ఏడుకొండలకు ఆ పేర్లు ఎలా వచ్చాయంటే..?
సప్తగిరి
ఏడుకొండల సమాహారమే తిరుమల దివ్యక్షేత్రం. వాటి గురించిన విశేషాల్లోకి వెళ్తే...
వృషభాద్రి: పూర్వం వృషభాసురుడు అనే శివభక్తుడు బలగర్వితుడై శ్రీహరితోనే యుద్ధానికి తలపడ్డాడు. యుద్ధంలో చావు తప్పదనుకుని వృషభాసురుడు ‘నీ చేతిలో మరణించడం నా మహద్భాగ్యం! నీవున్న ఈ పర్వతానికి ‘వృషభాచలం’ అన్న పేరు ప్రసాదించాలని వేడుకున్నాడు. స్వామి ఆ వరమిచ్చి, త ర్వాత అతణ్ని సంహరించాడు.
నీలాద్రి: ఏడుకొండల స్వామికి భక్తులు తలనీలాలను మొక్కుగా చెల్లించడం వెనక ఒక పురాణ కథనం ఉంది. స్వామివారికి తొలిసారిగా తన తలనీలాలు సమర్పించిన భక్తురాలి పేరు నీలాంబరి. ఆమె భక్తికి పరవశించిన స్వామివారు సప్తగిరిలో ఓ కొండకు ఆమె పేరు పెట్టారని ప్రతీతి.
గరుడాద్రి: శ్రీ మహావిష్ణువు హిరణ్యాక్షుని సంహరించిన తర్వాత గరుత్మంతుని పిలిచి, తన క్రీడాద్రిని తీసుకురమ్మని ఆదేశిస్తాడు. ఆయన ఆజ్ఞ మేరకు గరుత్మంతుడు దాన్ని తెచ్చినందువల్లే ఇది ‘గరుడాచలం’, ‘గరుడాద్రి’గా ప్రసిద్ధి పొందింది.
అంజనాద్రి: సంతానం కోసం అంజనాదేవి వేంకటాచల క్షేత్రంలో తపస్సు ఆచరించింది. దాంతో ఆమె గర్భాన్ని దాల్చి అనంత బలశాలి అయిన ఆంజనేయుడికి జన్మనిచ్చింది. అందుకే ఈ పర్వతం అంజనాద్రిగా ప్రసిద్ధి పొందింది.
నారాయణాద్రి: నారాయణుడనే భక్తుడు స్వామి పుష్కరిణి తీరాన తపస్సు చేయడంతో అతడి పేరుమీదుగా ఈ పర్వతం నారాయణాద్రిగా ఖ్యాతి పొందింది.
వేంకటాద్రి: ‘వేం’ అనగా సమస్త పాపాలను, ‘కటః’ అనగా దహించునది. అంటే, పాపరాశులను భస్మం చేసేది కనుక ఈ క్షేత్రానికి ‘వేంకటాచలం’ అని పేరొచ్చింది..
శేషాద్రి: ఓసారి ఆదిశేషుడికి, వాయుదేవునికి మధ్య ఎవరు గొప్పనే వివాదం రేగింది. ‘నీకు శక్తి ఉంటే నన్ను కదుల్చు’ అంటూ ఆదిశేషుడు వేంకటాచలాన్ని చుట్టుకున్నాడు. వాయుదేవుడు అతణ్ని విసిరివేయగా పర్వతంతోపాటు ఇక్కడ వచ్చి పడతాడు. ఓడిపోయిన చింతతో ఉన్న ఆదిశేషుడిని శ్రీనివాసుడు ఓదార్చుతూ, నిన్ను ఆభరణంగా ధరిస్తాను, నీ పేరుతో ఈ క్షేత్రం ప్రసిద్ధి పొందుతుందని వరమిచ్చాడు. దాంతో ఇది శేషాద్రిగా ప్రసిద్ధి పొందింది.
- డీవీఆర్