మధ్యప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో మరో అభ్యర్థి పేరుతో, అతని స్థానంలో పరీక్ష రాసేందుకు వచ్చిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. రత్లాంలోని ఒక పరీక్షా కేంద్రంలో బయోమెట్రిక్ మెషీన్‌లో అభ్యర్థుల వేలి ముద్రల గుర్తింపులో సమస్య ఏర్పడటంతో వారికి కంటి రెటీనా పరీక్షలు చేస్తున్నారు. అయితే ఇంతలో ఒక నకిలీ అభ్యర్థి బిల్డింగ్‌లోని మెదటి అంతస్థు నుంచి దూకి పారిపోయాడు. అయితే పోలీసులు అతనిని వెంబడించి పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళితే రత్లాంకు సుమారు 28 కిలోమీటర్ల దూరంలోని సాత్‌రూంఢాలో గల మారుతి స్కూలులో పోలీస్ కానిస్టేబుళ్ల రాతపరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చే అభ్యర్థులు తమ హాల్‌టిక్కెట్, ఆధార్ కార్డును అధికారులకు చూపిస్తేనే వారిని పరీక్షా హాలులోకి అనుమతిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌కు చెందిన పుష్పేంద్ర యాదవ్(20) తన స్నేహితుడు, ఇటావానివాసి రాహుల్ యాదవ్ స్థానంలో పరీక్ష రాసేందుకు అతని హాల్ టిక్కెట్‌తో పరీక్షా కేంద్రానికి వచ్చాడు.
అయితే బయోమెట్రిక్ వెరిఫికేషన్ సమయంలో అధికారులకు అనుమానం రావడంతో అతనిని ప్రశ్నించారు. దీంతో పుష్ఫేంద్ర యాదవ్ స్కూలు మొదటి అంతస్తు నుంచి దూకి, స్కూలు వెనుక తలుపు నుంచి పొలాల్లోకి పారిపోయాడు. అయితే అతనిని పోలీసులు వెంబడించి గ్రామ శివార్లలో పట్టుకున్నారు. అధికారులు ప్రశ్నించినప్పుడు పుష్పేంద్ర యాదవ్.. రాహుల్ యాదవ్ తన స్నేహితుడని తెలిపాడు. డబ్బు కోసం ఆశపడి రాహుల్ స్థానంలో పరీక్ష రాసేందుకు వచ్చానని తెలిపాడు. దీంతో పోలీసులు రాహుల్ యాదవ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: వింత మొఘల్ పాలకుడు: ఒకసారి నగ్నంగా, మరోసారి స్త్రీల దుస్తులు ధరించి..
Comments
Please login to add a commentAdd a comment