కాళ్ల పగుళ్లకు అవి కూడా ప్రధాన కారణాలు కావచ్చు | Homeopathic counseling | Sakshi
Sakshi News home page

కాళ్ల పగుళ్లకు అవి కూడా ప్రధాన కారణాలు కావచ్చు

Published Mon, May 16 2016 11:38 PM | Last Updated on Mon, Sep 4 2017 12:14 AM

Homeopathic counseling

హోమియో కౌన్సెలింగ్

 

మా అబ్బాయికి పదిహేనేళ్లు. తరచు టాన్సిలైటిస్ సమస్యతో బాధపడుతున్నాడు. కొద్దిగా చల్లని పదార్థాలు తీసుకుంటే చాలు...గొంతు వాస్తుంది. ముద్ద మింగుడు పడదు. ఈ వ్యాధి మళ్లీ తిరగబెట్టకుండా హోమియో చికిత్స ద్వారా సంపూర్ణంగా నయమయే అవకాశం ఉందా? - భూక్యా స్వరూప, హైదరాబాద్
మీరు ఆందోళన చెందకండి. మీ బాబును వేధిస్తున్న ఈ టాన్సిలైటిస్ సమస్య హోమియో చికిత్స ద్వారా పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంది. టాన్సిలైటిస్ అనేది చిన్న పిల్లలను తరచే వేధించే సమస్య. ఏ వయసు వారినైనా ప్రభావితం చేసే ఈ వ్యాధి ఎక్కువగా 6 నుంచి 12 సంవ్సరాల లోపు వయస్సు గల చిన్న పిల్లల్లో; 15 నుంచి 25 సంవత్సరాలలోపు యుక్తవయసు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది.


గొంతులో నాలుక వెనక భాగంలో ఉండే లింఫ్ గ్రంథులను టాన్సిల్స్ అంటారు. ఇవి లింఫాటిక్ కణజాలంతో ఏర్పడతాయి. రోగనిరోధక వ్యవస్థలో భాగమైన ఈ గ్రంథులు యాంటీబాడీస్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా, నోటిద్వారా శరీరంలోకి ప్రవేశించే సూక్ష్మజీవులను ఎదుర్కొని ఇన్ఫెక్షన్ నుంచి కాపాడతాయి.

 టాన్సిలైటిస్ అంటే..? టాన్సిల్స్ వాపునకు గురవడాన్ని టాన్సిలైటిస్ అంటారు. సాధారణంగా ఈ సమస్య వారం రోజులలోపు తగ్గుతుంది.


లక్షణాలు: గొంతునొప్పి, టాన్సిల్స్ ఎర్రగా వాచిపోవడం, టాన్సిల్స్‌పై తెల్లగా లేదా పసుప్పచ్చగా మచ్చలు ఏర్పడటం, దవడ ప్రాంతంలో నొప్పి, మింగేటప్పుడు బాధ, గొంతు బొంగురు పోవడం, ఆకలి మందగించటం, చలి, జ్వరం, చెవినొప్పి, వికారం, వాంతులు.

 
దుష్ర్పభావాలు: దీర్ఘకాలికంగా స్రెప్టోకాకల్ ఇన్ఫెక్షన్లకు గురి కావడం వల్ల రుమాటిక్ జ్వరాలు, కిడ్నీ జబ్బులకు దారి తీస్తుంది.

 
వైరస్‌ల వల్ల కలిగే దీర్ఘకాలిక టాన్సిలైటిస్ సమస్య పెరిటాన్సిలార్ ఆబ్‌సిస్‌కు దారితీస్తుంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే అది గొంతు వరకు వ్యాపించి వాయుద్వారాలకు అడ్డుపడటం వల్ల ప్రాణాంతక పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఇది చెవికి వ్యాపించడం వల్ల ఒటైటిస్ మీడియా ఏర్పడి వినికిడి శక్తి కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది శరీరంలోని ఇతర భాగాలకూ వ్యాపించవచ్చు.

 
నిర్ధారణ
: రోగలక్షణాలు, నోటిని, గొంతును పరీక్షించడం, త్రోట్ స్క్వాబ్, స్ప్ట్రె టెస్ట్, స్ట్రెప్ట్ కల్చర్ వంటి పరీక్షల ద్వారా.

 
హోమియోకేర్ చికిత్స: హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో అందించే జెనెటిక్ కాన్‌స్టిట్యూషనల్ చికిత్సావిధానం ద్వారా రోగి మానసిక, శరీర లక్షణాలను పరిగణనలోకి తీసుకుని చికిత్స అందించడం ద్వారా శరీరంలోని రోగనిరోధక శక్తి పెరిగి, ఇన్ఫెక్షన్లు పూర్తిగా నయం అవడంతోపాటు సమస్య పూర్తిగా నయం అవుతుంది. మళ్లీ తిరగబెట్టదు కూడా!

 

డాక్టర్  శ్రీకాంత్ మోర్లావర్
ఫౌండర్ చైర్మన్  హోమియోకేర్ ఇంటర్నేషనల్
హైదరాబాద్

 

జనరల్ కౌన్సెలింగ్
నా వయసు 30 ఏళ్లు. నా కాళ్లు తరచూ పగులుతున్నాయి. చలికాలం, ఎండాకాలం అనే తేడా లేకుండా ప్రతికాలంలోనూ ఈ బాధ నన్ను ఇబ్బంది పెడుతోంది. కొన్నిసార్లు పగుళ్లు చాలా లోతుగా ఏర్పడి నొప్పిని కలిగిస్తున్నాయి. నీళ్లలో కూడా ఎక్కువగా ఉండటం లేదు. ఎన్ని క్రీములు వాడినా లాభం లేకుండా పోతోంది. అసలు ఆడవారికి మాత్రమే ఈ కాళ్ల పగుళ్లు ఎందుకు ఏర్పడతాయి? దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి.  - సారిక, హైదరాబాద్
కాళ్లకు పగుళ్లు కేవలం ఆడవారికి మాత్రమే వస్తాయని అనుకోవడం కేవలం భ్రమ మాత్రమే. మగవాళ్లకు కూడా కాళ్లలో పగుళ్లు ఉంటాయి. ఇక మీ విషయానికి వస్తే మీ కాళ్ల పగుళ్లకు చాలా కారణాలు ఉండవచ్చు. ఎండాకాలంలో శరీరానికి తగిన నీరు అందకపోతే కూడా కాళ్లకు పగుళ్లు ఏర్పడతాయి. అలాగే మీరు వాడే సబ్బు, మీరు తీసుకునే ఆహారంలో న్యూట్రిషన్ శాతం తక్కువగా ఉండటం కూడా కారణం కావచ్చు. మీ కాళ్లకు పగుళ్లు చాలా లోతుగా ఏర్పడినట్లు చెబుతున్నారు. రక్తస్రావం జరుగుతున్నట్లయితే మాత్రం వెంటనే డాక్టర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. ఎందుకంటే బ్యాక్టీరియా గాని ఫంగల్ ఇన్ఫెక్షన్ గాని మీ కాళ్ల పగుళ్లకు కారణమైతే సమస్య తీవ్రంగా ఉన్నట్లు భావించాలి. అవి పగుళ్ల స్థాయి నుంచి పుండ్లుగా మారే అవకాశం ఉంది. డయాబెటిస్, థైరాయిడ్ లేదా ఒబేసిటీ లాంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఎక్కువగా కాళ్ల పగుళ్ల సమస్యకు లోనవుతుంటారు. మీరు ఇలాంటి వ్యాధులతో బాధపడుతున్నారా లేదా అన్న అంశాన్ని ముందుగా నిర్ధారణ చేయాలి. అయితే ముందుగా మీ సమస్యకు ఉపశమనం పొందాలంటే కొన్ని సూచనలు పాటించండి. మంచినీటిని వీలైనంత ఎక్కువగా తీసుకోవాలి. గోరువెచ్చటి నీటిలో కాస్తంత ఉప్పు వేసి కాళ్లను కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచి, శుభ్రంగా కడుక్కోవాలి. అనంతరం పొడిబట్టతో తడి లేకుండా తుడవాలి. మాయిశ్చరైజర్ ఎక్కువగా ఉండే క్రీములను కాళ్లకు రాసుకొని సాక్సులను ధరించండి.

డా. సి.హేమంత్
సీనియర్ జనరల్ ఫిజీషియన్,
యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్

 

 

ఎండోక్రైనాలజీ కౌన్సెలింగ్
నా వయసు 42 ఏళ్లు. గత కొద్ది రోజులుగా నా గొంతు భాగంలో వాపు రావడంతో డాక్టర్‌ను సంప్రదించాను. ఆయన దానిని పరీక్షించిన తర్వాత అది గాయటర్ సమస్య అని వివరించారు. అసలు గాయిటర్ సమస్య అంటే ఏమిటి? వివరాలు తెలుపగలరు.  - నందన్‌రావు, ఒంగోలు

మన శరీరంలోని గ్రంథులలో థైరాయిడ్ గ్రంథి అతి ముఖ్యమైనది. ఇది మెడ దగ్గర సీతాకోకచిలుక ఆకృతిలో శ్వాసనాళానికి రెండువైపులా ఉంటుంది. ఇది శరీరంలో  థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (టీఎస్‌హెచ్)ను విడుదల చేస్తుంది. థైరాయిడ్ గ్రంథి అసాధారణంగా పెరగడాన్ని గాయిటర్ అంటారు. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి డిఫ్యూస్ గాయిటర్, రెండోది నాడ్యులార్ గాయిటర్. సాధారణ పరిమాణం కంటే థైరాయిడ్ గ్రంథి ఉబ్బిపోయి ఇరువైపులా సమానంగా పెరగడాన్ని  డిఫ్యూస్ గాయిటర్‌గా పరిగణిస్తారు. ఇక రెండోది నాడ్యులార్ గాయిటర్. ఇందులో  థైరాయిడ్ గ్రంథికి ఒక భాగంలో... ఒకటి లేదా ఇంకా ఎక్కువ సంఖ్యలో గడ్డలు ఏర్పడతాయి. దీన్ని నాడ్యులార్ గాయిటర్ అంటారు. గాయిటర్ ఉత్పన్నమైన వారిలో కొంతమందిలో థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి విషయంలో ఎలాంటి మార్పులు కనిపించవు. మరి కొందరిలో థైరాయిడ్ హార్మోన్లు ఎక్కువ లేదా తక్కువ మోతాదులో ఉత్పత్తి అవుతాయి. హార్మోన్ల ఉత్పత్తి పాళ్లు పెరిగితే హైపర్ థైరాయిడిజం అని, తగ్గితే హైపోథైరాయిడిజమ్ అని పరిగణిస్తారు. ఇది శరీరంలో అయోడిన్ లోపం వల్ల సంభవిస్తుంది. అయితే ఈ సమస్యలు ఉన్నవారిలో మామూలుగా గొంతును పరీక్షించడంతో పాటు థైరాయిడ్ ప్రొఫైల్ పరీక్షలైన టీ3, టీ4, టీఎస్‌హెచ్, యాంటీ థైరాయిడ్ యాంటీబాడీస్ వంటి నిర్ధారణ పరీక్షలు చేస్తారు. వాటి ఫలితాలను బట్టి ఎండోక్రైనాలజిస్ట్ ఆధ్వర్యంలో చికిత్స చేస్తారు. మనలోని థైరాయిడ్ వ్యవస్థను సరిచేయడం ద్వారా శస్త్రచికిత్స అవసరం లేకుండానే థైరాయిడ్ గ్రంథి వాపు (గాయిటర్) సమస్యను పూర్తిగా నయం చేయవచ్చు.

 

డా. వి.శ్రీనగేష్
కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్,
కేర్ హాస్పిటల్స్,  బంజారాహిల్స్, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement