బిహైండ్ ది లెన్స్...
లెన్స్ వెనకాల ఏముంటుంది?
సృజనాత్మకమైన ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనకు సామాజిక అవగాహన తోడైతే చరిత్ర కళ్ల ముందు కదలాడుతుంది. మనకు పరిచయం లేని కొత్త ప్రపంచం లోతుగా పరిచయం అవుతుంది. విశ్లేషణకు దారి పరుస్తుంది. గత నూట ఇరవై అయిదు సంవత్సరాల నుంచి ప్రపంచాన్ని భిన్నమైన కోణాలలో ఛాయచిత్రాల రూపంలో డాక్యుమెంట్ చేస్తోంది నేషనల్ జియోగ్రఫిక్ మ్యాగ జీన్. వాటిలో భౌగోళిక రూపం మాత్రమే కాదు సామాజిక ఘటనలు, స్థితిగతులకు సంబంధించిన ఆత్మ కనిపిస్తుంది.
ఇటీవల ఈ మ్యాగజీన్ నిర్వహించిన పోటీలో అవార్డ్డు గెలుచుకున్న ఫిమేల్ ఫొటో జర్నలిస్టుల ఫొటోల ప్రదర్శన వాషింగ్టన్‌లోని ‘ది నేషనల్ జియోగ్రఫిక్ మ్యూజియం’లో మొదలైంది. ఈ ఎగ్జిబిషన్‌లోని ఫొటోలలో పదకొండుమంది మహిళా ఫొటో జర్నలిస్టుల ప్రతిభాపాటవాలు ప్రతిఫలించాయి. వందకు పైగా ఉన్న ఫొటోలలో భిన్న ప్రాంతాలకు చెందిన సంస్కృతులు, భౌగోళిక స్థితిగతులు, సామాజిక ఘటనలు కళ్లకు కట్టాయి.
ఎగ్జిబిషన్‌లో కొన్ని శక్తిమంతమైన ఫొటోలతో పాటు ప్రభావశీలమైనవి కూడా ఉన్నాయి. కొత్త తరానికి చెందిన సమస్త ధోరణులు వాటిలో కనిపిస్తాయి. బాల్యవివాహాలు, ఆధునిక కాల బానిసత్యం... ఇలా రకరకాల సామాజిక సమస్యలను ఇతివృత్తంగా ఎంచుకున్నారు. ఒక్కో ఫొటో ఒక్కో కథను చెబుతుంది. వాటిలో ఆధునిక కాలానికి చెందిన వాస్తవాలు కనబడతాయి.