బాడీ బరువు కరిగించండి
Published Mon, May 1 2017 12:25 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
- పోలీసులకు ఎస్పీ ఆకె రవికృష్ణ సూచన
- పోలీస్ స్టేషన్లలో వ్యాయామం తప్పనిసరి
- సుప్రీంకోర్టు గైడ్‌లెన్స్‌పై అవగాహన కల్పించాలి..
- ఓర్వకల్లు పోలీస్ స్టేషన్ తనిఖీ
ఓర్వకల్లు : శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు అత్యంత చురుగ్గా పని చేయాల్సి ఉంటుందని, అలాంటి వారికి బాడీ పెరిగితే ఇబ్బందిగా మారుతుందని ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని శారీరక బరువును తగ్గించుకోవాలని సూచించారు. ఓర్వకల్లు పోలీస్ స్టేషన్‌ను ఆదివారం ఆయన సందర్శించారు. పోలీసు స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం జాతీయ రహదారిపై ప్రమాదకర మలుపుల వద్ద ఏర్పాటు చేసిన వైట్ మార్కులను పరిశీలించారు. అనంతరం ఏడాది కాలంగా స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు, మృతుల వివరాలు తెలుసుకున్నారు. సిబ్బంది బాగోగులు, వారి సమస్యలపై విచారించారు. పెండింగ్ బిల్లులపై ఆరా తీశారు. ఆరోగ్య పరిరక్షణపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకోవాలన్నారు. తర్వాత సిబ్బందితో పాటు ఎస్పీ కూడా పోలీస్ స్టేషన్‌లో 30సార్లు డిప్స్ తీశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో మే నెల నుంచి తనిఖీలను ముమ్మరం చేస్తామన్నారు. పోలీసుల్లో చురుకుదనం పెంచేందుకు పోలీస్ స్టేషన్లలో వ్యాయామం తప్పనిసరి చేస్తామన్నారు. ఇందుకు సంబంధించి ఇటీవలే సుప్రీంకోర్టు విడుదల చేసిన గుడ్ సమార్తిన్ అంశాలపై పోలీసులకు అవగాహన కల్పించాలని ఎస్‌ఐలకు సూచించారు. ఆయన వెంట ఎస్‌ఐ చంద్రబాబు నాయుడు, పోలీసు సిబ్బంది ఉన్నారు.
Advertisement