అంతా విజయమే!
2017 సంవత్సర ఫలితాలు
మేషం (మార్చి 21– ఏప్రిల్ 20)
రాశులలో వీరు మొదటి రాశికి చెందిన వారు కనుక జీవితంలో కూడా ఏదైనా ట్రెండ్ సృష్టించడంలో మొదటి వరుసలో ఉంటారు. 2017 సంవత్సరం వీరికి కలిసి వచ్చే సంవత్సరం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సంవత్సరపు మొదటి భాగం చాలా బాగుంటుంది. మీకు సహకరించని అంశాలను ప్రకృతి తన సహజపద్ధతిలో తొలగిస్తుంది. కొంచెం ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ రాశివారు తమ లోపలి విషయాలు ఒకరితో చెప్పుకోవడానికి ఇష్టపడరు. తాము అనుకున్నది చేస్తారు. వృత్తి పరంగా ఇంటి నుంచి దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి రావచ్చు. ఒక అందమైన ప్రదేశంలో సొంత ఇల్లు కొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పుట్టినరోజు, ఇతర వేడుకలకు వృత్తి నుంచి విరామం తీసుకొని వినోదం పొందండి. ఈ విరామంలో మీ లక్ష్యాలను చేరుకోవడానికి కావలసిన శక్తియుక్తులను కూడగట్టుకోండి. మిమ్మల్ని నొప్పించే ఇతరుల మాటలను పట్టించుకోవద్దు. ప్రేమలో సరైన భాగస్వామిని ఎంచుకోండి. ఈ సంవత్సరం మీరు కోరుకునే అనుబంధాలు దక్కుతాయి. కలిసొచ్చేవి : రంగు: ఆరంజ్; వారం: ఆదివారం; అంకె: 1
వృషభం (ఏప్రిల్ 21–మే 20)
వృషభరాశికి వాడి అయిన కొమ్ములతో ఉండే వృషభం చిహ్నం. ఇది స్థిరత్వానికీ, దృష్టికోణానికి సంకేతం. అయితే వీరికి ఈ సంవత్సరం కొంచెం మందకొడిగా నడిచే అవకాశం ఉంది. ఆశలు, ఆశయాలు భారీగా ఉన్నా ఆ సంగతి బయటకు చెప్పక మనసులోనే పెట్టుకుని ఉంటారు. అసలు గత సంవత్సరం కోసం ఏం నిర్ణయాలు తీసుకున్నామా అని ఒకసారి పరికించుకోండి. కొంచెం ఓపిక అవసరం. టీమ్‌తో పాటు కలిసి పని చేయడం అలవర్చుకోవాలి. ప్రజాస్వామిక ధోరణి ఉండాలి. ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ప్రయాణాలకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్రేమకు, వివాహానికి ఈ సంవత్సరం అంత అనుకూలం కాదు. మిమ్మల్ని మీరు వెతుక్కోవడంలో మరింత లోతులకు వెళతారు.మీ పనే మీకు దైవం. మీ పనిలో మిమ్మల్ని కొట్టే చెయ్యి ఉండదు. ఆర్థిక పరంగా మంచి లబ్ధి కనిపిస్తోంది. పెట్టుబడులకు ఇది కలిసివచ్చే కాలం. ఏవైనా కోర్సులు చదవాలనుకునేవారికి కూడా ఈ కాలం కలిసి వస్తుంది.
కలిసొచ్చేవి : రంగు: పసుపు; వారం: మంగళవారం; అంకె: 2
మిథునం (మే 21–జూన్ 21)
ఈ 2017వ సంవత్సరం మీకు కలిసొస్తుంది. గతంలో చేసిన కృషికి తగ్గ ఫలితం ఈ కొత్త ఏడాదిలో లభిస్తుంది. అందుకే ఈ 2017లో వచ్చే కొత్త అవకాశాలను అందుకోవడం కోసం మీ మనసును తెరచి ఉంచుకోండి. భావోద్వేగపరమైన పరిణతి వస్తుంది. అయితే, ప్రేమ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని గ్రహాలు హెచ్చరిస్తున్నాయి. మొత్తం మీద మీ మానసిక భావోద్వేగాలు పెచ్చుమీరి, పరిస్థితులపై వాటిదే పైచేయి కాకుండా చూసుకోండి. కొత్త ఇమేజ్ తెచ్చుకోవడానికి ఈ కొత్త ఏడాది భలే మంచి టైమ్. ఎప్పటిలానే, ఆరోగ్యం మీదే మీ చూపు అంతా! చాలా మంది ఆరోగ్యబాటలో పయనించడానికి మీరు స్ఫూర్తిగా నిలుస్తారు. ఈ 2017లో మీకు లాటరీలు తగిలే అవకాశం ఉంది. ఆశ్చర్యకరమైన విజయాలు అందుకుంటారు. మీ అదృష్టం మరింత పెరగాలంటే, దక్షిణపు దిక్కున ఫినిక్స్ బొమ్మను ఉంచండి. దీని వల్ల బోలెడన్ని అవకాశాలు మీ తలుపు తడతాయి. వాటన్నిటినీ మీరు బంగారంలా వాడుకోవచ్చు. కలిసొచ్చేవి: రంగు: బంగారం; వారం: ఆదివారం; అంకె: 9
కర్కాటకం (జూన్22–జూలై 23)
ఎంత కష్టపడి పని చేస్తే అంత ఫలితం. విజ్ఞానం పెంచుకోవడానికీ, నైపుణ్యాలను అలవరచుకోవడానికీ ఇదే తగిన సమయం. రానున్న సంవత్సరాల్లో బలంగా నిలదొక్కు కొని నిలబడడానికి ముందుగానే లక్ష్యం నిర్దేశించుకొని, ముందడుగు వేయడం అవసరం. కొత్త ఏడాదిలో మీకు వేసవి కన్నా, శీతకాలం చాలా బాగా కలిసొస్తుంది. ఈసారి మీరు మరీ కొట్టొచ్చినట్లుండే ముదురు రంగు దుస్తులు వాడకండి. మీకు ప్రేమ చాలా ముఖ్యం. ప్రేమ లేకుండా జీవితమే లేదని భావిస్తారు. అందుకే, ఆ ప్రేమాన్వేషణలో ఉంటూ, ఎవరితోనైనా ఇట్టే ప్రేమలో పడిపోతుంటారు. కానీ, చాలా సందర్భాల్లో అన్ని ప్రేమలూ ఫలించవు కాబట్టి, కాస్తంత గుండె దిటవు చేసుకొని ముందుకు అడుగేయండి. మీ మనసుకు నచ్చేవాళ్ళను వెతుక్కోవడానికి ఇది సరైన సమయం కాకపోతేనేం, ఈ ఏడాది కాకపోతేనేం వచ్చే ఏడాదైనా దొరుకుతారని గుర్తించండి. ఈ ఏడాది మీ పుట్టినరోజు తరువాత మీ ప్రేమ జీవితం మరింత మెరుగవుతుందని గ్రహించండి.
కలిసొచ్చేవి : అదృష్ట సంఖ్య: 6; రంగు: సీ గ్రీన్; వారం: గురువారం
సింహం (జూలై 24–ఆగస్టు 23)
సగర్వంగా, కొండొకచో అహంకారంగా అనిపిస్తున్నా, నమ్మకంగా, ధైర్యంగా ముందుకు సాగడం సింహ రాశి వారి లక్షణం. సౌహార్దంగా ఉంటారు. ఇతరుల పట్ల దయతో, మంచి ఉత్సాహంగా ముందుకు సాగుతుంటారు. ఇల్లు మారడం, ఉద్యోగం మారడం, ప్రయాణాలు, లాటరీలు – అన్నీ మీకు ఈసారి కలిసొస్తాయి. మీ ఆశయాలు, లక్ష్యాలకు కట్టుబడి ఉండండి. ఇతరులను ఎవరినీ మీ మార్గంలోకి అడ్డుగా రానివ్వకండి. ఉద్యోగం, పని విషయంలో ఈ ఏడాది మీకు ఎక్కడ లేని శక్తి, ఉత్సాహం ఉంటాయి. కొత్త ఏడాది ఆరంభంలో మీరు పట్టిందల్లా బంగారమే. మీకంటూ ఒక ప్రత్యేకత ఉంది. దాని మీద దృష్టి పెట్టండి. మీ ప్రేమ విషయంలో మీ మనసులోని మాటను నిజాయతీగా చెప్పేయడం మంచిది. సింహరాశి వారికి తగిన వ్యక్తులు దొరుకుతారు. ఇంట్లో దక్షిణ మూలలో రెండు ఎర్ర కొవ్వత్తులు వెలిగించండి. దాంతో, మీకు మరింత ప్రేమ, ప్రణయం లభిస్తాయి.
కలిసొచ్చేవి: అదృష్ట సంఖ్య: 4; రంగు: అగ్ని జ్వాల లాంటి కమలాపండు రంగు; వారం: ఆదివారం
కన్య (ఆగస్టు24–సెప్టెంబర్ 23)
ఈ రాశి వారికి ఈ ప్రపంచం ఒక్కటే నాకు చాలదు అనే ధోరణి ఉంటుంది కనుక వీరి జీవితం సవాళ్లతో నిండి ఉంటుంది. వీళ్లు జీవితం నుంచి ముక్తసరిగా కాకుండా ఎక్కువ ఆశించడం దానికి కారణం. ఇది మీరు మీ జీవిత గమనాన్ని విశ్వసించాల్సిన సమయం. మీకు ఆ సంగతి తెలుసు. అందుకు సిద్ధపడండి. కొంచెం అనిశ్చితి మొదట చోటు చేసుకున్నా మమ్మిల్ని మీరు స్థిరపరుచుకొని ముందుకు సాగండి. అంతేతప్ప మిమ్మల్ని మీరు వెనక్కు లాక్కోండి. సమయం వచ్చేసింది. ధైర్యంగా అడుగువేస్తే మీరు ఏమేమి కోరుకున్నారో అవన్నీ పొందుతారు. న్యాయపరమైన లావాదేవీలు పరిష్కృతమవుతాయి. జూన్ తర్వాత అంతా బాగుంటుంది. కొన్ని ఊహించని పరిణామాలు మీకు ఆర్థికపరంగా అనుకూలంగా మారుతాయి. మీ పాత స్నేహితులు, పాత అనుబంధాలు మళ్లీ తారసపడి మీ గతంలోని హుషారును, కొంత కోలాహాలాన్ని తీసుకొని వస్తాయి. భౌతిక విషయాలు ఆధ్యాత్మిక విషయాల మధ్య సమన్వయం పాటించండి.
కలిసొచ్చేవి: రంగు: లేలేత గులాబీ (టెర్రకోట పింక్); సంఖ్య: 3; వారం: బుధవారం
తుల (సెప్టెంబర్ 24– అక్టోబర్ 23)
మీ స్నేహం, మీ సమ్మోహన శక్తి, మీ ఆతిథ్యం... కొత్త సంవత్సరంలో అందర్నీ మీ చుట్టూ తిప్పుకుంటాయి. 2017 మీ జీవితానికి మంచి మలుపు. రోజులు సాఫీగా, సమతులంగా గడుస్తాయి. అనుకున్నదాన్ని సాధించడానికి మీకున్న పరిమితులను దాటుకుని మరీ ప్రయత్నిస్తారు. మీ వ్యక్తిత్వాన్ని ప్రతిఫలించే దుస్తులపై దృష్టి పెడతారు. మనసులను వశం చేసుకుంటారు. అభిమాన్ని చూరగొంటారు. కొత్త వ్యక్తులకు మీరు ఆత్మీయులైపోతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా జీర్ణకోశంపై ఎక్కువ ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ఇతర విషయాలలో ముందు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. దూకుడు తగ్గించాలి. ఆలోచనల వేగాన్ని నియంత్రించుకోవాలి. ప్రారంభ మాసాలు కొంచెం అయోమయంగా ఉంటాయి. అలాగని ఆందోళన చెందనవసరం లేదు. 5వ అంకెకు దూరంగా ఉండండి. మే నెలలో డబ్బుకు కాస్త ఇబ్బంది అవుతుంది. ఫిబ్రవరి, నవంబర్ నెలల్లో ప్రయాణాలు.
కలిసొచ్చేవి : రంగు : లేత నీలం (పాస్టల్ బ్లూ); వారం : బుధవారం; అంకె : 3
వృశ్చికం (అక్టోబర్ 24–నవంబర్ 22)
సమర్థత మీ రహస్య ఆయుధం. దెబ్బ తగిలినా కోలుకోగల సామర్థ్యం మీ సొంతం. కొత్త అవకాశాల కోసం మీరు ఎంతోకాలంగా వేచిచూస్తున్నారు. కానీ ఎన్నో అవకాశాలు ఈ ఏడాది మిమ్మల్నే వెతుక్కుంటూ వస్తాయి. ఒత్తిళ్లు ఎదుర్కోవడం అన్నది ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా మీ వెన్నంటే ఉన్నా... ఆ తర్వాతి విజయాలు ఆ ఒత్తిడుల తాకిడికి ఉపశమనంలా పనిచేస్తాయి. కొన్ని విజయాలు మిమ్మల్ని వరించడానికి ఈ ఏడాది సంసిద్ధంగా ఉన్నాయి. ఒక మార్మికమైన, దివ్యమైన శక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. మీరు సంసిద్ధం చేసుకునే కొత్త కొత్త వ్యూహాల కారణంగా భవిష్యత్తులో మీకు భద్రత సమకూరుతుంది. పోరాటపటిమను ప్రదర్శిస్తుంటారు. మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని మరింతగా ఇష్టపడటానికి మీకు ఉన్న ఈ గుణమే దోహదపడుతుంది. ఫిబ్రవరి, ఆగస్టు, అక్టోబర్ నెలలు మిమ్మల్ని కాస్త ఒత్తిడికి గురిచేస్తాయి. జనవరి, డిసెంబరు నెలల్లో దూరప్రయాణాలకు అవకాశం కలగవచ్చు.
కలిసొచ్చేవి : రంగు : ఇటుక ఎరుపు (బ్రిక్ రెడ్); వారం : మంగళవారం; నంబరు : 2
ధనుస్సు (నవంబర్23–డిసెంబర్ 21)
ఉన్న చోటే కుదురుగా ఉండిపోడానికి ఇష్ట పడరు. స్వేచ్ఛగా విహరించేందుకు నిత్యం మార్గాలను అన్వేషిస్తుంటారు. ప్రయాణాలకు ప్రాధాన్యం ఇస్తారు. తత్వవేత్తలు, చింతనాపరుల సాన్నిహిత్యాన్ని కోరుకుంటారు. చర్చల్లో పాల్గొంటారు. వాదోపవాదాల కారణంగా మీ విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. దేన్నయినా తేలిగ్గా తీసుకుంటారు. కానీ సూక్ష్మంగా విశ్లేషిస్తారు. మీరు కోరుకున్నది మీ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అక్టోబరులో మనసైన వారు చేరువవుతారు. జూన్ తర్వాత మాత్రమే చేతిలో కాస్త డబ్బుల ఆడతాయి. వ్యక్తిగత ప్రయాణాలకు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఉద్యోగ రీత్యా కూడా మీరు విదేశీయానం చేస్తారు. మీది వ్యాపారం అయితే కొత్త వ్యాపారం, మీరు ఉద్యోగి అయితే కొత్త ఉద్యోగం జత కలుస్తుంది. అవసరంలో ఉన్నవారికి అడక్కుండానే సహాయం చేస్తారు. జూలై నుంచి మీ జీవితం అత్యద్భుతంగా ముందుకు సాగుతుంది. కొండాకోనల్లో, పచ్చని ప్రకృతి నీడలో స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ప్రయత్నాలు మొదలవుతాయి. కలిసొచ్చేవి : రంగు : లేలేత ఊదా (రాయల్ పర్పుల్); వారం : గురువారం; అంకె : 9
మకరం (డిసెంబర్ 22–జనవరి 20)
ఆధిక్య భావన, తీవ్ర ఆకాంక్ష, పట్టువిడుపులేని స్వభావం మిమ్మల్ని విజయపథం వైపు నడిపిస్తాయి. అంచెలన్నీ దాటి చకచకా అందలం చేరుకుంటారు. పై అధికారులకు మీ ముక్కుసూటితనం కొంత అసహనం కలిగించినప్పటికీ మీరు వారికి ప్రియమైన వ్యక్తి అవుతారు. ఇది మీకు ‘సక్సెస్ ఇయర్’. ప్రణాళికాబద్ధమైన ఆలోచనలతో మీ లక్ష్యాలను నెరవేర్చుకుంటారు. కలల్ని నిజం చేసుకుంటారు. వచ్చిన అనేక మెరుగైన అవకాశాల్లో నుంచి మరింత మెరుగైన దాన్ని ఎంచుకోవడం మీకు కష్టమయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. మార్పును అంగీకరించని మీ తత్వాన్ని 2017 కొద్దిగానైనా సడలిస్తుంది. అదీ మంచికే. ప్రేమకు మీరు తల ఒగ్గుతారు. ప్రేమ కోసం మిమ్మల్ని మీరు మార్చుకుంటారు. అంటే రాజీ పడతారు. ప్రేమలో అవతలి వ్యక్తి అభిప్రాయాలకు ప్రాముఖ్యం ఇస్తారు. మార్చి, ఏప్రిల్, మే నెలలు మీకు అనుకూలమైనవి. జూలై నుంచి ఆరోగ్యం పూర్తిగా మెరుగవుతుంది. కలిసొచ్చేవి : రంగు : ముదురాకు పచ్చ (ఫారెస్ట్ గ్రీన్); వారం : శనివారం; సంఖ్య : 12
కుంభం (జనవరి 21–ఫిబ్రవరి 19)
ఈ ఏడాది ప్రారంభం మీకు చాలా బాగుంటుంది. ప్రేమలో విజయాలు, మీ సంతోషం కొనసాగుతాయి. గతంలోని చేదు అనుభవాలు తుడిచిపెట్టుకుపోతాయి. మీ దిగులు, బెంగ వంటి వాటిని ఎలా అధిగమించాలా అని తర్కబద్ధంగా ఆలోచిస్తారు. మీ జీవితంలోకి ఒక మహిళ ప్రవేశించి, మిమ్మల్ని చాలా ప్రభావితం చేస్తుంది. ఆమె కీలకమైన భూమిక పోషిస్తుంది. ఒకవేళ మీరు మహిళ అయి ఉంటే మిమ్మల్ని మీరే ప్రోత్సహించుకుంటారు. ఈ ఏడాది మీ సంపద అనూహ్యంగా పెరుగుతుంది. కుటుంబం నుంచి అమితమైన ఆనందం లభ్యమవుతుంది. దూరంగా ఉన్న కుటుంబ సభ్యులు దగ్గరవుతారు. సంతోషాలు, ఆనందాలు అందరితో పంచుకుంటారు. ఆరోగ్యపరంగా ఏడాది మీకు అత్యుత్తమమైంది. అనంత విశ్వం నుంచి మీకు సమకూరే సంతోషాలతో ఈ ఏడాది మీకు ఎంతగా కలిసి వస్తుందంటే... ఆనందాల సింహాసనంపై కూర్చున్న రారాజులాగా మీరు ఫీలవుతారు. గుడిగంటల వంటి సంతోషాల ప్రకంపనలు మిమ్మల్ని ఎప్పుడూ సందడిగా ఉండేలా చేస్తాయి.కలిసొచ్చేవి : రంగు : నీలిమందు రంగు; వారం : శని; అంకె : 9
మీనం (ఫిబ్రవరి 20–మార్చి 20)
మీరు ఒకింత సున్నిత మనస్కులు. మీ మనసుకు తగ్గట్లుగానే ఒక అద్భుతమైన కలల ప్రపంచం మీ ముందు ఆవిష్కృతమైనట్లుగా ఈ ఏడాది అంతా అనిపిస్తుంటుంది. ఈ ఏడాది ప్రశాంతంగా కొనసాగుతుంది. కొన్ని సమస్యలు ముందు ఉన్నా మీ ఆత్మవిశ్వాసంతో వాటిని తేలిగ్గానే అధిగమిస్తారు. కొన్ని పొరబాట్లు జరిగేందుకు ఆస్కారం ఉన్నప్పటికీ గత అనుభవాల కారణంగా మీరు వాటిని దొర్లనివ్వకుండా జాగ్రత్తపడతారు. మీ బాంధవ్యాల విషయంలో అపార్థాలకు తావివ్వకుండా మీ ఆలోచనలను పంచుకోడానికి సిద్ధంగా ఉండండి. దాంతో మీ ఆలోచనలను వారూ సానుకూలంగా తీసుకుంటారు. దాంతో ఎన్నో ఇక్కట్లు తొలగిపోతాయి. కొత్త పెట్టుబడులకు ఆస్కారం ఉంది. మీ ఆదాయానికీ, ఖర్చులకూ సమన్వయం ఉంది. అయితే కొత్త ఆస్తులు సమకూర్చుకోడానికి తగిన అవకాశాలను సైతం ఈ కొత్త ఏడాది మీ ముందుకు తీసుకువస్తుంది. జూన్ నుంచి సెప్టెంబరు వరకు మరింత సానుకూలంగా ఉంటుంది.
కలిసొచ్చేవి : రంగు : నీలిపచ్చ (సీ గ్రీన్); వారం : గురువారం; నంబరు : 4
టారో అనలిస్ట్, టారో ఇన్సియా