ఆ టైమ్లో ఉద్వేగాలు యమడేంజర్!
మీరు డ్రైవ్ చేస్తున్న సమయంలో చాలా ప్రశాంతంగా ఉండండి. వాహనం నడుపుతున్న సమయంలో మీలో భావోద్వేగాలు చెలరేగితే వాటి ప్రభావం మీ డ్రైవింగ్‌పై తప్పకుండా ఉంటుంది. దాని దుష్ర్పభావాలు ఏదైనా పెద్ద ప్రమాదంగానూ పరిణమించవచ్చు. మనం ఉద్వేగాలతో బండి నడుపుతుంటే ప్రమాదాలు జరిగే రిస్క్ పది రెట్లు ఎక్కువగా ఉంటుందంటున్నారు అధ్యయనవేత్తలు. యూఎస్‌లో నిర్వహించిన ఒక అధ్యయనంలో దాదాపు 3,500 కంటే ఎక్కువ కార్లలో కెమెరాలను అమర్చారు. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో వాళ్ల భావోద్వేగాలను పసిగట్టగల సెన్సర్లు అమర్చారు. ఏదో కారణాల వల్ల భావోద్వేగాల స్థాయి ఎక్కువగా ఉన్నవారిని ఈ సెన్సర్లు పసిగట్టాయి. అలాంటి వారిలో 1600 మంది డ్రైవింగ్ సమయంలో ఏదో ఒక తప్పు చేశారు.
అది టైరు డివైడర్‌కు రాసుకుపోవడం వంటి చిన్న పొరబాట్ల నుంచి కారు దేనికైనా ఢీకొన్న పెద్ద సంఘటనల వరకు ఉన్నాయి. ఇలాంటి పెద్ద సంఘటనలు 900కు పైగా నమోదయ్యాయి. ఈ అధ్యయన వివరాలన్నీ ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ద నేషనల్ అకాడమీ ఆఫ్ సెన్సైస్’లో ప్రచురితమయ్యాయి. ఇక ప్రమాదాలన్నింటికీ మరింత పెద్ద కారణం ‘ఆల్కహాల్’! మద్యం తాగి వాహనం నడిపినప్పుడు యాక్సిడెంట్ చేసే రిస్క్... మామూలు సమయం కంటే 36 రెట్లు ఎక్కువ. అందుకే డ్రైవింగ్ సమయంలో మద్యం జోలికి అస్సలు వెళ్లవద్దు. ఇక భావోద్వేగాలకు గురి కాకుండా కూల్‌గా బండి నడపడం చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి.