నేను మీ చర్మం | I am your skin | Sakshi
Sakshi News home page

నేను మీ చర్మం

Published Wed, Apr 20 2016 10:40 PM | Last Updated on Wed, Apr 3 2019 5:32 PM

నేను మీ చర్మం - Sakshi

నేను మీ చర్మం

నేను ఆనంద్ దేహంలో అతి పెద్ద భాగాన్ని. అతడి బరువులో 16 శాతం బరువు నాదే. ‘ఆనంద్ బరువు 70 కిలోలు ఉంటే నేను సుమారుగా పదకొండు కిలోల బరువు తూగుతాను. నన్ను ఒలిచి నేల మీద పరిస్తే రెండు చదరపు మీటర్లు మేర ఉంటాను. పలుచగా ఉంటాను. కానీ దేహమంతా ఒకే మందంతో ఉండను. నుదురు చర్మం అత్యంత పలుచగా 0.5 మిల్లీమీటర్లు ఉంటే అరిపాదాలు, అరిచేతుల చర్మం అత్యంత మందంగా 4 మి.మీలు ఉంటుంది. నేను ఆనంద్ లావైనప్పుడు పెరిగిన కండలకు తగ్గట్లు, ఆనంద్ సన్నబడినప్పుడు కరిగిపోయిన కండలకు తగ్గట్లు సాగుతూ ముడుచుకుంటూ ఉంటాను. దాంతో బలహీనంగా ఉన్నట్లు కనిపిస్తాను. కానీ నాది అత్యంత పటిష్టమైన నిర్మాణం. కేంద్రనాడీవ్యవస్థ నాతోనే అనుసంధానమై ఉంటుంది. అయితే నాలో సాగేగుణం ఎంతగా ఉన్నా, దానికి కొంత పరిమితి ఉందని ఒప్పుకోవాలి. ఆనంద్ భార్య గర్భవతిగా ఉన్నప్పుడు కడుపులో బిడ్డ పెరిగే కొద్దీ నేను సాగుతూ ఆమెతో సహకరించాను. ఆ క్రమంలో నా సహజగుణాన్ని కోల్పోయానని ప్రసవం అయిన తర్వాతే తెలిసింది. ప్రసవం తర్వాత ఆమె దేహం మామూలైనా నేను మాత్రం సాగిన చోట గీతలను (స్ట్రెచ్‌మార్క్స్) గర్భం తాలూకు ఆనవాళ్లుగా మిగిల్చాను.

 
రక్షణ కవచాన్ని!

నేను ఆనంద్ దేహంలో నీటిని పట్టి ఉంచుతాను, ఆనంద్ గంటల కొద్దీ ఈతకొట్టినా అతడి దేహం నీటితో ఉబ్బిపోలేదంటే నేను కల్పించిన రక్షణ వలయంతోనే. అలాగే ఆనంద్ దేహం మీద ప్రాణాంతకమైన బ్యాక్టీరియాను దాడి చేయనివ్వను. అవేవీ నన్ను చొచ్చుకుని ఆనంద్ దేహంలోకి వెళ్లలేవు. కత్తిగాటుతో నేను చీరుకుపోయినప్పుడు ఆ గాయం నుంచి ఆనంద్ దేహంలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తుంటాయి రకరకాల రోగకారక క్రిములు.

 
మెలనిన్: నాలోని మెలనోసైట్స్ మెలనిన్‌ను ఉత్పత్తి చేస్తాయి. అది వెంట్రుకల నల్లదనానికి దోహదం చేస్తుంది. ఆనంద్ ఎండలోకి వెళ్లినప్పుడు నేను అప్రమత్తమవుతాను. మెలనోసైట్స్ చురుగ్గా పనిచేసి మెలనిన్‌ని ఉత్పత్తి చేసి నా పై పొర మీదకు పంపుతాయి. అలా ఆనంద్‌ను అధిక వేడి నుంచి, అతి నీల లోహిత కిరణాల నుంచి కాపాడుకుంటాను. ఆనంద్ మాత్రం ‘కాస్త ఎండ తగలగానే నల్లబడిపోయింది’ అని నన్నాడిపోసుకుంటుంటాడు. ఆనంద్ గోళ్లు, వెంట్రుకలు కూడా ప్రతిరూపాలే.

  

అనారోగ్యాల ఇండికేటర్‌ని
ఆనంద్ కాలేయం పనితీరులోపించి కామెర్లు వస్తే నేను పసుపుగా మారుతాను. అతడి దేహంలో అపసవ్యతకు పెనంలా వేడెక్కుతాను. జ్వరం తగ్గుముఖం పట్టడానికి స్వేదాన్ని విడుదల చేస్తాను. చర్మంలో ఎర్రరక్తకణాలు నిర్వీర్యమైతే పాలిపోతాను. నేను నేనుగా లేకపోతే ఆనంద్‌లో రక్తం రక్తనాళాల్లో ప్రవహించదు. అంటే నాకు గాయమై గీరుకుపోతే ఆనంద్ ఒంట్లోని రక్తం కారిపోతుంది. అందుకే సెల్ఫ్‌హీలింగ్ మెకానిజమ్‌తో గాయాన్ని మాన్పుకుంటాను. నేను లేచిపోయిన చోట కొత్త కణాలను ఎక్కువగా పుట్టించుకుని కొత్త పొరను తొడుక్కుంటాను.

  

నా ప్రధానమైన విధులు ఇవి
స్పర్శ జ్ఞానం తెలియచేయడం, రక్షణ కల్పించడం, దేహం ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడం, వ్యర్థాలను విసర్జించడం, సూర్యరశ్మిని గ్రహించి విటమిన్ డి తయారు చేయడం.

 
స్పర్శజ్ఞానం: నాలో అనేక సెన్సర్‌లుంటాయి. వాటిని రిసెప్టార్స్ అంటారు. ఒంటికి తగిలిన వస్తువు మెత్తగా ఉందా- గట్టిగా ఉందా, వేడిగా ఉందా - చల్లగా ఉందా, ఒత్తిడితో తగిలిందా- మెల్లగా తగిలిందా, ద్రవరూపంలోని వస్తువా- ఘనరూపంలోని వస్తువా అనే వివరాలను కేంద్ర నాడీ వ్యవస్థ ద్వారా మెదడుకు చేరవేస్తాను.

 
రక్షణ: ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తాను. ఆనంద్ దేహంలో వేడి ఎక్కువైతే రక్తనాళాలను విశాలం చేస్తాను, దాంతో వేడి నా నుంచే బయటకు పోయి దేహం చల్లబడుతుంది. వాతావరణం మరీ చల్లగా ఉండి ఆనంద్ దేహం చల్లబడిపోతుంటే రక్తనాళాలు కుదించుకుపోయి దేహంలోని ఉష్ణోగ్రతను రక్షిస్తాను. సహజసిద్ధమైన ఎయిర్‌కండిషనర్‌ని అన్నమాట.

 
విసర్జితాలు: ఆనంద్ హాయిగా కూర్చుని రోజు గడిపేసినా ఆనంద్ కోసం నేను 24 గంటలూ పని చేస్తూ రోజుకు అరలీటరు స్వేదాన్ని బయటకు పంపిస్తాను. అదే ఆనంద్ ఫుట్‌బాల్ వంటి ఆటల్లో ఉన్నప్పుడు ఆరు లీటర్ల స్వేదాన్ని చిందిస్తాను. రక్తం విసర్జించిన వ్యర్థాలను స్వేదం రూపంలో స్వేదగ్రంథుల ద్వారా బయటకు పంపేస్తూ ఆనంద్ దేహాన్ని శుభ్రం చేస్తాను. ఇంకా... సెబమ్ అనే చమురు వంటి పదార్థాన్ని విడుదల చేస్తాను. ఈ సెబమ్ నన్ను తేమగా, మృదువుగా ఉంచడంతోపాటు ఫంగస్, బ్యాక్టీరియా నుంచి నన్ను కాపాడుతుంది. అంటే నేను ఆనంద్ దేహాన్ని కాపాడుతూ నన్ను కాపాడుకుంటానన్నమాట.

డి విటమిన్: ఈ విటమిన్ దేహంలోపల తయారవుతుంది. కానీ నేను సూర్యరశ్మిని గ్రహించి దేహంలోకి పంపిస్తేనే అది సాధ్యమవుతుంది. అది ఆనంద్‌లోని సెక్స్ హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. అంటే నేను ఆనంద్ దేహానికి రక్షణ వలయంగానూ, ఆనంద్ తండ్రి కావడంలోనూ కీలకంగా పని చేస్తున్నానన్నమాట.


నా కష్టాలివి!
ఆనంద్ నా పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యం కొద్దీ నాలోని హెయిర్‌ఫాలికల్స్ దుమ్ము, కాలుష్యంతో మూసుకుపోతున్నాయి. మొటిమలు, బ్లాక్‌హెడ్స్‌తో ఆనంద్ ముఖం అందవిహీనం అవుతోంది ఎండకు వెళ్లేటప్పుడు టోపీ లేదా స్కార్ఫ్ వాడాలి. అవేవీ పట్టించుకోకుండా విపరీతమైన ఎండల్లో తిరగడం వల్ల నేను క్యాన్సర్‌కు గురవుతుంటాను. అయితే అదృష్టం ఏమిటంటే... నాకు వచ్చే క్యాన్సర్‌ను తగ్గించడం చాలా సులభం. అయితే ఈ వయసు వచ్చిన తర్వాత ఆనంద్ ఒంట్లో వచ్చే మార్పులను జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎక్కడైనా నేను సాగినట్లు, అనవసరంగా పెరిగినట్లు, గాయం రక్తం కారుతూ ఎంతకీ తగ్గకపోవడం వంటివి కనిపిస్తే వెంటనే డాక్టరును సంప్రదించాలి  సోరియాసిస్ నన్ను వేధించే విచిత్రమైన సమస్య. 27 రోజుల నా కణాల జీవితకాలం తగ్గిపోతుంది. ఎపిడెర్మిస్ మీద కణాలు నాలుగు రోజులకే రాలిపోతుంటాయి. కొత్తవి పుట్టి పై పొర మీదకు చేరేలోపు పైన ఉన్నవి రాలిపోతుంటాయి. నన్ను తాకడానికి కూడా భయపడతారు. కానీ ఇది అంటువ్యాధి కాదు. ఇదెందుకు వస్తుందో ఇంత వరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు  చికెన్‌పాక్స్ వైరస్ నాకు మరో పరీక్ష. ఒంటి మీద బొబ్బల నొప్పి వారానికి తగ్గుతుంది. కానీ ఒక్కోసారి బొబ్బలు అలాగే ఉండిపోతాయి. నాకు నేనుగా మాన్పుకోలేని మొండి మచ్చలుగా మారుతుంటాయి.

 

 

నేనో అద్భుతాన్ని!
ఒక చదరపు సెంటీమీటరు విస్తీర్ణం, 0.5 మిల్లీమీటరు మందంలో వంద స్వేదగ్రంథులు, నాలుగు మీటర్ల నాడులు, వందల నరాల చివర్లు, జుట్టు కుదుళ్లు పది, సెబాసియస్ గ్రంథులు 15, ఒక మీటరు పొడవైన రక్తనాళాలుంటాయి.    ఆనంద్‌లో భావోద్వేగాలకు అనుగుణంగా స్పందిస్తుంటాను. అతడికి కోపం వచ్చినప్పుడు ముఖం ఎర్రబడుతుంది. అందుకు నేను రక్తనాళాలను విస్తరించి ముఖంలోకి రక్తాన్ని ఎక్కువగా ప్రవహించేటట్లు చేయడమే కారణం. ఆనంద్‌కు భయం వేసినప్పుడు రక్తనాళాలు ముడుచుకుపోయి పాదాలు చల్లబడడంలోనూ నాదే పాత్ర.

 

నా నిర్మాణం ఇలా!
నేను మూడు పొరల సంక్లిష్టమైన నిర్మాణాన్ని. పైకి కనిపించేది ఎపిడెర్మిస్. దాని లోపల డెర్మిస్, అంతకంటే కిందగా హైపోడెర్మిస్ ఉంటాయి. మధ్య పొరకు రక్తనాళాలు, స్వేదగ్రంథులు, నూనెగ్రంథులు, జుట్టు కుదుళ్లు, స్పర్శను గ్రహించే రిసెప్టార్‌లు, సాగేగుణం ఉన్న ఫైబర్, లింఫ్ వెసెల్స్ అనుసంధానమై ఉంటాయి. హైపోడెర్మిస్ పొరను దేహభాగాలను కలుపుతూ అనేక టిస్యూలు ఉంటాయి. కొవ్వు అక్కడ కేంద్రీకృతమవుతుంది. ఈ కొవ్వు పొర షాక్ అబ్జార్బర్‌లా, మెత్తటి పరుపులాగ దెబ్బల నుంచి శరీరం లోపలి భాగాలకు రక్షణ కల్పిస్తుంది. ఆనంద్ కింద పడినా దెబ్బ తాకిడి తీవ్రత లోపలి భాగాలకు చేరకుండా అడ్డుకుంటాను. ఎపిడెర్మిస్ పలుచగా పారదర్శకంగా ఉంటుంది. ఆనంద్ షేవ్ చేసుకునేటప్పుడు తెగినా కూడా రక్తం కారదు. రక్తం కారిందంటే గాయం లోతుగా తెగిందన్నమాటే. అన్నట్లు... నాకు పాము గుణం కూడా ఉంది. పాము కుబుసం వదిలినట్లు నేను పాత కణాలను వదిలి కొత్త కణాలతో కొత్తగా కనిపిస్తుంటాను. కణం జీవిత కాలం 27 రోజులు. రోజూ లక్షల కొత్త కణాలు హైపోడెర్మిస్ దగ్గర పుట్టి డెర్మిస్, ఎపిడెర్మిస్‌ను చేరుతాయి. ఎపిడెర్మిస్ మీద ఉన్న ఆనంద్ స్నానం చేసేటప్పుడు ఒళ్లు తుడుచుకున్నప్పుడు మృతకణాలు రాలిపోతుంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement