మనసులో మంచి ఆలోచనలే ఉంటే...
మంచి పనులే చేస్తాం!
మనం చేసే కర్మ చెడుదా లేదా మంచిదా అన్నది నిశ్చయించేది అది చేయడానికి వెన క గల భావనే అని మన సనాతన ధర్మం స్పష్టం చేస్తోంది. చూడడానికి బయటికి చెడుకర్మగా కనిపించినా, ఒక్కోసారి అది భావనని బట్టి సుకర్మ కావచ్చు. మనిషికి కర్మ చేయడానికి వెనక గల భావనని బట్టే అతనికి ఆ కర్మ తాలూకు ఫలితం లభిస్తుంది. మన భావనలన్నింటిని గ్రహించే దేవుడికి అందుకే భావగ్రాహి అనే పేరు రుషులు పెట్టారు. ఇందుకే సద్భావాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తారు. కర్మకీలకం తెలిసిన రుషులు మా కళ్లు ఎప్పుడూ మంచినే చూచుగాక, మా చెవులు ఎప్పుడూ మంచినే వినుగాక, మా నాలుక ఎప్పుడూ మంచినే రుచి చూడుగాక అని ప్రార్థిస్తారు.
మన మనసుని సద్భావాలతో నింపుకుంటే– సత్కర్మలని, దుష్టభావాలతో నింపుకుంటే దుష్కర్మలని చేస్తాం. ఆశాపరుడు అత్యంత దుష్టుడు. ఎందుకంటే ఆశపడేవాడి మనసు నిండా చెడుభావాలే ఉంటాయి. వారు చేసిన దుష్కర్మలే సరైన సమయంలో వారికి తగిన ఫలితాలనిస్తాయి. ఒకవేళ పూర్వజన్మలో వారు చేసిన సుకర్మలు ఈ జన్మలో అనుభవించాల్సిన అవసరం ఉంటే, అప్పుడు ఈ దుష్కర్మల ఫలితానుభవానికి పాత శుభకర్మల ఫలితానుభవం అడ్డుపడడంతో, అవి పై జన్మలకి వాయిదాపడి వచ్చే జన్మల్లో వారు దుర్భర కష్టాలు పడవచ్చు. అందుకే ముందు మన మనసులోని చెడును, చెత్తను తొలగించేసుకుందాం.. అప్పుడు మనకు మంచి ఆలోచనలే తడతాయి. మంచి పనులే చేస్తాం. ఆటోమేటిగ్గా మంచే జరుగుతుంది.