మరీ బొద్దుగా ఉంటే...
పేరెంటింగ్
పిల్లలు బొద్దుగా, ముద్దుగా ఉంటే బాగుంటారు. అదే... బొద్దు ఎక్కువై, మరీ లావుగా కనిపిస్తే? అప్పటి దాకా ముద్దు అనుకున్నది కాస్తా, ముప్పుగా మారుతుంది. ఆరేళ్ళ వయసు పిల్లలకే ‘టైప్ 2’ డయాబెటిస్ వచ్చిందనీ, నిండా పన్నెండేళ్ళు కూడా లేని అమ్మాయికి... లావు తగ్గడం కోసం ‘బేరియాట్రిక్ సర్జరీ’ చేయించారని ఇటీవల షాకింగ్ వార్తలు వస్తున్నాయి. నిజం చెప్పాలంటే, మన దేశంలో ఇప్పుడు స్థూలకాయం ఓ పెద్ద సమస్యగా మారుతోంది. రెండు నుంచి 17 ఏళ్ళ లోపు పిల్లల్లో దాదాపు నూటికి 18 మందికి పైగా స్థూలకాయంతో బాధపడుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.
అయితే, చాలామంది తల్లితండ్రులు తమ పిల్లలు స్థూలకాయులన్న విషయం గుర్తించరు. ఇలాంటి పిల్లల్లో చిన్న వయసులోనే అధిక రక్తపోటు, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు, కాళ్ళ నొప్పులు, అలసట లాంటి లక్షణాలు కనిపిస్తాయి. చివరకు ఇవన్నీ గుండె సంబంధమైన ఇబ్బందులకు దారి తీయవచ్చు. పట్టణ ప్రాంతాల్లో ఇటీవల పిల్లల్లో స్థూలకాయం ఎక్కువగా కనిపిస్తోంది. సందు సందుకీ ఏదో ఒక జంక్ ఫుడ్ స్టాల్ రావడం, వాటి తిండికి పిల్లలు అలవాటుపడడం, పిల్లల ఆహారపుటలవాట్లను పట్టించుకొనే తీరిక, ఓపిక తల్లితండ్రులకు లేకపోవడం - లాంటివన్నీ ఈ సమస్యకు కారణాలే.
శారీరక ఆరోగ్యాన్నే కాక, స్నేహితుల మధ్య ఎగతాళికి గురవడం ద్వారా పిల్లల మానసిక స్థైర్యాన్ని కూడా స్థూలకాయం దెబ్బతీస్తుంది. అందుకే, పిల్లలు కాస్త స్థూలకాయంతో కనిపిస్తున్నారంటే, పెద్దలు వెంటనే అప్రమత్తం కావాలి. అలాంటి సందర్భంలో పెద్దలు చేయాల్సిందేమిటంటే...
ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దు. పిల్లలు ముద్దుగా, బొద్దుగా ఉన్నారని సరిపెట్టుకుంటూ, వాస్తవాన్ని విస్మరించకూడదు. ఉండాల్సిన దాని కన్నా పిల్లలు లావుగా కనిపిస్తే, తల్లితండ్రులు తక్షణమే దాని మీద దృష్టి పెట్టాలి.స్థూలకాయాన్ని ఒక సమస్యగా గుర్తించిన తరువాత, పిల్లలు వెంటనే లావు తగ్గిపోవా లని కంగారు పడితే కుదరదు. సహనంతో విషయాన్ని డీల్ చేయాలి. ముందుగా పిల్లలకు సమస్య పట్ల అవగాహన కల్పించాలి. ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్ల గురించి పిల్లలకు నచ్చజెప్పాలి. ఆహార విహారాల విషయంలో పిల్లలకు పెద్దలే ఆదర్శంగా నిలవాలి. జంక్ ఫుడ్‌కు తాము దూరంగా ఉంటూ, పిల్లలు కూడా దూరంగా ఉండేలా వాళ్ళకు నష్టాలను వివరించాలి.
ఒకసారి అలవాటైపోయిన ఆహారాన్ని మార్చడం అంత సులభం కాదు. ముఖ్యంగా, పిల్లలకు ఒకటి అలవాటైతే, దాన్ని మాన్పించడం అప్పటికప్పుడు కష్టం. కాబట్టి, రాత్రికి రాత్రికి జంక్‌ఫుడ్ మానుకొమ్మని బలవంత పెడితే, మొదటికే మోసం రావచ్చు. అందుకని, పిల్లలకు నిదానంగా నచ్చజెప్పాలే తప్ప, వారిని తిట్టడం, కొట్టడం లాంటివి చేయకండి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని రోజు వారీ తిండిలో భాగం చేయాలి.
శారీరక శ్రమ చేయడం ముఖ్యం. పిల్లలు శారీరకంగా ఎంత చురుకుగా ఉండి, ఎంతగా ఆటపాటల్లో పాల్గొంటే అంత మంచిది. ఈత కొట్టడం, సైకిల్ తొక్కడం, జాగింగ్, టెన్నిస్ - బ్యాడ్మింటన్ లాంటివి ఆడడం - ఇలా శారీరక శ్రమ ఉండే ఆటల్లో పిల్లల్ని ప్రోత్సహించాలి. దాని వల్ల స్థూలకాయం సమస్యను బలంగా ఎదుర్కోవచ్చు.
రోజూ కనీసం అరగంట పైన శారీరక శ్రమ చేస్తే, పిల్లలు ఇట్టే లావు తగ్గిపోతారు. పిల్లలకు ఆదర్శంగా ఉండాలంటే, తల్లితండ్రులు కూడా ఉదయాన్నే లేచి, కుటుంబమంతా కలసి వ్యాయామం చేయడం మంచిది.రోజు వారీ భోజనంలో భాగంగా ఆరోగ్యకరమైన ఆహారాన్నే అందించాలి. జంక్ ఫుడ్‌కు బదులు ప్రత్యామ్నాయాలను చూపాలి. పిల్లలకు కొవ్వు తక్కువగా ఉండే పాలు, గింజ ధాన్యాలు, పండ్లు, తాజా కాయగూరలు పెట్టాలి. వీటి వల్ల పిల్లలకు తగినన్ని పోషకపదార్థాలు అందుబాటులోకి వస్తాయి.
చిన్న పిల్లల డాక్టర్ ద్వారా ఎప్పటికప్పుడు పిల్లల ‘బాడీ - మాస్ ఇండెక్స్’ను లెక్కించాలి. బాడీ ఫ్యాట్‌కు ప్రమాణమైన ఈ లెక్కను బట్టి, ఎప్పటికప్పుడు ఏ మేరకు స్థూలకాయం తగ్గిందీ తెలుసుకోవచ్చు.రోజువారీ ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లు, వ్యాయామం కలగలిస్తే - పిల్లల్లో స్థూలకాయం తగ్గుతుంది. దీని వల్ల పిల్లల్లో మానసిక స్థైర్యం పెరుగుతుంది. ఆ దోవలో పిల్లల్ని ప్రోత్సహించి, వాళ్ళకు ఆద్యంతం అండగా నిలవాల్సింది తల్లితండ్రులే! - మహతి