ఉదయం వేళల్లో తలనొప్పి వస్తుందా..? | I get a headache in the morning hours ..? | Sakshi
Sakshi News home page

ఉదయం వేళల్లో తలనొప్పి వస్తుందా..?

Published Wed, Nov 4 2015 7:26 PM | Last Updated on Sun, Sep 3 2017 11:57 AM

I get a headache in the morning hours ..?

హోమియో కౌన్సెలింగ్
 

మా అమ్మగారి వయసు 65. ఆవిడకు తరచు తల తిరిగినట్టు ఉంటుంది. అలాగే చెవిలో హోరు, చెవి నొప్పితో రాత్రిళ్లు సరిగా నిద్రలేక బాధపడుతున్నారు. దయచేసి ఆమె సమస్యలకు సరైన హోమియో మందు సూచించగలరు.
 - సూర్య, హైదరాబాద్.

చెవిలో ముఖ్యంగా మూడుభాగాలుంటాయి. అవి 1. చెవి వెలుపలి పొర 2. మధ్య పొర 3. లోపలి పొర. ఈ మూడు పొరలకు ఇన్ఫెక్షన్స్ లేదా ఏమైనా వ్యాధులు వస్తుంటాయి. ఈ ఇన్ఫెక్షన్స్‌ఎక్కువగా వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల, దూది లేదా పిన్నులు చెవిలో పెట్టుకోవడం వల్ల వచ్చి తగ్గుతుంటాయి. ఒక్కోసారి ఇవి దీర్ఘకాలికంగా కూడా రావచ్చు. త్వరితంగా వచ్చేవాటిని ఎక్యూట్ సప్పురేటివ్ ఒటైటిస్ మీడియా, దీర్ఘకాలికంగా వచ్చే వాటిని క్రానిక్ సప్పురేటివ్ ఒటైటిస్ మీడియా అంటారు.
 
మధ్యపొరకు వచ్చే ఇన్ఫెక్షన్స్: ముక్కు లేదా గొంతులో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల, ఎలర్జీ వల్ల ఈ రకమైన ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి.
ముఖ్యలక్షణాలు: చెవినొప్పి, సరిగ్గా వినిపించకపోవడం, చెవి పట్టేసినట్లుగా అనిపించడం, జ్వరం, తల దిమ్ము, ఏ పనీ చేయాలనిపించకపోవడం.
 
తల తిరగడం: తల తిరగడాన్ని వెర్టిగో అంటారు. పడుకున్నప్పుడు లేదా పడుకుని అకస్మాత్తుగా లేచినా, పైకి చూసినా వెర్టిగో వస్తుంది. ఒక్కొక్కసారి చెవిలో ఒక భాగమైన వెస్టిబ్యూల్ నరాలు ప్రేరేపితం అవడం వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది.
 
మినియర్స్ వ్యాధి: ఇది ముఖ్యంగా చెవి లోపలి పొరకు వస్తుంది. దీనిలో తల తిరగడం, సరిగా వినిపించకపోవడం వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి.
 
ఎకోస్టిక్ న్యూరోమా: దీనిలో చెవి లోపల కణితి ఏర్పడి, వినికిడి లోపం, చెవిలో హోరు, నడిచేటప్పుడు సరిగా బ్యాలెన్స్ లేకపోవడం, ముఖం నిండా తిమ్మిరి రావడం లక్షణాలు కనిపిస్తాయి.
 
ల్యాబరెంత్రైటిస్, వెస్టిబ్యూల్ న్యూరైటిస్: చెవిలోపలి పొరకు వచ్చే వాపు వల్ల ఈ సమస్య వస్తుంది. దీనిలో తల తిరుగుడు, వికారం, వినికిడి లోపం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటితోబాటు ఓటోస్కిలోరిసిస్, టినిటస్ లాంటి సమస్యలు కూడా సాధారణమే.
చెవి, ముక్కు, గొంతు సమస్యలకు ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. ఈ సమస్యల వల్ల రోగనిరోధక వ్యవస్థ క్షీణించడం వల్ల, మానసిక ఒత్తిడి, ఆందోళనల వల్ల సమస్య తీవ్రత పెరుగుతుంది.
 
హోమియో చికిత్స: పాజిటివ్ హోమియోపతిలో వ్యాధి మూలకారణాలను విశ్లేషించి, రోగి శారీరక, మానసిక తత్వాలను బట్టి జెనిటిక్ కాన్‌స్టిట్యూషనల్ సిమిలిమమ్ అనే పద్ధతి ద్వారా చికిత్స ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల రోగనిరోధక వ్యవస్థ శక్తి పెరిగి, వ్యాధికి శాశ్వత నివారణ జరుగుతుంది.
 
న్యూరో సర్జికల్ కౌన్సెలింగ్

 
ఉదయం వేళలలో తలనొప్పి వస్తుందా..?
నా వయసు 35. నేను కాల్‌సెంటర్‌లో పని చేస్తున్నాను. ఎక్కువగా నైట్ డ్యూటీలు చేస్తుంటాను. నాకు ఇటీవల బాగా తలనొప్పి వస్తుంది. తల బాగా బరువెక్కినట్లు ఉంటుంది. ఒక్కోసారి తలనొప్పి ప్రారంభమై క్రమంగా పెరుగుతూ ఉంటుంది. సాధారణంగా తలనొప్పే కదా అంతగా పట్టించుకోలేదు. కానీ నెలరోజులుగా తలనొప్పి నన్ను బాధిస్తోంది. అప్పుడప్పుడు తగ్గి మళ్లీ వస్తోంది. తలనొప్పి కారణంగా ఏ పని చేయలేకపోతున్నాను. ఏకాగ్రతతో ఉద్యోగం చేయలేకపోతున్నాను. దయచేసి నా సమస్యకు పరిష్కారం తెలుపగలరు. మీరు చూపించే పరిష్కారంపైనే నా భవిష్యత్తు ఆధారపడి ఉంది.
- సంతోష్ కుమార్, హైదరాబాద్  

మీరు తెలిపిన లక్షణాలను బట్టి మీలో మెదడు సంబంధిత సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. మీకు ఉదయం లేవగానే తలనొప్పి ఎక్కువగా ఉండటంతో పాటు వాంతులు అవుతున్నాయా చూసుకోండి. ఒకవేళ ఉదయం తలనొప్పితో పాటు వాంతులు అవుతుండటం, వాంతి చేసుకోగానే తలనొప్పి నుంచి ఉపశమనం పొందడం వంటి లక్షణాలు కనిపిస్తే దానిని బ్రెయిన్ ట్యూమర్‌గా అనుమానించాలి. బ్రెయిన్ ట్యూమర్ ఉంటే వాంతి చేసుకున్న తర్వాత తలనొప్పి తగ్గి, సాధారణంగా అనిపిస్తుంది. దాంతోపాటు చూపులో కూడా తేడా వస్తుంది. మనకు కనిపించే వస్తువులు కూడా అస్పష్టంగా కనిపిస్తుంటాయి. ఈ లక్షణాలు ఉంటే మీరు వెంటనే వైద్యులను సంప్రదించి, వైద్యులు సూచించిన పరీక్షలు చేయించుకుని వ్యాధిని నిర్ధారించుకోండి. ఒకవేళ బ్రెయిన్ ట్యూమర్ ఉందని నిర్ధారణ అయినా మీరు ఆందోళన చెందకండి. ప్రస్తుతం బ్రెయిన్ ట్యూమర్‌కు అందుబాటులో అత్యాధునిక వైద్యప్రక్రియలో సమర్థవంతంగా చికిత్స అందించవచ్చు. వ్యాధి దశను బట్టి చికిత్స ఉంటుంది. మీ కుటుంబంలోగానీ, మీ వంశంలోగానీ ఎవరికైనా బ్రెయిన్ ట్యూమర్ సమస్య ఉంటే కనుక బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనిని ప్రాథమిక దశలో గుర్తించి సకాలంలో చికిత్స అందిస్తే మెరుగైన ఫలితాలు పొందవచ్చు.
 
పల్మనాలజీ కౌన్సెలింగ్
మా బ్రదర్‌ని మా ఊరు హాస్పిటల్‌లో చేర్చాము. ‘ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ వచ్చింది. వెంటిలేటర్ మీద పెట్టి ఐసీయూలో ఉంచాల’న్నారు. ఒక రోజు తర్వాత ‘సీరియస్‌గా ఉంది, హయ్యర్ సెంటర్‌కి తీసుకెళ్లమ’న్నారు. హాస్పిటల్ మార్చాం. రోజుకయ్యే ఖర్చు చాలా ఎక్కువగా ఉంది. కౌంటర్‌లో అడిగితే ఇది అన్ని సౌకర్యాలున్న హైఎండ్ ఐ.సి.యు. అన్నారు. మాకు ఏం జరుగుతుందో సరిగా అర్థం కావడం లేదు. మంచి ఐ.సి.యు. అంటే ఏమిటి? ఖర్చులో అంత తేడా ఎందుకుంది?
 - వి.ఆర్. వసంత్, కోదాడ

ఐ.సి.యు. రెండు రకాలు. ఓపెన్ అని, క్లోజ్డ్ అని. పాశ్చాత్య దేశాలలో సాధారణంగా క్లోజ్డ్ ఐ.సి.యు.లు ఉంటాయి. ఓపెన్ అంటే ఏ కన్సల్టెంట్ అయినా తన పేషెంట్‌ను ఐ.సి.యు.లో డెరైక్ట్‌గా చేరుకోవచ్చు. అవసరాన్ని బట్టి స్పెషలిస్ట్‌ని పిలిచి చూపిస్తారు. క్లోజ్డ్ అంటే, క్రిటికల్ కేర్‌తో క్వాలిఫికేషన్ ఉండి, పేషెంటు సీరియస్‌గా ఉన్నప్పుడు అవసరమైన ఏ స్పెషాలిటీకి సంబంధించిన నిర్ణయమైనా తీసుకొనగలిగి, మరియు ఏ స్పెషాలిటీకి సంబంధించిన అత్యవసరమైన ప్రొసీజర్స్ వెంటనే చేయగలిగిన సమర్థమైన డాక్టర్లు ఐ.సి.యు.లో 24 గంటలూ ఉంటారు. అందువల్ల పేషెంటు బ్రతికే ఛాన్సు క్లోజ్డ్ ఐ.సి.యు.లో ఎక్కువ. అంతేకాకుండా మంచి ఐ.సి.యు. అంటే లెవెల్-3 ఐ.సి.యు. అంటారు. ఇవి సాధారణంగా టెరిషియరీ కేర్ / రిఫరల్ సెంటర్స్‌లోనే ఉంటాయి, అంటే పేషెంటుకు కావలసిన యంత్రాలు, ఇతర పరికరాలు, మానిటర్లు ప్రతి పేషెంటుకి 24 గంటలు ఒక ట్రైన్డ్ నర్స్ ఉండాలి. సాధారణంగా సీరియస్‌గా ఉన్న పేషెంటుకి చాలా లైన్లు, ట్యూబులు, శరీరంలోకి, రక్తనాళాలలోకి, ఊపిరితిత్తులలోకి ఉంటాయి. అందువల్ల ఐ.సి.యు.లో అనుకోని ఘటనలు (యాక్సిడెంట్స్) జరగకుండా, పేషెంటుకి  ఇన్ఫెక్షన్స్ రాకుండా, వీటివల్ల ప్రాణహాని కలుగకుండా ప్రతి నిమిషం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మందులు, ఇన్‌ఫెక్షన్ రాకుండా తీసుకొనే జాగ్రత్తలు  అన్నిటి వల్ల ఖర్చు పెరుగుతుంది. ఇక మీ బ్రదర్ విషయానికొస్తే అతడికి ఎ.ఆర్.డి.ఎస్. అంటే
 (అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్  సిండ్రోమ్). ఇది లంగ్స్‌కు వచ్చే చాలా సీరియస్ జబ్బు. ఇలాంటి పేషెంట్లు ప్రపంచంలో 100లో 40 మంది దాకా చనిపోతుంటారు.  ముందుగా సరిపడా మందులు (యాంటీబయాటిక్స్) మొదలుపెట్టి, పేషెంట్‌కి కావలసిన ఇతర సపోర్ట్స్ అన్నీ సమకూర్చి; జబ్బు వచ్చినప్పుడు ఏ ఇతర అవయవ వ్యవస్థలు ప్రభావితం కాకుండా ఉండి, ఇతర సమస్యలు (అంటే బి.పి., షుగరు, కిడ్నీ, లివర్ జబ్బులు వంటివి) లేకుండా ఉంటే బ్రతికే చాన్సులు సాధారణంగా ఎక్కువగా ఉంటాయి. డాక్టర్లను అడగండి. వివరిస్తారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement