కిడ్నీలో రాళ్లు ఉంటే ఆ నొప్పి ఎందుకు వస్తోంది?
Published Fri, Aug 9 2013 12:08 AM | Last Updated on Fri, Sep 1 2017 9:44 PM
నా వయసు 26. కుడివైపు నడుము భాగంలో నొప్పిగా ఉంటే కిడ్నీలో రాళ్లు ఉన్నాయని చెప్పి ఈఎస్‌డబ్ల్యూల్ అనే ప్రక్రియ ద్వారా బ్లాస్టింగ్ చేశారు. వారం తర్వాత పొత్తికడుపులో, కుడివైపు వృషణంలో విపరీతమైన నొప్పి వచ్చింది. మళ్లీ స్కానింగ్ చేయించారు. రాళ్లు పూర్తిగా తొలగిపోలేదని, మళ్లీ చికిత్స చేయాలంటున్నారు. కిడ్నీలో రాళ్లు ఉంటే వృషణంలో నొప్పి ఎందుకు వస్తోంది. దయచేసి నా సందేహాన్ని నివృత్తి చేయండి.
- ఎస్.కె.ఆర్., పాలకొండ
కిడ్నీలో రాళ్లను తొలగించడానికి ఈఎస్‌డబ్ల్యూఎల్ ప్రక్రియద్వారా బ్లాస్టింగ్ చేసినప్పుడు ఆ రాళ్లు ముక్కలైపోయి యురేటర్‌లో ఇరుక్కున్నప్పుడు ఇలా నొప్పి వస్తుంది. ఈ యురేటర్‌కీ, వృషణానికీ ఒకే నరం వెళ్తుంది. అందువల్ల ఇక్కడ నొప్పి వచ్చినప్పుడు అక్కడ కూడా నొప్పి వచ్చినట్లుగా అనిపిస్తుంది. దీన్ని రిఫర్‌డ్ పెయిన్ అంటారు. అంతేగాని మీ సమస్య వృషణానికి సంబంధించిన సమస్య కానేకాదు. ఇప్పుడు వైద్యరంగంలోని సాంకేతిక పురోగతితో ఇలా మిగిలిపోయిన రాళ్లను లేజర్ ప్రక్రియతో పూర్తిగా పౌడర్‌లా చేసి తీసేయవచ్చు. దీన్ని ఆర్‌ఐఆర్‌ఎస్ (రెట్రోగ్రేడ్ ఇంట్రా రీనల్ సర్జరీ) ప్రక్రియ ద్వారా తీసేయవచ్చు. ఈ ప్రక్రియలో గాటు లేకుండా కుట్టు లేకుండా ముక్కలైన మిగతా రాళ్లను 15 నిమిషాల్లో తొలగించవచ్చు. అదేరోజు ఇంటి కి కూడా వెళ్లవచ్చు. ఒకసారి మీరు మీ యూరాలజిస్ట్‌ను సంప్రదించండి.
డాక్టర్ వి.చంద్రమోహన్, యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్,
ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్‌బి, హైదరాబాద్
Advertisement