ముక్కు సూటిగా... | how to manage to crooked nose | Sakshi
Sakshi News home page

ముక్కు సూటిగా...

Published Wed, Feb 22 2017 10:53 PM | Last Updated on Tue, Sep 5 2017 4:21 AM

ముక్కు సూటిగా...

ముక్కు సూటిగా...

ముక్కు దూలం వంకర ఉన్నప్పటికీ దానివల్ల శ్వాస తీసుకోవడానికి ఎలాంటి అంతరాయాలూ లేకపోతే శస్త్ర చికిత్స చేయించనవసరం లేదు. ముక్కు దూలం వంకర వల్ల ఒకవేళ సమస్యలు ఉన్నవారైనా మందులు వాడిన తర్వాత వారికి ఉపశమనం కలుగుతుంటే శస్త్ర చికిత్స అవసరం లేదు.

కోటేరులాంటి ముక్కు... అంటూ ఆ నాసికా సౌందర్యాన్ని వర్ణిస్తుంటారందరూ. అంటే నేల మీద నాగలిని నిలబెట్టినప్పుడు ఉండే ఆకృతిలా ఉంటుందని దాని అర్థం. అయితే ఆ నాగలి కర్ర అటు ఇటు వంకర్లు పోకుండా చక్కగా ఉండాలి. కానీ మన దేశంలో సుమారుగా కోటి మంది తమ ముక్కులోని రెండు రంధ్రాల మధ్య ఉండే దూలం తిన్నగా లేకపోవడంతో వచ్చే సమస్యతో బాధపడుతుంటారు. ఈ సమస్యనే ఇంగ్లిష్‌లో ‘డీవియేటెడ్‌ నేసల్‌ సెప్టమ్‌’ అని అంటుం టారు. దీన్ని సరిచేసుకోడానికి సెప్టల్‌ డీవియేషన్‌ కరెక్షన్‌ సర్జరీ అనే చిన్నపాటి శస్త్రచికిత్స అవసరమవుతుంది. ఈ సమస్యనూ, ముక్కును సూటిగా చేసే ఆ శస్త్ర చికిత్స వివరాలను తెలుసుకోవడం కోసమే ఈ కథనం.

ముక్కు దూలం వంకర అవడం అంటే ఏమిటి?
మన రెండు ముక్కు రంధ్రాల మధ్యలో కిందివైపున ఒక పలచటి గోడలాంటి చర్మంతో పాటు పై వైపున ఎముకతో కూడిన భాగం ఉంటుంది. రెండు రంధ్రాల మధ్యగా ఉండే ఈ బ్రిడ్జి వంటి భాగాన్ని ‘నేసల్‌ సెప్టమ్‌’ అంటారు. తెలుగులో దీన్ని ముక్కు దూలం అంటారు. ఇది రెండు ముక్కు రంధ్రాలను సమానంగా విభజించి గాలి ప్రసరణ సరిగా అయ్యేందుకు తోడ్పడుతుంది. కొన్ని సందర్భాలలో ఈ ముక్కు దూలం ఒక వైపుకు వొంగి ఉండడం లేదా మూసుకుపోయి ఉండటం జరుగుతుంది. దీనినే డీవియేటెడ్‌ నేసల్‌ సెప్టమ్‌ అంటారు. ఈ సమస్యలో తీవ్రత అన్నది ముక్కు మధ్య భాగం ఎంతగా  వంగి ఉందో అనే అంశం మీద ఆధారపడి ఉంటుంది. సెప్టమ్‌ లేదా దూలం పూర్తిగా వంగి ఉంటే వారిలో శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. అంతే కాకుండా కొంతమందిలో ముక్కు రంధ్రాలు పొడి బారటంతో పాటు కొన్నిసార్లు రక్తస్రావమూ కావచ్చు.

ఎప్పుడు వైద్యుని సంప్రదించాలి?
ముక్కుదూలం వంకరగా ఉండటం వల్ల కనిపించే  లక్షణాలలో ఒకటిగానీ లేదా అంతకుమించి గానీ చాలా ఎక్కువ కాలం పాటు బాధపెడుతూ ఉంటే ∙ముక్కు రంధ్రాలు మూసుకుపోయినట్లయితే ∙తరచూ రక్తస్రావం అవుతుంటే ∙సైనస్‌ ఇన్‌ఫెక్షన్లు తరచుగా వస్తుంటే

నిద్ర పట్టకపోవడం జరుగుతుంటే ముక్కుదూలం వంకరగా ఉండటం వల్ల కనిపించే  లక్షణాలలో ఏవైనా కనిపిస్తున్నప్పుడు ఈఎన్‌టీ నిపుణులను సంప్రదించాలి. వారు మొదట క్లినికల్‌ పరీక్షలు చేస్తారు. ఇందులో మీ సమస్యలు, సంబంధించిన హిస్టరీ, వాడిన మందులు లేదా చికిత్స వివరాలు మొదలైనవి తెలుసుకుంటారు. అలాగే హెడ్‌లైట్‌ మిర్రర్‌ ద్వారా, నేసల్‌ స్పెక్యులమ్‌ ద్వారా పరీక్షిస్తారు. అవసరాన్ని బట్టి సి.టి.స్కాన్‌ – ముక్కు, ఎండోస్కోపి, కొన్ని సందర్భాలలో రైనోమానో మెట్రీ అనే సరికొత్త పరీక్ష ద్వారా సమస్య తీవ్రతను అంచనా వేసి, దాన్ని బట్టి అందించాల్సిన చికిత్సను నిర్ణయిస్తారు.

డీవియేటెడ్‌ నేసల్‌ సెప్టమ్‌లో కనిపించే లక్షణాలు ఇతర ముక్కు సంబంధిత సమస్యలలో కూడా గమనించవచ్చు. అందులో ప్రధానమైనవి నేసల్‌ పాలిప్స్‌ (ముక్కులో పెరిగే అదనపు కండ వంటి భాగాలు), అలెర్జిక్‌ రైనైటిస్, పిల్లల్లో అడినాయిడ్స్, నేసో ఫారెంజెయల్‌ గ్రోత్‌. కొంతమందిలో ముక్కుకు సంబంధించిన అలర్జీ వల్ల ఈ లక్షణాలు తీవ్రంగా కనిపిస్తాయి. అందువల్ల అటువంటి వారికి నేసల్‌ అలర్జీకి సంబంధించిన ప్రశ్నలతో కూడుకున్న పరీక్షలతో పాటు సంబంధిత ఇతర పరీక్షలు చేయించాలి. కొన్నిసార్లు ఈ ముక్కు దూలం వంకర అనేది సైనసైటిస్, ఇతర సమస్యలతో కలిపి ఉంటుంది. అందువల్ల ఇతర సమస్యలకు సంబంధించిన పరీక్షలూ చేయించాలి. చాలావరకు సి.టి.స్కాన్‌ మరియు ఎండోస్కోపి (నేసల్‌) ద్వారా వైద్యులకు కావాల్సిన సమాచారం లభిస్తుంది.

చికిత్స : మొదటగా మీకు ఉన్న లక్షణాలను బట్టి చికిత్స  ఉంటుంది. చాలావరకు మందులనే  (నేసల్‌ డికంజెస్టెంట్స్, యాంటిహిస్టమిన్స్‌), నేసల్‌ స్టెరాయిడ్స్‌ స్ప్రే వాడతారు. ముక్కు మూసుకుపోవడం, నీరు కారడం మొదలైన లక్షణాలకు ఈ మందుల ద్వారా ఉపశమనం లభించవచ్చు. అలర్జీ సంబంధిత సమస్యలు గుర్తించనప్పుడు పైన తెలిపిన మందులు, స్ప్రేతో పాటుగా అలర్జీకి సంబంధించిన మందులు, జాగ్రత్తలు, సంబంధిత చికిత్స ఇవ్వాలి.

మందులు, స్ప్రే, జీవనశైలిలో మార్పులు చేసినా ఎటువంటి ఉపశమనం కలగకపోయినా లేదా ముక్కుకు సంబంధించిన నిర్మాణపరమైన లోపాలు ఉన్నా, దూలం వంకర ముక్కుకు సంబంధించిన నిర్మాణపరమైన లోపాలు ఉన్నా, దూలం వంకర ఎక్కువగా ఉన్నా శస్త్ర చికిత్స ద్వారా ముక్కుదూలాన్ని సరిచేయాల్సి ఉంటుంది. చాలాసార్లు ముక్కు దూలం వంకరతో పాటుగా ముక్కులోని సైనస్‌లలో తరచు ఇన్‌ఫెక్షన్లు, నేసల్‌ టర్బినెట్స్‌లో లోపాలు, నేసల్‌ పాలిప్స్‌ ఉన్నప్పుడు కూడా శస్త్రచికిత్స అవసరమవుతుంది.కేవలం ముక్కు దూలం వంకర సరిచేసే ప్రక్రియను సెప్టొప్లాస్టీ అంటారు. ఈ సెప్టోప్లాస్టీలో ముక్కు దూలంను రెండు ముక్కు రంధ్రాలకు మధ్యలో ఉండేలా సరిచేసి, ఎటువంటి వొంపులు లేకుండా చూస్తారు. అలర్జీ కూడా ఉన్నవారిలో ముందుగా సంబంధిత చికిత్స తర్వాతనే శస్త్రచికిత్స చేస్తారు. శస్త్ర చికిత్స తర్వాత కూడా అందుకు సంబంధించిన మందులు, జాగ్రత్తలు తీసుకోవాలి.

మరొక ప్రక్రియను రైనోప్లాస్టీ అంటారు. ఈ రైనోప్లాస్టీ ముక్కు ఆకారం సరిగా లేనివారికి చేస్తారు. ఈ శస్త్ర చికిత్సలో ముక్కులోని ఎముక భాగం, కార్టిలేజ్‌ భాగాలను సరిచేయడం ద్వారా సరైన ఆకృతికి తీసుకురావడం జరుగుతుంది. చాలా సందర్భాల్లో సెప్టోప్లాస్టీని, రైనో ప్లాస్టీతో కలిపి చేయవలసి ఉంటుంది. దీనినే సెప్టో రైనో ప్లాస్టీ అంటారు. అలానే నేసల్‌ టర్బినేట్స్‌ లోపాలు ఉన్నవారికి సెప్లోప్లాస్టీతో పాటుగా టర్బినోప్లాస్టీ కూడా చేస్తారు. క్లుప్తంగా ముక్కుదూలం వంకరకు ముందుగా పరీక్ష ఫలితాలు ఆధారంగా మందులు, స్ప్రే అలర్జీ సంబంధిత మందులు వాడి వాటి వల్ల ఫలితం లేనప్పుడు శస్త్రచికిత్సకు సూచిస్తారు.

ముక్కు దూలం వంకర రాకుండా జాగ్రత్తలు
పుట్టుకతో వచ్చే లోపాలను మనం ఏమి చేయలేం. కానీ... ఫుట్‌బాల్, క్రికెట్‌ వంటి ఆటలలో జరిగే ప్రమాదాలను నివారించడానికి హెల్మెట్‌ ధరించడం, ఇతర ఆటలు ఆడేటప్పుడు సంబంధిత రక్షణ పరికరాలు ధరించడం వంటి జాగ్రత్తలు వహించడం చాలా ముఖ్యం.

కారణాలు
పుట్టుకతో వచ్చేవి ∙ముక్కుకు దెబ్బ తగలడం

లక్షణాలు
చాలామందిలో ఎటువంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు. మనలో కూడా చాలామందికి ఈ సమస్య ఉండచ్చు కానీ అది ఇబ్బంది పెట్టకపోవచ్చు. ఇబ్బంది పడేవారిలో కింద పేర్కొన్న లక్షణాలు ఉంటాయి ∙ఒకటి లేదా రెండు ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం

ముక్కు నుంచి రక్తం కారడం లేదా తరచుగా నీరు కారడం ∙ఒక వైపు ముఖంలో నొప్పి (పేషియల్‌ పెయిన్‌ ఆన్‌ వన్‌ సైడ్‌). ముఖ్యంగా మూసుకుపోయిన చెవి రంధ్రం వైపు భాగం ∙రాత్రి వేళల్లో లేదా నిద్రలో గురక పెట్టడం ∙ఒక వైపు మాత్రమే గాలి పీల్చుకోవడం ∙ఒక వైపే నిద్రపోవడం ∙నోటితో గాలి పీల్చుకోవడం ∙తరచుగా తలనొప్పి.
డాక్టర్‌ ఇ.సి. వినయకుమార్‌
హెచ్‌ఓడి – ఈఎన్‌టి సర్జన్
అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement