ముంబై: కరోనా వైరస్ బారిన పడిన ప్రముఖుల ఆరోగ్య వివరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీస్తున్నారు. వారి ఆరోగ్యం, అందుతున్న వైద్యం, యోగక్షేమాలు తదితర అంశాలపై సంబంధీకులతో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో కరోనా బారినపడిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే సతీమణి రష్మీ ఠాక్రే ఆరోగ్యం గురించి ప్రధాని అడిగి తెలుసుకున్నారు. మార్చి 23వ తేదీన ఆమె కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే తీవ్రమైన దగ్గు ఉండడంతో ఆమె ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా ప్రధాని ఆమె ఆరోగ్య విషయాలు ఆరా తీశారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రధాని ప్రార్థించారు. ఆమె దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.
దీంతో పాటు మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ ఆరోగ్య పరిస్థితిని ప్రధాని మోదీ తెలుసుకున్నారు. దేవెగౌడ, ఆయన భార్య చెన్నమ్మకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారు కుటుంబసభ్యులతో కలిసి హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా వారి ఆరోగ్య విషయాలు తెలుసుకున్నట్లు మోదీ బుధవారం ట్వీట్ చేశారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. వారి ఆరోగ్యంపై కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రత్యేక దృష్టి పెట్టారు. వారికి చికిత్స అందిస్తున్న వైద్యులతో సంప్రదింపులు చేస్తున్నట్లు యడియూరప్ప తెలిపారు.
చదవండి: అర్ధరాత్రి ఆస్పత్రిలో చేరిన ముఖ్యమంత్రి సతీమణి
Comments
Please login to add a commentAdd a comment