తుగా సమీకరణలు మారిపోయి ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పవార్ దిగ్భ్రాంతికి లోనయ్యారు. సుప్రియ ఆ సమయంలో తండ్రికి తోడుగా ఉండి.. కుటుంబాన్ని, పార్టీని కలిపి ఉంచే ప్రయత్నాలన్నీ తనే స్వయంగా చేశారు. అజిత్‌ని తిరిగి బీజేపీ కూటమి నుంచి బయటికి రప్పించారు. -
ఉద్ధవ్ విజయం వెనుక ఆమె!
రష్మి ఠాక్రే.. మరాఠీయులకు ఈ పేరు సుపరిచితం. మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే సతీమణి ఈమె. తన భర్త సీఎంగా ఎన్నిక కావడంతో వెల్లువలా వచ్చిపడుతున్న అభినందన సందేశాలకు జవాబిస్తూ తీరిక లేకుండా ఉన్నారామె. రాజకీయాల్లో ఉద్ధవ్ విజయం వెనుక రష్మి పాత్ర ఎంతో ఉందని సన్నిహితులు చెబుతుంటారు. ‘రష్మి ఎల్లప్పుడు నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఆమెలో అంకితభావం మెండు. ఎక్కువ మాట్లాకపోయినప్పటికీ, ఎల్లవేళలా పనిలో నిమగ్నమతుతుంద’ని రష్మి బాబాయ్ అయిన వ్యాపారవేత్త దిలీప్ షింగార్‌పురె వెల్లడించారు. డొంబివిల్లీలోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన రష్మి 1980 దశకం చివరల్లో వాజె-కేల్కర్ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. ఆమె తండ్రి మాధవ్ రతన్కర్ కుటుంబ వ్యాపారం నిర్వహిస్తుండేవారు. తల్లి మీనాతాయ్ ప్రభావం రష్మి, ఆమె సోదరిపై ఎక్కువగా ఉంది. ‘రష్మికి తన తల్లిదండ్రులతో పాటు మెట్టినింటి వారితోనూ గాఢమైన అనుబంధం ఉంది. పిల్లలకు మంచి విలువలు నేర్పితే కుటుంబ బంధాలు పటిష్టంగా ఉంటాయని ఆమె నమ్ముతారు. అందుకే అధికారాన్ని ఆమె తలకెక్కించుకోద’ని దిలీప్ షింగార్‌పురె తెలిపారు. రష్మిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఉద్ధవ్. ఫొటోగ్రఫీ అంటే అమితంగా ఇష్టపడే ఉద్ధవ్‌కు మొదట్లో రాజకీయాల పట్ల ఆసక్తి ఉండేది కాదు. రష్మి ప్రోద్బలంతోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ‘180 రోజుల స్కీమ్’లో భాగంగా 1987లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా ఎల్ఐసీలో చేరిన రష్మి రెండేళ్ల తర్వాత ఉద్ధవ్‌ను పెళ్లాడారు. ‘ఎల్ఐసీలో పనిచేస్తుండగా ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రే సోదరి జేజేవంతితో రష్మికి స్నేహం ఏర్పడింది. ఉద్ధవ్ ఠాక్రే.. యాడ్ ఏజెన్సీ ప్రారంభించినప్పుడు ఆయనకు రష్మిని జేజేవంతి పరిచయం చేసింది. 1989, డిసెంబర్ 13న ఉద్ధవ్, రష్మి పెళ్లి జరిగింద’ని ఆమె ఫ్రెండ్ ఒకరు వెల్లడించారు. ముఖంపై సదా చిరునవ్వుతో ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చే రష్మిని అందరూ గౌరవిస్తారని బంధువు ఒకరు తెలిపారు. బాలా సాహెబ్(బాల్ ఠాక్రే) చివరి రోజుల్లో ఆయనను చూడటానికి మాతృశ్రీకి భారీ సంఖ్యలో వచ్చిన శివసేన కార్యకర్తలపై ఎటువంటి విసుగు ప్రదర్శించకుండా అతిథి మర్యాదలు చేశారని గుర్తు చేసుకున్నారు. ఇంటా, బయటా ఎటువంటి కార్యక్రమమైనా హుందాగా వ్యవహరించి కుటుంబ గౌరవాన్ని నిలబెట్టడంలో ఆమెకు ఆమే సాటి ప్రశంసించారు. రష్మి ఠాక్రేకు సంగీతం వినడం అంటే చాలా ఇష్టమని, ఉస్తాద్ గులామ్ అలీ గజల్స్‌ను అమితంగా ఆరాధిస్తారని దిలీప్ షింగార్‌పురె వెల్లడించారు. ‘ఆమె కంఠస్వరం బాగుంటుంది. పాటలు బాగా పాడతారు. అయితే సంప్రదాయ సంగీతంలో రష్మి ఎటువంటి శిక్షణ తీసుకోలేద’ని దిలీప్ చెప్పారు.