గుండె చిల్లు...సూపర్ జిగురు!
పుట్టుకతోనే గుండెకు రంధ్రాలు పడితే ..ఇక ఆ పిల్లలు మరణానికి చేరువైనట్లే. వీలైనంత వేగంగా చికిత్స చేస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు. కానీ గుండెకుపడ్డ చిల్లును పూడ్చే క్రమంలో ఎన్నో ఇబ్బందులుంటాయి. కుట్లు వేస్తే లేదా మరో ఇతర పద్ధతిలో చికిత్స చేస్తే ఆ చిన్ని గుండెలోని కణజాలం దెబ్బతినే అవకాశముంటుంది. ఈ చిక్కులన్నింటినీ సూపర్ జిగురుతో పరిష్కారించవచ్చునని అంటోంది బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్.
‘హైడ్రోఫోబిక్ లైట్-యాక్టివేటెడ్ అథెసివ్ (హెచ్‌ఎల్‌ఏఏ)’ అనే ఈ జిగురును ఓ పట్టీ(ప్యాచ్)పై వేసి గుండె రంధ్రం వద్ద అతికిస్తే చాలు.. సెకెన్లలో రంధ్రాన్ని పూడిపోయేందుకు సాయపడుతుంది. పట్టీని అతికించిన వెంటనే అతినీలలోహిత కాంతిని ప్రసరింపచేస్తే.. ఐదు సెకన్లలోనే జిగురు యాక్టివేట్ అయి రక్తం లీకేజీని అరికడుతుందట. రక్తం ప్రవహిస్తున్నా.. తేమగా ఉన్నా.. గుండె కొట్టుకుంటున్నా ఈ జిగురు పట్టీ కణజాలాన్ని గట్టిగా పట్టి ఉంచుతుందట.
రంధ్రం పూడి, గాయం మానిన తర్వాత ప్యాచ్‌తో సహా ఇది సహజంగా విచ్ఛిన్నం అవుతుంది. దీనివల్ల ఎలాంటి దుష్ర్పభావమూ ఉండదట. నత్తల వంటి అనేక జీవులు నీటిలో తడిచిపోకుండా.. త్వరగా ఆరిపోకుండా ఉండేందుకు జిగుర్లను స్రవిస్తుంటాయి. అలాంటి జీవులను స్ఫూర్తిగా తీసుకునే శాస్త్రవేత్తలు ఈ సూపర్ జిగురును తయారు చేయడం అసలు విశేషం.
వెయ్యిలో ఎనిమిది మందికి చిల్లు...
పుట్టుకతో వచ్చే గుండె సంబంధ లోపాలను ‘కాన్‌జెనిటల్ హార్ట్ డి ఫెక్ట్స్’గా పేర్కొంటారు. గుండెకు రంధ్రాలతో పుట్టడం వీటిలో ఒకటి. సాధారణంగా ప్రతి 1000 మందిలో 8 మందికి పుట్టుకతోనే గుండెలో రంధ్రాలు ఏర్పడే అవ కాశం ఉంది. ఇలాంటి గుండె సమస్యలకు మేనరిక వివాహాలు, జన్యుపరమైన వారసత్వం, గర్భవతిగా ఉన్నప్పుడు తీవ్ర జ్వరం రావడం, మందులు వికటించడం, ధూమపానం, ఆల్కహాల్ సేవించడం వంటి వి కారణాలు. గుండెలో రంధ్రాలు ఏర్పడేవారిలో 70 శాతం మందికి మందులు వాడితే ఆటోమేటిక్‌గా మూసుకుపోతాయి. 20 శాతం మందికి ఆపరేషన్ల ద్వారా నయం చేయొచ్చు. కానీ మిగతా 10 శాతం మందిలో మాత్రం కొన్నిసార్లు ఆపరేషన్లు చేసినా ప్రయోజనం ఉండకపోవచ్చు.
- డాక్టర్ ఎంఎస్‌ఎస్ ముఖర్జీ
హద్రోగ నిపుణులు, హైదరాబాద్