సాక్షి, నిజామాబాద్ : సకల సౌభాగ్యాలు ప్రసాదించే కార్తీకమాసం మోక్షమాసంగా పేరు పొందింది. ఈ మాసంలో చేసే పూజలు కైలాస, వైకుంఠ ప్రాప్తిని కలిగిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో మాత్రమే పూజించే ఉసిరికాయను విష్ణు స్వరూపంగా భావించి పూజలు చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఔషధ గుణాలు పుష్కలంగా ఉండే ఉసిరిని ఈ మాసంలో తిన్నా, దీపాలతో ఆరాధించినా ఆరోగ్యభాగ్యం కలుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కార్తీక మాసం ఆరంభం నుంచే జిల్లా కేంద్రంలో ఉసిరికాయ అమ్మకాలు జోరందుకున్నాయి.
శివాలయాల్లో..
ఉమ్మడి జిల్లాలోని ప్రసిద్ధ వైష్ణవ, శివాలయాల్లో కార్తీకమాసాన్ని పురస్కరించుకొని ఉదయం, సాయంత్రం భక్తులు ఉసిరి దీపారాధనలు చేస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లోని శివాలయాలతో పాటు భిక్కనూరు, బీబీపేట, దోమకొండ, తాడ్వాయి, లింగంపేట, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బోధన్, ఆర్మూర్, పోచంపాడ్ తదితర ప్రాంతాల్లోని శివాలయాల్లో భక్తులు కార్తీక పూజలు చేస్తున్నారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు.
ఔషధ గుణాలు ఇవే..
ఉసిరిని ఎక్కువగా ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తారని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఇందులో క్యాల్షియం, ఐరన్, ప్రొటీన్లు, పాస్పర్స్, కార్బొహైడ్రేడ్, విటమిన్‌లు పుష్కలంగా ఉంటాయని వారు చెబుతున్నారు. జ్ఞాపకశక్తిని, తెలివితేటలు పెంచేందుకు ఉసిరి దివ్య ఔషధంగా పనిచేసుందని తెలుస్తోంది. ఉసిరిని పొడిగా లేదా ముక్కలుగా ఏదో ఒక రూపంలో ప్రతిరోజు కొద్ది మోతాదులో తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
మరెన్నో ఉపయోగాలు
ఉసిరితో మరెన్నో ఉపయోగాలు ఉన్నాయి. శరీరంలోని వేడిని, జలుబు, కోరింత దగ్గును తగ్గిస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. కడుపు, పేగులో మంటను అరికడుతుంది. అధిక దాహాన్ని అదుపులో ఉంచుతుంది. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. ఉసిరి కలిపిన నూనెను వాడితే జుట్టు నిగనిగలాడటంతో పాటు జుట్టు రాలటం ఆగుతుంది. దీంతో తయారు చేసిన టానిక్ వాడితే ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది.
చర్మ రక్షణకు ఉసిరి
చలికాలంలో వచ్చే చర్మవ్యాధులకు ఉసిరి దివ్యౌషధంగా పనిచేస్తుంది. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి, చిన్నపిల్లల్లో ఎముకల సంరక్షణకు, మహిళల్లో రుతుక్రమం సక్రమంగా రావడానికి ఉసిరి సేవనం బాగా ఉపయోగపడుతుంది. అందుకే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనం చేయాలని పెద్దలు చెబుతారు.
– యోగా రాంచంద్రం, గాజుల్‌పేట
జ్ఞానానికి ప్రతీక ఉసిరి దీపం
చీకటి అజ్ఞానానికి, వెలుగు జ్ఞానానికి ప్రతిబింబం. పవిత్రమైన కార్తీకమాసం శివకేశవుల ఆరాధన విశేష పుణ్యాన్నిస్తుంది. తులసి, ఉసిరికోట ముందు దీపం వెలిగిస్తే సకల దోషాలు తొలుగుతాయని కార్తీక పురాణం చెబుతుంది. ఈ మాసంలో ఉసిరికను పూజించటం వలన ఈ కాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు దరిచేరవని శాస్త్రాలు చెబుతున్నాయి.
– తోక చంద్రమౌళి, వినాయక్‌నగర్
Comments
Please login to add a commentAdd a comment