లండన్ : సమాజంలో గౌరవప్రదమైన వృత్తుల్లో ఉంటూ అధిక రాబడి పొందే వారే ఎక్కువగా మద్యం సేవిస్తారని తాజా అథ్యయనం వెల్లడించింది. బ్రిటన్‌లో ఇతరులతో పోలిస్తే వైద్యులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు తరచూ మద్యం తీసుకుంటారని తేలింది. మేనేజ్‌మెంట్, ప్రొఫెషనల్ బాధ్యతల్లో ఉన్న ప్రతి ఐదుగురిలో నలుగురు ఆల్కహాల్ తీసుకుంటారని అంచనా వేసింది. ఇక ఈ అలవాటు కార్మికులు, లారీ డ్రైవర్లు, రిసెప్షనిస్టులు, కేర్ వర్కర్లు ఇతరుల్లో కేవలం సగానికే పరిమితమని పేర్కొంది. అయితే మద్యం మితిమీరి తీసుకుంటే ఆరోగ్యంపై దుష్ర్పభావం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒత్తిడి నుంచి బయటపడేందుకు మిడిల్ క్లాస్ ప్రొఫెషనల్స్ మద్యానికి దాసోహం అవుతుండటం పెచ్చుమీరుతోందని ఆల్కహాల్ ఎడిక్షన్ నిపుణుడు స్టీవ్ క్లార్క్ ఆందోళన వ్యక్తం చేశారు. పనిఒత్తిడిని అధిగమించేందుకు వారు తమకు తామే మద్యాన్ని మెడిసిన్‌లా వాడుతున్నారని తాము గుర్తించామన్నారు. యూకేలో మద్యం అలవాట్లపై ప్రచురితమైన నివేదిక ఈ ధోరణులకు అద్దం పట్టింది. బ్రిటన్‌లో దాదాపు 60 శాతం మంది పెద్దలు మద్యాన్ని సేవిస్తున్నట్టు తేలింది. అతిగా మద్యం సేవించడం కారణంగా మరణాల సంఖ్య ఈ దశాబ్ధంలో పది శాతం మేర పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment