తనే నాకు తగిన జోడీ! | Himself to be the perfect mate for me! | Sakshi
Sakshi News home page

తనే నాకు తగిన జోడీ!

Published Sat, Feb 27 2016 3:34 PM | Last Updated on Sun, Sep 3 2017 6:29 PM

తనే నాకు తగిన జోడీ!

తనే నాకు తగిన జోడీ!

కలర్స్
 
కళ్యాణ్ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చే సీరియల్ రాధ- మధు. ఆ సీరియల్‌లో నటి మౌనిక పక్కన కళ్యాణ్ ఎంతో ముచ్చటగా కనిపిస్తూ ఇంటింటికీ ఆత్మీయుడైపోయాడు. లయ, కన్యాదానం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే వంటి సీరియల్స్‌తో కెరీర్ కొనసాగించిన కళ్యాణ్ కొంత విరామం తర్వాత మళ్లీ బిజీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆ రంగం గురించి, అందులోని సాధక బాధకాల గురించి ‘సాక్షి’తోపంచుకున్నారు...
 
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ అని టైటిల్ పెట్టారు. కానీ సీరియల్‌లో మీ మాటలు తేడాగా ఉన్నాయే?
(నవ్వుతూ) అవును. పేరుకే హీరోని గానీ క్యారెక్టర్‌ పరంగా విలన్‌ని. వేరే అమ్మాయి కోసం భార్యని దారుణంగా మోసగించే పాత్ర. ఎప్పుడూ సాఫ్ట్‌గా కనిపించి కనిపించి బోర్ కొట్టింది. అందుకే నెగిటివ్ రోల్ ఎంచుకున్నా.

ఆమధ్య బుల్లితెర మీద కనిపించలేదెందుకని?
కావాలనే రెండేళ్లు గ్యాప్ తీసుకున్నా. ఈ ఇండస్ట్రీలో ఏదీ శాశ్వతం కాదు. ఒక్కరోజులో ఎత్తేస్తారు, ఒక్కరోజులో పడేస్తారు. కాబట్టి భవిష్యత్తు కోసం మరొక ఆప్షన్ పెట్టుకోవడం అవసరమనిపించింది. అందుకే నటనకు కామా పెట్టి బిజినెస్ సెటప్ చేసే ప్రయత్నాల్లో పడ్డాను. అంతలో మంచి ఆఫర్ రావడంతో మళ్లీ మేకప్ వేసుకున్నాను.
      
చూస్తుంటే ఇండస్ట్రీ మిమ్మల్నేదో ఇబ్బంది పెడుతున్నట్టుంది?

లేదు.. నేను అలా అనలేదు. సెకెండ్ ఆప్షన్ అవసరం అని చెప్పానంతే. అయినా సమస్యలన్నవి అన్ని చోట్లా ఉంటాయి. ఇష్టపడి చేస్తే ఏదీ కష్టంగా అనిపించదు. నాకు నటనంటే ఇష్టం. ఇండస్ట్రీ అంటే ఇష్టం. కాబట్టి దీన్ని ఎప్పటికీ కష్టమనుకోను, వదలను.

ఈ ఇష్టం మీరు నటుడయ్యాక పెరిగిందా... లేక ఇష్టంతోనే నటుడయ్యారా?
నిజానికి ఇండస్ట్రీకి ఇష్టంతో రాలేదు, యాక్సిడెంటల్‌గా వచ్చాను. నేను హైదరాబాద్‌లో పుట్టి పెరిగాను. ఎంబీయే చేసి ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నప్పుడు చిన్నా అనే అసిస్టెంట్ డెరైక్టర్ ద్వారా ‘రాధ-మధు’ సీరియల్ హీరోగా చాన్స్ వచ్చింది. నటించడం మొదలెట్టాక అందులోని ఆనందం తెలిసి వచ్చింది. పైగా అది పెద్ద హిట్. తర్వాత చేసిన ‘లయ’ కూడా మంచి హిట్ కావడంతో ఇక వెనక్కి తిరిగి చూడలేదు.
      
సినిమాల్లోకి కూడా వెళ్లారుగా?

అవును. ‘గోపి గోపిక గోదావరి’లో సెకెండ్ హీరోగా చేశాను. నిజానికి అంతకంటే ముందే వాన, లక్ష్మి, సై, మనోరమ లాంటి కొన్ని సినిమాల్లో మంచి రోల్స్ కోసం అడిగారు. టైమ్ కుదరక చేయలేదు. కానీ వంశీగారి సినిమా అంటే వదులుకోలేకపోయాను.
      
కానీ మళ్లీ ఏ సినిమాలోనూ కనిపించలేదు?
చెప్పానుగా నటనకు కామా పెట్టానని. దానివల్లే సీరియల్స్‌తో పాటు సినిమాలకీ దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. అన్నీ కలిసొస్తే లీడ్ రోల్ చేసే చాన్స్ కూడా ఉంది.
      
సినిమా మీద ఆశతో కెరీర్‌ని పాడు చేసుకున్న సీరియల్ నటులు చాలామంది ఉన్నారు. మరి మీరు..?
మీరన్నది నిజమే. కానీ టీవీ నుంచి వెళ్లి సక్సెస్ అయినవాళ్లూ ఉన్నారు. రాజీవ్ కనకాల, రావు రమేష్ అందుకు మంచి ఉదాహరణ. ఓ మంచి క్యారెక్టర్ దొరికినప్పుడు నటుడి లైఫ్ దానంతటదే టర్న్ అవుతుంది. అయితే ఒకటి. నేను సినిమాల కోసం సీరియళ్లను వదిలేసుకోవాలని అనుకోవడం లేదు. నేనెవరో అందరికీ చెప్పిందీ, నాకింత పేరు తెచ్చిందీ టీవీయే కదా!
      
సినిమాలు హీరో చుట్టూ తిరిగితే... సీరియళ్లు హీరోయిన్ చుట్టూ తిరుగుతాయి. మరి సీరియల్ హీరోగా మీకెంత ప్రాధాన్యత ఉంది?
సీరియల్ అంటే కుటుంబ కథ. వాటిలో కనిపించే పాత్రలన్నీ తమ ఇళ్లలోనే కనిపిస్తుంటాయి అందరికీ. ప్రతి ఇంటికీ ఇల్లాలు ముఖ్యం. అందుకే హీరోయిన్ పాత్రకి కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అలా అని మిగతా సభ్యులంతా లేకపోతే కుటుంబం అవ్వదు. సందర్భాన్ని బట్టి ఒక పాత్ర బరువవుతుంది. ఓ పాత్ర తేలికవుతుంది. అంతే తప్ప ప్రాధాన్యత లేకపోవడం అంటూ ఉండదు. ఒకవేళ సీరియల్‌లో సడెన్‌గా ఓ పాము ఎంటరయ్యిందనుకోండి. దానివల్ల టీఆర్పీ పెరిగితే పాము ప్రధాన పాత్రగా మారిపోతుంది. దాన్ని మిగతావాళ్లంతా అంగీకరించి తీరాలంతే.
 
ఇండస్ట్రీలో మహిళలకు ఇబ్బందులున్నాయనేది అందరూ ఒప్పుకునే వాస్తవం. మరి మగవాళ్లకి?
ఎదిగే క్రమంలో సమస్యలు అందరికీ ఉంటాయి. అధిగమించుకుంటూ వెళ్తేనే సక్సెస్. నా వరకూ నన్ను ఇబ్బంది పెట్టే విషయమైతే రూమర్స్. ఎవరితో కాస్త క్లోజ్‌గా ఉన్నా వాళ్లతో ముడిపెట్టేస్తారు. అంతకాలం కంటిన్యుయస్‌గా ఓ హీరోయిన్‌తో పని చేస్తున్నప్పుడు కాస్త స్నేహం ఏర్పడుతుంది. చనువుగా మాట్లాడుకోవడం జరుగుతుంది. దానికి విపరీతార్థాలు తీసి, దారుణంగా కామెంట్లు చేయడం బాధనిపిస్తుంది. (నవ్వుతూ) పైగా నేను ఇద్దరు హీరోయిన్లు లేకుండా ఇప్పటి వరకూ ఏ సీరియల్ చేయలేదేమో... ఈ పుకార్ల బాధ కాస్త ఎక్కువే.

వాటికి మీ ఇంట్లోవాళ్ల స్పందన?
నా భార్య శ్రీలేఖ యాంకర్. కాబట్టి తనకు ఇలాంటివన్నీ తెలుసు. సో, ప్రాబ్లెమ్ లేదు.
      
వేరే సీరియల్స్ చూస్తారా? మీ కాంటెంపరరీస్‌లో మీకు నచ్చే నటుడు ఎవరు?
‘వరూధినీ పరిణయం’ చాలా నచ్చుతుంది నాకు. రెండు వేర్వేరు వ్యక్తిత్వాలు ఉన్న భార్యాభర్తల జీవితాలను ముడివేసి చూపించే విధానం చాలా బాగుంది. అలాగే హిందీలో ‘బాలికావధు’, ‘ఆనంది’ క్యారెక్టర్‌ని బ్యాలెన్స్‌డ్‌గా చూపించే తీరు అద్భుతం. ఇక హీరోలంటారా... వాళ్ల పరిధి మేరకు అందరూ బాగానే చేస్తారు. ఎవరి స్టైల్ వారిది.
    
డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా?
సీరియళ్లలో లేదు కానీ సినిమాల్లో ఉంది. ‘సాగర సంగమం’లో కమల్‌గారి పాత్ర లాంటిది చేయాలి. నిజానికి ఆయన చేసే పాత్రలు ఆయన మాత్రమే చేయగలరు. అంత గొప్పగా మరెవరూ చేయలేరు. అంతలో కొంత చేయగలిగితే చాలు... నటుడిగా జీవితం ధన్యమైనట్టే.
      
ఇన్నేళ్లుగా ఇండస్ట్రీని చూస్తున్నారు. ఇక్కడ ఏదైనా మారాల్సి ఉందని మీకనిపిస్తోందా?
డబ్బింగ్ సీరియల్ సంస్కృతి మారాలి. ఒక్క సీరియల్ మీద కనీసం ఓ యాభై కుటుంబాలు ఆధారపడి జీవిస్తాయి. ఓ సీరియల్‌ని డబ్ చేసే బదులు రీమేక్ చేస్తే ఆ యాభై కుటుంబాలూ కడుపు నిండా తిండి తింటాయి. అది పట్టించుకోకుండా టపటపా ఇతర భాషా సీరియళ్లను దించేస్తున్నారు. ఇది ఆగాలి.
      
నటన... బిజినెస్... ఇవేనా, ఇంకేమైనా ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయా?
ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర చిన్న చిన్న పిల్లలు బిచ్చమెత్తుకుంటుంటే మనసు అదోలా అయిపోతుంది. వాళ్ల కోసం ఏదైనా చేయాలని ఉంటుంది. కానీ నా ఒక్కడి వల్లే అది సాధ్యం కాకపోవచ్చు. ప్రభుత్వం అందుకు పూనుకోవాలి. నిజంగా వాళ్లు ఏదైనా చేస్తే... అందులో పాలు పంచుకునే మొదటివాణ్ని నేనే అవుతాను.
 
 - సమీర నేలపూడి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement