బక్కగా ఉంటాను... బరువు పెరగడం ఎలా?
నా వయసు 24. నేను సన్నగా ఉంటాను. డాక్టర్‌గారిని అడిగితే, నా ఎత్తుని బట్టి నేనింకా 8-9 కిలోలు బరువు పెరగాలన్నారు. ఆయుర్వేద పద్ధతుల ద్వారా బరువు పెరగడానికి, చక్కటి ఆరోగ్యాన్ని పదిలపరచుకోడానికి మంచి సలహా ఇవ్వండి.
- స్వాతి, హైదరాబాద్
‘ప్రకృతి, సార, సత్వ’... అవి మనిషి మనిషికీ మారుతుంటాయి. సన్నగా ఉండటం, లావుగా ఉండటం, బరువు, పొడవు వంటి అంశాలు వీటి మీదే ఆధారపడి ఉంటాయి. అయినప్పటికీ మనం పాటించాల్సిన ఆహార విహార నియమాలు, పద్ధతులు సక్రమంగా లేకపోతే అతి సన్నగా ఉండటం, అతిగా స్థూలంగా ఉండటం వంటివి సంభవిస్తుంటాయి. శరీరంలో కార్టిజోన్ల స్థాయి తగ్గడం, పిట్యూటరీ హార్మోను స్థాయి ఎక్కువ అవడం, చిరకాలంగా బాధిస్తున్న ఇన్ఫెక్షన్లు, టీబీ, టైఫాయిడ్‌ల వంటి ఇతర వ్యాధులు, భయం, ఆందోళన మొదలగు సందర్భాల్లో కూడా సన్నగా ఉండటం జరుగుతుంది. కొంతమంది కొన్ని అపోహలతో ఆహారం తక్కువ తింటారు. దానివల్ల శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, ఖనిజలవణాల వంటి పోషకాలు లోపిస్తాయి. ఇది కూడా ఒక కారణమే. మీరు ఈ కింది ఆహార విహారాలను పాటిస్తూ, సూచించిన ఆయుర్వేద మందులు వాడండి. పైన చెప్పిన కారణాలను గమనిస్తూ ప్రతినెలా బరువు తూచుకుంటే, మీరు మూడోనెలలోనే అనుకున్న ఫలితానికి చేరువ కావడానికి అవకాశం ఉంది.
ఆహారం: ఉదయం, సాయంత్రం అల్పాహారం, రెండుపూటలా మిత భోజనం అమలుపరచండి. రోజూ కనీసం ఐదు లీటర్ల నీళ్లు తాగండి. వంటకాలలో, నువ్వులనూనెకు ప్రాధాన్యం ఇవ్వండి. ఇడ్లీ, దోశ, మినపరొట్టి వంటి భక్ష్యాలు బరువు పెరగడానికే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచివి. ముడిబియ్యంతో అన్నం వండుకోండి. అరటిపండ్లు, సపోటా, బొప్పాయి, సీతాఫలం, దానిమ్మ వంటి తాజాఫలాలు తీసుకోండి. శుష్కఫలాలలో ఖర్జూరం, జీడిపప్పు, బాదం చాలా మంచివి. నువ్వులు, బెల్లం కలిపి చేసిన ‘చిమ్మిలి’ తినండి. ఇంట్లో నెయ్యి వేసి చేసిన పాయసాలు చాలా హితకరం. బూడిద గుమ్మడికాయతో చేసిన వడియాలు, కేరట్‌హల్వా ఉపయోగకరం. ఉప్పు, కారం చాలా మితంగా సేవించాలి. ఆవునెయ్యి శ్రేష్ఠం. అల్లం, వెల్లుల్లి ఆకలికి, అరుగుదలకు చాలా మంచివి.
విహారం: తగినంత నిద్ర, విశ్రాంతి అవసరం. రాత్రి 10 గంటలకు పడుకొని, ఉదయం 5 గంటలకు నిద్రలేవండి. మితమైన వ్యాయామం, రెండుపూటలా ప్రాణాయామం అవసరం. దీనివల్ల మానసిక ఒత్తిడి, ఆందోళనలను అధిగమించవచ్చు. వీలుంటే ఉదయంపూట సూర్యరశ్మిలో ఐదునిమిషాలు నిల్చోండి.
మందులు
అశ్వగంధాది లేహ్యం: ఉదయం ఒక చెంచా, రాత్రి ఒక చెంచా చప్పరించి, పాలు తాగండి.
ఆరోగ్యవర్థని (మాత్రలు): ఉదయం ఒకటి, రాత్రి ఒకటి
ద్రాక్షారిష్ట (ద్రావకం): నాలుగు చెంచాల మోతాదున రెండు పూటలా తాగండి.
గమనిక:
బరువు పెరగడం అవసరమే అయినా కొవ్వు పెరగడం అనర్థదాయకమని గుర్తుంచుకోండి. ఈ ఆశయసిద్ధికి పై సూచనలు బాగా ఉపకరిస్తాయి. తగినంత బరువు ప్రాప్తించిన తర్వాత, ఇకపై మరింత బరువు పెరగకుండా తగు జాగ్రత్తలతో ఆహారంలో మార్పులు చేసుకోవాలి.
డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి
అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్),
సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్,
హుమయున్ నగర్, హైదరాబాద్