
ఎవరికి వాళ్లు డిఫరెంట్!
ట్రంపా? హిల్లరీనా? ఇవాళ మధ్యాహ్నానికి (ఇండియా టైమ్ ప్రకారం) ఓ పిక్చర్ వస్తుంది. సాయంత్రానికల్లా ఓ క్లారిటీ వస్తుంది. ఎవరు గెలిచినా, రెండో వారు ఓడినట్లు కాదు! పోరాడి ఓడినట్లు!! ఇదలా ఉంచితే, ‘అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలు’గా రికార్డు సృష్టించే అవకాశాలున్న హిల్లరీకి, ‘స్త్రీల పట్ల చిన్న చూపు గల’ అభ్యర్థిగా పేరుమోసిన డొనాల్డ్ ట్రంప్‌కి మధ్య చివరి వరకు హోరాహోరీ జరగడం ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సంభవించిన ఒక వైరుధ్యం. ఈక్వల్ ఈక్వల్... ఎట్ ది సేమ్ టైమ్... ట్రంప్, హిల్లరీ.. డిఫరెంట్. ఈ సందర్భంగా గత అమెరికా అధ్యక్షుల్లో కొందరి వ్యక్తిత్వాలు, వారి జీవితాలకు సంబంధించిన కొన్ని యు.ఎస్.పి. (యునీక్ సెల్లింగ్ పాయింట్)ల గురించి, అంటే ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం.
జార్జి వాషింగ్టన్ అమెరికా తొలి అధ్యక్షులు. మొదట్లో ఆయన జీతం తీసుకోడానికి ససేమిరా అన్నారు! అధ్యక్షుడికి జీతం ఏంటి అని వింతగా చూశారు. జీతం కాదు, గౌరవం అనుకోండి అన్నారు పాలనా కోవిదులు. చివరికి ఆయన దయతలిచారు.
జాన్ ఆడమ్స్ చివరి మాటలు ‘థామస్ జెఫర్సన్ సర్వైవ్స్’. (జెఫర్సన్ బతుకుతాడు). ఆయనా, ఈయనా ఫ్రెండ్స్. ప్రత్యర్థులు కూడా. చివరికి ఇద్దరూ ఒకే రోజు మరణించారు. ముందు జెఫర్సన్, తర్వాత ఆడమ్స్.
చల్లటి నీళ్లున్న బకెట్‌లో కొద్దిసేపు కాళ్లు నానబెట్టుకుంటే పక్కవాళ్ల జలుబు మనకు అంటుకోదని థామస్ జెఫర్సన్ నమ్మేవారు.
జేమ్స్ మేడిసన్ ఎత్తు 5 అడుగుల 4 అంగుళాలు. అమెరికా అధ్యక్షులందరూ ఆయన కన్నా ఎత్తైవారే.
జాన్ క్విన్సీ ఆడమ్స్ రోజూ తెల్లవారుజామునే పొటోమాక్ నదిలో ఒంటిపై బట్టల్లేకుండా ఒక మునకేసి వచ్చేవారు.
ఆండ్రూ జాక్సన్ దగ్గర ఒక పెంపుడు చిలుక ఉండేది. అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం టెక్ట్స్ మొత్తం ఆ చిలక్కి కంఠతా వచ్చు. ఆండ్రూ చనిపోయినప్పుడు అంత్యక్రియల్లో ఆ చిలక ఆయన్ని ఏవో శాపనార్థాలు పెట్టిందట!
మిలార్డ్ ఫిల్మోర్ సతీమణి అబిగైల్ స్నానం కోసం తొలిసారి వైట్ హౌస్‌లో రన్నింగ్-వాటర్ బాత్‌టబ్ ఏర్పాటైంది.
పెళ్లి కాని (చేసుకోని) ఏకైక అమెరికా బ్రహ్మచారి ప్రెసిడెంట్ జేమ్స్ బుచానన్. జీవితాంతం ఆయన ఏకాకిగానే ఉన్నారు.
అబ్రహాం లింకన్ బార్ టెండర్‌గా పనిచేశారు. ఆయనకు బార్ టెండర్ లెసైన్స్ కూడా ఉంది.
రూథర్‌ఫర్డ్ బి.హేన్స్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వైట్ హౌస్‌లో తొలిసారి టెలిఫోన్‌ని బిగించారు. ఆ ఫోన్ నెంబర్ ఎంతో తెలుసా? 1.
న్యూయార్క్ ఈరీ కౌంటీలో న్యాయ అధికారిగా ఉన్నప్పుడు గ్రోవర్ క్లీవ్‌లాండ్ తలారిగా పనిచేశారు!
థియోడర్ రూజ్వెల్ట్ తల్లి, భార్య ఒకేరోజు చనిపోయారు. 1884 వాలెంటైన్స్ డే రోజు అత్తాకోడలు కాస్త అటూ ఇటుగా కన్నుమూశారు. ‘ది లైట్ హ్యాజ్ గాన్ అవుట్ ఆఫ్ మై లైఫ్’ అని రూజ్వెల్ట్ తన పత్రికలో రాసుకున్నారు.
విలియమ్ హోవార్డ్ టాఫ్ట్ ఓరోజు బాత్‌టబ్‌లో ఇరుక్కుపోయారు. అందులోంచి బయటపడడానికి ఆయన తన సిబ్బంది సహాయం తీసుకోవలసి వచ్చింది.
వారెన్ హార్డింగ్ జూదం ఆడేవారు. ఎంతో ఖరీదైన వైట్‌హౌస్ చైనా సెట్ (ప్లేట్లు, సాసర్ల సెట్)ను ఆయన పోకర్ గేమ్‌లో పోగొట్టుకున్నాడని అంటారు.
హార్వర్డ్ యూనివర్సిటీలో చేరడానికి రికమెండేషన్ లెటర్ రాయమని అడిగితే జాన్ ఎఫ్. కెన్నెడీ తండ్రి... ‘వీడు కేర్‌లెస్, వీడి దగ్గర అప్లికేషన్ కూడా ఉండదు’ అని రాశాడు. అయిన ప్పటికీ కెన్నెడీకి హార్వర్డ్‌లో సీటు వచ్చింది.
జార్జి బుష్ సీనియర్ పేరు మీద జపాన్‌లో భాషలో ‘బుషుసురు’ అనే మాట పుట్టుకొచ్చింది. ఈ మాటకు అర్థం... ‘పబ్లిక్‌లో వాంతి చేసుకునేవాడు’ అని. 1992లో జపాన్ ప్రధాని మీద సీనియర్ బుష్ వాంతి చేసుకోవడంతో జపాన్ ప్రజలు ఈ పదాన్ని కనిపెట్టారు.