స్నేహితుడు లేని ఊరు!
బౌద్ధ వాణి
ధనుంజయుడు ఒక పండ్ల వ్యాపారి. ఒకనాడు బండినిండా పండ్ల బుట్టలు ఎత్తుకుని అమ్మకానికి ఒక గ్రామం వెళ్లాడు. ఆ గ్రామంలో ఒక దారి పక్కన ఒక చెట్టు నీడలో నలుగురు యువకులు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వారు పండ్ల వ్యాపారిని చూశారు. ఎలాగైనా పండ్లు తిందామనుకున్నారు. కానీ తమలో ఏ ఒక్కరి దగ్గరా డబ్బు లేదు. అయినా వెళ్లి అడిగితే కాదనడులే అనుకున్నారు.
మొదట ఒకడు వెళ్లి ‘‘ఒరేయ్ ఆకలిగా ఉంది, ఒక పండు ఇవ్వరా’’ అన్నాడు. వ్యాపారి ఆలోచించి అతడికి ఒక కుళ్లిన పండు ఇచ్చాడు.
రెండోవాడు వెళ్లి ‘‘అన్నా! ఒక పండు ఇవ్వవా?’’ అని అడిగాడు. వాడికి వర్తకుడు ఒక మంచి పండు ఇచ్చాడు.
మూడోవాడు కూడా వెళ్లి ‘‘అయ్యా! ఒక పండు ఇవ్వండి’’ అన్నాడు. వ్యాపారి వాడికి నాలుగైదు పండ్లు ఇచ్చాడు.
చివరిగా నాలుగోవాడు వెళ్లి ‘‘మిత్రమా! నాకూ ఒక పండు ఇవ్వగలవా?’’ అని అడిగాడు. వ్యాపారి వెంటనే బండిని ఆపి, ఒక పండ్ల బుట్టను అతనికి అందించి, ‘‘మిత్రమా కావాలంటే ఇంకా తీసుకో’’ అన్నాడు.
‘‘మొదటి వాణ్ణి మూర్ఖునిగా, రెండోవాణ్ణి సోదరునిగా, మూడోవాణ్ణి బిడ్డగా, నాలుగో వాణ్ణి మిత్రునిగా భావించడం వల్లే అలా చేశాడు’’ అని బుద్ధుడు ఈ కథ చెప్పి, ‘‘స్నేహితుడు లేని ఊరు అడవితో సమానం’’ అన్నాడు.
- బొర్రా గోవర్థన్