సహనం... ఆయన సందేశం
ప్రవక్త జీవితం
అవిశ్వాసులు కుట్రలు, కుతంత్రాలు పన్నుతూనే ఉన్నారు. ప్రవక్తను ఎన్ని విధాల ఇబ్బందులు పెట్టవచ్చో, అన్నిరకాల మాయోపాయాలూ పన్నుతున్నారు. కుటుంబాల మధ్య, రక్తసంబంధీకుల మధ్య, చివరికి భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టడానికి శక్తివంచన లేని ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రవక్త వారి అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళి, భార్యల్ని వదిలేయమని ఒత్తిడి తేవడం లాంటి నీచత్వానికీ వారు వెనుకాడలేదు. ప్రవక్త నడిచే దారిలో ముళ్ళకంప పరవడం, ఊడ్చిన చెత్తా చెదారం, పారేసే మేక పేగులు ఆయనపై విసరడం లాంటి చేష్టలకు పాల్పడ్డారు.
ఈ క్రమంలోనే ‘అల్ లహబ్’ సూరా అవతరించింది. అందులో ప్రవక్తను రకరకాలుగా హింసిస్తున్న అబూ లహబ్, ఆయనపై పొట్టపేగులు విసిరిన అతడి భార్య ఉమ్మెజమీల్‌ను గురించి ప్రస్తావన ఉంది. ఇది తెలుసుకున్న జమీల్ పట్టరాని కోపంతో ఊగిపోతూ కాబాకు వెళ్ళింది. ఆ సమయంలో ముహమ్మద్ ప్రవక్త(స), హ. అబూబక్ ్ర(ర) అక్కడే కూర్చొని ఉన్నారు.
ఉమ్మెజమీల్ ఉగ్రరూపాన్ని చూసిన అబూబక్ ్రకంగారుపడ్డారు. పైగా ఆమె చేతిలో ఓ పెద్దరాయి కూడా ఉంది. ప్రవక్తకు ఏమైనా హాని తలపెడుతుందేమోనని భయపడ్డారు. ఇదే విషయం ప్రవక్తకు చెప్పారు. అప్పుడు ప్రవక్త, ‘నువ్వేమీ కంగారుపడకు. నేనామె కళ్ళకు కనబడను’ అన్నారు.
నిజంగానే ఆమెకు ప్రవక్త కనిపించలేదు. ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఒకరోజు ప్రవక్త మహనీయులు యథాప్రకారం కాబాలో ప్రార్థన చేసుకుంటున్నారు. అప్పుడు అబూజహల్ అనే మరో దుర్మార్గుడు పెద్ద బండరాయి పెకైత్తుకొని సాష్టాంగంలో ఉన్న ప్రవక్తపై వెయ్యాలని ముందుకు నడిచాడు. అతని మిత్రబృందమంతా కొద్దిదూరంలో నిలబడి, ఈ రోజుతో ముహమ్మద్ కథ ముగిసినట్లే అని ఉత్కంఠతో, ఊపిరిబిగబట్టి చూస్తున్నారు. కాని బండరాయి నెత్తినవేద్దామని అంత దూకుడుగా వెళ్ళినవాడు అడుగు ముందుకు వేయలేక, చెమటలు కక్కుతూ అక్కడే ఆగిపోయాడు. అది చూసి అందరూ అవాక్కయ్యారు. మిత్రులు అతని దగ్గరిగా వెళ్ళి, ‘ఏమిటి.. ఏమైంది.. అలా వణికిపోతున్నావు?’ అన్నారు.
‘కళ్ళ ముందు అగ్నిగుండం భగభగ మండుతుంటే కళ్ళకు కనబడ్డం లేదా? అంగుళం కదిలినా మాడిమసైపోనా?’ అన్నాడు అబూజహెల్.ఈ మాటలు వాళ్ళను మరింత ఆశ్చర్యానికి గురిచేశాయి. ‘ఇదంతా నాటకం. మాకు కనబడని అగ్నిగుండం నీకే కనబడుతోందా? ముహమ్మద్‌కు భయపడి, తప్పించుకోవడానికి ఇదొక ఎత్తుగడ’ అన్నారు. అందులో ఒకడు అతని చేతిలో రాయి తీసుకొని, ప్రవక్త వైపు పోబోయాడు. అంతే! వాడు కూడా ఎత్తిన అడుగు ముందుకు వేయలేక ఠక్కున ఆగిపోయాడు. బతుకు జీవుడా అనుకుంటూ జావగారిన ముఖంతో వెనక్కి పరుగందుకున్నాడు. అలా ఆ రోజు గడిచి పోయింది.
అయినప్పటికీ ఆ దుర్మార్గులు తమ ఆగడాలను మానుకోలేదు. ఒకరోజు నమాజ్ చేస్తున్న ప్రవక్త మెడపై అశుద్ధంతో నిండిన ఒంటె పేగుల్ని తెచ్చివేశారు. అంతలో చిన్నారి ఫాతిమా యాదృచ్ఛికంగా అక్కడికి రావడం తటస్థించింది. తండ్రి మెడ, వీపుపై ఒంటె ప్రేవుల్ని చూసి తల్లడిల్లిపోతూ ఆమె వాటిని తొలగించారు.
ఎవరెన్ని చేసినా, సహనంతో వ్యవహరించాలనే గొప్ప సందేశాన్ని అలా మహమ్మద్ ప్రవక్త తన ఆచరణ ద్వారా అందరికీ చాటారు.సత్యసందేశాన్ని ఆపడానికి ప్రవక్తనే లక్ష్యంగా చేసుకున్న అవిశ్వాసులు తమ పథకాలు విఫలం కావడంతో, ఆయన అనుచరులపై విరుచుకు పడి, అమానుషంగా హింసించడం మొదలుపెట్టారు.
- ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ (మిగతాది వచ్చేవారం)