రష్మి ఠాక్రే.. మరాఠీయులకు ఈ పేరు సుపరిచితం. మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే సతీమణి ఈమె. తన భర్త సీఎంగా ఎన్నిక కావడంతో వెల్లువలా వచ్చిపడుతున్న అభినందన సందేశాలకు జవాబిస్తూ తీరిక లేకుండా ఉన్నారామె. రాజకీయాల్లో ఉద్ధవ్ విజయం వెనుక రష్మి పాత్ర ఎంతో ఉందని సన్నిహితులు చెబుతుంటారు. ‘రష్మి ఎల్లప్పుడు నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఆమెలో అంకితభావం మెండు. ఎక్కువ మాట్లాకపోయినప్పటికీ, ఎల్లవేళలా పనిలో నిమగ్నమతుతుంద’ని రష్మి బాబాయ్ అయిన వ్యాపారవేత్త దిలీప్ షింగార్‌పురె వెల్లడించారు.
డొంబివిల్లీలోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన రష్మి 1980 దశకం చివరల్లో వాజె-కేల్కర్ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. ఆమె తండ్రి మాధవ్ రతన్‌కర్ కుటుంబ వ్యాపారం నిర్వహిస్తుండేవారు. తల్లి మీనాతాయ్ ప్రభావం రష్మి, ఆమె సోదరిపై ఎక్కువగా ఉంది. ‘రష్మికి తన తల్లిదండ్రులతో పాటు మెట్టినింటి వారితోనూ గాఢమైన అనుబంధం ఉంది. పిల్లలకు మంచి విలువలు నేర్పితే కుటుంబ బంధాలు పటిష్టంగా ఉంటాయని ఆమె నమ్ముతారు. అందుకే అధికారాన్ని ఆమె తలకెక్కించుకోద’ని దిలీప్ షింగార్‌పురె తెలిపారు.
రష్మిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఉద్ధవ్. ఫొటోగ్రఫీ అంటే అమితంగా ఇష్టపడే ఉద్ధవ్‌కు మొదట్లో రాజకీయాల పట్ల ఆసక్తి ఉండేది కాదు. రష్మి ప్రోద్బలంతోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ‘180 రోజుల స్కీమ్’లో భాగంగా 1987లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా ఎల్‌ఐసీలో చేరిన రష్మి రెండేళ్ల తర్వాత ఉద్ధవ్‌ను పెళ్లాడారు. ‘ఎల్‌ఐసీలో పనిచేస్తుండగా ఎంఎన్‌ఎస్ అధినేత రాజ్ ఠాక్రే సోదరి జేజేవంతితో రష్మికి స్నేహం ఏర్పడింది. ఉద్ధవ్ ఠాక్రే.. యాడ్ ఏజెన్సీ ప్రారంభించినప్పుడు ఆయనకు రష్మిని జేజేవంతి పరిచయం చేసింది. 1989, డిసెంబర్ 13న ఉద్ధవ్, రష్మి పెళ్లి జరిగింద’ని ఆమె ఫ్రెండ్ ఒకరు వెల్లడించారు.
ముఖంపై సదా చిరునవ్వుతో ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చే రష్మిని అందరూ గౌరవిస్తారని బంధువు ఒకరు తెలిపారు. బాలా సాహెబ్(బాల్ ఠాక్రే) చివరి రోజుల్లో ఆయనను చూడటానికి మాతృశ్రీకి భారీ సంఖ్యలో వచ్చిన శివసేన కార్యకర్తలపై ఎటువంటి విసుగు ప్రదర్శించకుండా అతిథి మర్యాదలు చేశారని గుర్తు చేసుకున్నారు. ఇంటా, బయటా ఎటువంటి కార్యక్రమమైనా హుందాగా వ్యవహరించి కుటుంబ గౌరవాన్ని నిలబెట్టడంలో ఆమెకు ఆమే సాటి ప్రశంసించారు. రష్మి ఠాక్రేకు సంగీతం వినడం అంటే చాలా ఇష్టమని, ఉస్తాద్ గులామ్ అలీ గజల్స్‌ను అమితంగా ఆరాధిస్తారని దిలీప్ షింగార్‌పురె వెల్లడించారు. ‘ఆమె కంఠస్వరం బాగుంటుంది. పాటలు బాగా పాడతారు. అయితే సంప్రదాయ సంగీతంలో రష్మి ఎటువంటి శిక్షణ తీసుకోలేద’ని దిలీప్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment