
భర్త కొంతకాలంగా భార్యలో మార్పును గమనిస్తున్నాడు. తను ఏం అడిగినా భార్య వెంటనే సమాధానం చెప్పడం లేదు! పనిలో అలసిపోతోందా? ఆమె ఎప్పుడూ అలసట గురించే మాట్లాడలేదు. మరేమిటి? ‘చెవుడుగానీ రాలేదు కదా’ అనుకున్నాడు! ఆ మాట అంటే ఆమె బాధపడుతుందని అనలేదు. స్నేహితుడైన ఒక వైద్యుడిని కలిసి, తన భార్య మనసు నొప్పించకుండా ఆమెకు చెవుడు వచ్చిందేమో తెలుసుకోవడం ఎలా? అని అడిగాడు. ‘ఓ పని చెయ్యి. మొదట ఇరవై అడుగుల దూరంలో ఉండి ఏదైనా అడుగు. ఆమె పలకక పోతే పదిహేను అడుగుల దూరంలో ఉండి మళ్లీ అడుగు. అప్పటికీ మౌనంగానే ఉండిపోతే, పది అడుగుల దూరంలోకి వెళ్లి అడుగు. అప్పటికీ ఉలుకూ పలుకూ లేకపోతే ఐదు అడుగులు ముందుకెళ్లి అడుగు. అయినప్పటికీ ఆమె సమాధానం చెప్పలేదంటే నీ సందేహం నిజమే... ఆమెకు చెవుడు వచ్చినట్లే’ అని చెప్పాడు స్నేహితుడు. అలాగే చేశాడు భర్త.
ఆమె వంటగదిలో ఉన్నప్పుడు ఇరవై అడుగుల నుంచి, పదిహేను అడుగుల నుంచి, పది అడుగుల నుంచి, ఐదు అడుగుల నుంచి ‘కూర ఏం చేస్తున్నావ్?’ అని అడిగాడు. ఆమె సమాధానం చెప్పలేదు. దగ్గరికి వెళ్లి ఆమె చెవిలో అడిగాడు.. ‘ఏంటి.. ఇవాళ కూర?’ అని. ‘అబ్బబ్బ.. చికెన్ అని నాలుగుసార్లు చెప్పాను కదా! మీకు వినిపించకపోతే నేనేం చేసేది’ అంది ఆవిడ, పనిలో మునిగిపోతూ. సమస్య మనతోనే అని తెలుసుకోలేక, చాలాసార్లు మనం అవతలి వాళ్లను సమస్యగా భావిస్తాం. తప్పు మనదే అని గ్రహించక తొందరపడి అవతలి వాళ్లను తప్పుబడతాం. ఎవర్నైనా సందేహించే ముందు.. మిమ్మల్ని మీరొకసారి సందేహించండి. ఎవర్నైనా ఒక ప్రశ్న వేసే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.