ఛకొన్ని సినిమాలు హిట్ అయినట్టుకొన్ని బండ్లు కూడా హిట్ అవుతుంటాయి.ఒకప్పుడు ఆర్‌ఎక్స్ బైక్ పెద్ద హిట్.ఆ పేరుతో వచ్చిన ‘ఆర్‌ఎక్స్100’ కూడా హిట్.హీరోగా కిక్ కొట్టిన కార్తికేయకు ఎన్ని సినిమాలువచ్చాయో బ్యాక్‌సీట్‌లో కూర్చున్నపాయల్‌కి కూడా అంతే డిమాండ్ వచ్చింది.ఆల్రెడీ ఐదు సినిమాలు చేస్తోంది.ఇంకో నాలుగైదు డిస్కషన్‌లో ఉన్నాయి.బ్యూటిఫుల్ మాత్రమే కాదు..బోల్డ్ పాత్రలు చేస్తున్న పాయల్ రాజ్‌పుత్‘సాక్షి’తో బోలెడు కబుర్లు చెప్పింది.
‘ఆర్‌ఎక్స్ 100’ సినిమాలో నటించాక బైక్ స్పీడ్ అంత వేగంగా కెరీర్ కొనసాగుతున్నట్లుంది?
పాయల్: అవును. ఫుల్ స్పీడ్. తెలుగులో ‘వెంకీ మామ, డిస్కో రాజా, ఆర్‌డిఎక్స్ లవ్’ సినిమాలు చేస్తున్నాను. తమిళంలో ‘ఏంజెల్’ అనే సినిమాలో నటిస్తున్నాను. తేజగారి ‘సీత’లో స్పెషల్ సాంగ్ చేశాను. చూసే ఉంటారు. ఇంకా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయబోతున్నాను. అందులో వేశ్య పాత్రలో కనిపిస్తాను. లైఫ్ చాలా బిజీ బిజీగా ఉంది. అయినా తప్పక బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది.
బ్రేకా.. ఎందుకు?
నెల రోజులుగా పాపికొండల్లో ‘ఆర్‌డిఎక్స్ లవ్’ సినిమా కోసం ఏకధాటిగా షూటింగ్ చేస్తున్నాం. అంతా సాఫీగా జరిగితే బ్రేక్ వచ్చేది కాదు. ఒక పాటకు డ్యాన్స్ చేస్తూ గాయపడ్డాను. ఆ పాట తీసే ముందు నాలుగు రోజులు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ వచ్చాం. అప్పుడు మోకాలి ఎముక డిస్‌లొకేట్ అయింది. దాంతో పది రోజులు కంప్లీట్ బెడ్ రెస్ట్‌లో ఉండాల్సి వచ్చింది.
పాపికొండల్లో ఎండలను ఎలా తట్టుకోగలిగారు?
అయ్య బాబోయ్.. చాలా ఎండలు. నాకు వైరల్ ఇన్‌ఫెక్షన్ కూడా వచ్చింది. ముఖ్యంగా నా టవల్‌ను ఉతక్కుండా నాలుగు రోజులు వాడాను. ఉతికి ఇవ్వమని చెబుదామంటే మరచిపోయేదాన్ని. హరీబరీగా షూటింగ్‌కి రెడీ కావడం, మళ్లీ టవల్‌తో ముఖం తుడుచుకున్నప్పుడు ఉతకలేదని గుర్తుకు రావడం.. దాంతో ఫేస్ మీద చిన్న చిన్న ర్యాషెస్ వచ్చాయి. మేకప్ వేసుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డాను.
సినిమా ఆర్టిస్ట్ జాబ్ అంత ఈజీ కాదనిపించిందా?
చాలా టఫ్. మన భుజం మీద చాలా బాధ్యత ఉంటుంది. ముఖ్యంగా ఒక్క సూపర్ హిట్ ఇచ్చిన తర్వాత ఆ హైప్‌ని మ్యాచ్ చేయాలంటే చాలా కష్టపడాలి. ఎండ, వాన, చలి.. ఇలా సీజన్స్‌ని పట్టించుకోకూడదు. మాకున్నదల్లా సినిమా సీజన్ ఒక్కటే. ఆల్ టైమ్ సీజన్ అన్నమాట. దానికోసం ఎంతైనా కష్టపడాలి. మరి పేరు, డబ్బూ ఊరికే రావు కదా.
హీరోయిన్ కావాలన్నది మీ చిన్నప్పటి కలా?
అవును. హీరోయిన్ కావాలని కలలు కన్నాను. ఆ కలను నిజం చేసుకోవడానికి చాలా కష్టపడ్డాను. నిజమైంది. నిలబెట్టుకోవడానికి ఇప్పుడు ఇంకా కష్టపడుతున్నాను. నా మాతృభాష పంజాబీలో సినిమాలు చేసుకుంటున్న నన్ను తెలుగు ఇండస్ట్రీ ఎంతో ప్రేమతో ఆహ్వానించింది. ‘ఆర్‌ఎక్స్ 100’లాంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చింది. ప్రేక్షకుల ప్రేమ వర్ణించలేనిది.
‘ఆర్‌ఎక్స్ 100’లో బోల్డ్ క్యారెక్టర్ చేశారు. అబ్బాయిని మోసం చేసే అమ్మాయి పాత్ర అది. అవకాశం పోగొట్టుకోకూడదని చేశారా? ఇష్టంగానే చేశారా?
నిజానికి నాకు గ్లామరస్ రోల్స్ ఎక్కువగా ఇష్టం ఉండదు. అయితే ప్రయోగాలు చేయడం చాలా ఇష్టం. వ్యక్తిగా నా పర్సనల్ చాయిస్ డిఫరెంట్‌గా ఉండొచ్చు. కానీ నటిగా ఏదైనా కొత్త పాత్రలు, స్క్రిప్ట్ వచ్చినప్పుడు చేయాలనుకుంటాం కదా. అందుకే ఆ పాత్ర చేయడానికి అంగీకరించాను. చాలా మంది హీరోయిన్లు ఆ పాత్ర విని చేయడానికి ఒప్పుకోలేదట. నాకు మాత్రం కథ వినగానే, ఇలాంటివి సొసైటీలోనూ జరుగుతున్నాయి కదా. అబ్బాయిల కంటే కొందరు అమ్మాయిలు చాలా స్మార్ట్‌గా ఉన్నారు. సినిమాలో చూపిస్తే తప్పేంటి? అని ఒప్పుకున్నాను.
ఆ సినిమాలో అన్నీ మోతాదుకి మించి ఉంటాయి. లిప్‌లాక్ సన్నివేశాలైనా, ఇతర రొమాంటిక్ సీన్స్ అయినా. మరి ఈ పాత్ర గురించి ఇంట్లో చెప్పారా?
మాది ట్రెడిషనల్ పంజాబీ ఫ్యామిలీ. అలాగని లేనిపోని హద్దులు పెట్టి, మా అమ్మానాన్న నన్ను పెంచలేదు. కూతురికి అండగా ఉండటానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు. ఇద్దరూ నా బ్యాక్‌బోన్. డైరెక్టర్ అజయ్ భూపతిగారు కథ చెప్పినప్పుడే ‘మీ పాత్ర చాలా బోల్డ్‌గా ఉంటుంది’ అన్నారు. ఇంట్లో చెప్పాను. ఫస్ట్‌లో కొంచెం ఆలోచించినా తర్వాత ఒప్పుకున్నారు. ‘యాక్టర్‌గా నువ్వు ఏది చేసినా అది నీ కెరీర్‌కు హెల్ప్ అవ్వాలి. ప్లస్ ఏది కరెక్టో ఏది రాంగో నువ్వే డిసైడ్ చేసుకో’ అన్నారు. ఈ సినిమా చేయడం నాకు కరెక్ట్ అనిపించింది. అయితే సినిమా చూసి నా పేరెంట్స్ షాక్ అయ్యారు.
రవితేజతో చేస్తున్న ‘డిస్కో రాజా’లో మీది చాలెంజింగ్ రోల్ కదా?
అవును. డెఫ్ అండ్ డమ్ (మూగ, చెవిటి అమ్మాయి) పాత్రలో కనిపిస్తాను. నటిగా నన్ను సవాల్ చేసే ఏ క్యారెక్టర్ అయినా చేస్తాను. దానికోసం ఎంతైనా కష్టపడతాను. ఇంకా ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ కాలేదు. వెంకటేశ్ గారితో చేస్తున్న ‘వెంకీ మామా’ షూటింగ్ చేస్తున్నాను. వచ్చే నెల ‘డిస్కో రాజా’ షూటింగ్‌లో అడుగుపెడతాను.
ఆ మధ్య ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ‘అడ్జెస్ట్ కావాలి’ అని అడిగారని క్యాస్టింగ్ కౌచ్ గురించి చెప్పారు. దాని గురించి?
నీకు ఇది కావాలంటే ఇలా కాంప్రమైజ్ కావాలి అని అడగటం నా దృష్టిలో బుల్‌షిట్. అలాంటి వాళ్లను అసలు కేర్ కూడా చేయను. సినిమాల్లోకి వచ్చిన కొత్తలోనూ అడుగుతారు. ఓ బ్లాక్‌బస్టర్ ఇచ్చిన తర్వాత కూడా అడుగుతూనే ఉంటారు. అంటే అడగడం కామన్ అన్నమాట. వాటిని అంగీకరించకూడదు. తిరస్కరించాలి. మన టాలెంట్ మీదే మనం ఆధారపడాలి.
తిరస్కరణ అనేది తెలివిగా జరగాలి. మరి ఆ టైమ్‌లో మీ తెలివితేటలను ఎలా ప్రదర్శించారు?
కరెక్టే. గొడవలకు దిగకూడదు. అలాగని అమాయకత్వాన్ని ప్రదర్శించకూడదు. సింపుల్‌గా ‘నో’ అనేయడమే. నో చెప్పేటప్పుడు మన గొంతులో సీరియస్‌నెస్‌ని ఎదుటివాళ్లు గ్రహించగలగాలి. అలా చెప్పాలి. అంతే. యాక్టింగ్‌లో నా బెస్ట్ ఇవ్వడానికి నేను ఎంత కష్టపడటానికైనా రెడీ. ఎంత కష్టపెట్టినా రెడీయే. అందుకే ఇలాంటి విషయాలకు తలొంచాల్సిన అవసరం లేదనుకున్నా. పోనీ అడిగారే అనుకుందాం.. ఎందుకు బయటకు చెబుతున్నావు అని కొందరు అన్నారు. చెబితే తప్పేంటి? అనేది నా ఫీలింగ్.
అడ్జస్ట్ కావాలని అడిగినది మీ పంజాబీ ఇండస్ట్రీలోనా? ఇక్కడా?
క్యాస్టింగ్ కౌచ్ ప్రతి చోటా ఉంటుంది. ప్రతి ఇండస్ట్రీలోనూ ఉంటుంది.
ఓకే.. పాయల్ టామ్ బోయా లేక నాటీ గాళా?
నేనంత నాటీ కాదు.. టామ్ బోయ్ టైప్ కూడా కాదు. అయితే చాలా హుషారైన అమ్మాయిని. నా లైఫ్ చాలా బ్యూటిఫుల్. నాన్న, అమ్మ, తమ్ముడు, నేను. చిన్నప్పుడు పెద్ద బ్రైట్ స్టూడెంట్‌ను కాదు. నా చదువు మీద ఎందుకింత ఖర్చు చేస్తున్నారు? ముంబై పంపితే హీరోయిన్ అయిపోతాను కదా? అనేదాన్ని. ఏదైనా డిగ్రీ పూర్తయిన తర్వాతే అన్నారు. అమ్మానాన్న మాటలను కాదనలేదు.
మీకు ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా ఉందా?
లేదు. కానీ నేను చాలా లక్కీగా ఫీల్ అవుతాను. దేవుణ్ణి ఏదైతే అడిగానో దాన్ని ఇచ్చాడు. దీన్ని ఇలా కొనసాగించాలంటే ఈ హార్డ్ వర్క్‌ను ఇలా కొనసాగించాలి.
నటిగా అవకాశాలు సంపాదించుకునే క్రమంలో పడిన కష్టాల గురించి?
నేను కాలేజ్‌లో ఉండే సమయంలో మా అమ్మ నాకు 5 వేలు పాకెట్ మనీ ఇచ్చేవారు. ఐదు వేలంటే తక్కువ కాదు. కానీ హీరోయిన్ కావడానికి ముంబై వెళ్లాలంటే కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. అందుకే ట్యూషన్స్ చెప్పడం స్టార్ట్ చేశాను. 1500 నుంచి 5 వేలు సంపాదించడం స్టార్ట్ చేశాను. సేవింగ్స్‌తో ముంబై వెళ్లాలన్నది ఆలోచన.
ముంబై వెళ్లే సమయానికి మీ అకౌంట్‌లో ఎంత డబ్బు ఉంది?
లక్ష రూపాయలు.
ఫైనల్లీ... ప్రస్తుతం సినిమాకు లక్షల్లో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఈ గ్రోత్‌ని ఎలా చూస్తున్నారు.
సంపాదన కోట్ల దాకా ఎదగడం ఆనందమే (పెద్దగా నవ్వుతూ). చాలా బావుంది. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కినట్టు అనిపిస్తోంది. గతంలో నేను కొన్ని సౌత్ సినిమాలకు ఆడిషన్ ఇచ్చాను. ‘బ్యూటిఫుల్... అవకాశం మీకే’ అనేవారు. కానీ ఇచ్చేవారు కాదు. చాలా సినిమాలు వచ్చినట్టే వచ్చి చేజారేవి. ఇది మన టైమ్ కాదనుకుంటా అనుకునేదాన్ని. అప్పట్లో నేను సీరియల్స్ చేసేదాన్ని. ఆ సీరియల్ షూటింగ్ బ్రేక్స్‌లో సినిమాలకు ట్రైల్ వేస్తుండేదాన్ని. ప్రతిదాంట్లో రిజెక్షన్. ఓపిక పట్టాను. కానీ ఇప్పుడు క్యాస్టింగ్ డైరెక్టర్స్ ముంబైలో నా ఫోటో చూపించి ‘ఇలాంటి హీరోయిన్ కావాలి’ అంటున్నారు. అది చాలా గర్వంగా అనిపిస్తుంది.
– డి.జి. భవాని
బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో చేస్తున్న సినిమాలో మీది వేశ్య పాత్ర అన్నారు. మళ్లీ బోల్డ్ రోలా?
అది బయోపిక్. నిజంగా చాలెంజింగ్ రోలే. సవాళ్లు నాకిష్టం (నవ్వుతూ).
రాణీ ముఖర్జీ, టబు, అనుష్క వంటి స్టార్స్ వేశ్య పాత్రలు చేశారు. వాటిని రిఫరెన్స్‌గా తీసుకుంటున్నారా?
అఫ్‌కోర్స్. వారి సినిమాలు చూస్తాను. అయితే నా స్టైల్‌లో చేస్తాను.
వేశ్యల మీద మీ ఒపీనియన్ ఏంటి?
ఈ సినిమా ఒప్పుకున్నాక వాళ్ల లైఫ్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాను. వారి జీవితం అంత ఈజీగా సాగదు. ఒకవేళ వాళ్లు బ్రెడ్ అండ్ బటర్ కోసమే ఆ పని చేస్తున్నారంటే దాన్ని ఆపేయమని చెప్పలేం. కేవలం డబ్బు కోసం, లగ్జరీల కోసం అలాంటి పనులు చేస్తున్నారంటే అది కరెక్ట్ కాదు. ఏది ఏమైనా ఎవరి జీవితం వారిష్టం కాబట్టి నువ్వు అది చేయకూడదు, ఇది చేయకూడదు అని కామెంట్ చేయలేం.
Comments
Please login to add a commentAdd a comment