అక్కరలేని వాటి అడ్డు తొలగేదిలా...
నలుగు పిండి
యవ్వనంలోకి అడుగుపెట్టాక చాలామంది అమ్మాయిలను విసిగించే సమస్య అవాంఛిత రోమాలు. వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్ వంటి పద్ధతులను అవలంభించినా.. ఇంట్లోనే లభించే పదార్థా లతో అవాంఛిత రోమాలు రాకుండానూ జాగ్రత్తలు తీసుకోవచ్చు.
నలుగు పిండి ఎలా చేయాలంటే..!
పసుపు, ఆవపిండి, ఉలవల పిండి, కరక్కాయ చూర్ణం, మంచి గంధం పొడి, మారేడు పత్రాల పొడి... వీటన్నింటిని కలిపి కొద్దిగా బరకగా ఉండేలా మర పట్టించుకోవాలి. లేదంటే బరకగా ఉండేలా బియ్యప్పిండి, సెనగపిండిని కూడా కలుపుకోవచ్చు. ఇలా తయారుచేసుకున్న పిండిలో కొద్దిగా నువ్వుల నూనె కలిపి ఒంటికి పట్టించి, వ్యతిరేక దిశలో కాస్త ఒత్తిడి కలిగిస్తూ రాస్తూ ఉండాలి. దీన్నే నలుగు పెట్టడం అంటారు. ఇలా చేయడం వల్ల వెంట్రుక సులువుగా ఊడి వచ్చేస్తుంది.
ఇలా కుదరకపోతే ఆవుపాల మీగడ కలుపుకోవచ్చు. ఈ మిశ్రమం మరీ జారుగా ఉండకూడదు. వెంట్రుకలు ఎక్కడ ఉన్నాయో, ఆ భాగంలో ఈ పొడిని రాసి, రివర్స్ డెరైక్షన్‌లో మర్దన చేయాలి. అమ్మాయిల్లో పిసిఓడీ వంటి సమస్యల వల్ల ఆండ్రోస్ హార్మోన్లు రిలీజ్ అవుతాయి. దీంతో గడ్డాలు, మీసాలు వస్తుంటాయి. ఏ కారణం వల్ల అవాంఛిత రోమాలు వస్తున్నాయో తెలుసుకొని మందులు వాడితే సమస్య తగ్గుముఖం పడుతుంది.