తన కోపమే తన శత్రువు | In his anger and his enemy | Sakshi
Sakshi News home page

తన కోపమే తన శత్రువు

Published Wed, Jul 1 2015 10:35 PM | Last Updated on Sun, Sep 3 2017 4:41 AM

తన కోపమే తన శత్రువు

తన కోపమే తన శత్రువు

కోపం నిప్పులాంటిది..
దానిని జీర్ణించుకుని వాడుకుంటే... దీపాలను వెలిగించవచ్చు. రాకెట్‌లను ఎగరేయవచ్చు. ఆకలిని చల్లార్చవచ్చు. కోపాన్ని కంట్రోల్‌లో ఉంచుకోలేకపోతే... కొంపలు కాల్చుకోవచ్చు. బంధాలను బూడిదలో పోసుకోవచ్చు. జీవితాలని బుగ్గిపాలు చేసుకోవచ్చు.
 
ఈ బర్నింగ్ ప్రాబ్లమ్‌ని ఎలా డీల్ చేయాలి?
రేణుక, రాజ్యలక్ష్మి తోడికోడళ్లు. హైదరాబాద్, చందానగర్‌లో ఇళ్లు పక్కపక్కనే. వీళ్ల  మధ్య ఒక రోజు చిన్న విషయమై వివాదం చెలరేగింది. ఆ కోపంతో రాజ్యలక్ష్మి రేణుక కూతురు ఏడాదిన్నర వయసుండే జ్యొత్స్నను ఒక్కసారిగా తీసుకెళ్లి నీటి డ్రమ్ములో పడేసింది. ఆ చిన్నారి ఊపిరాడక చనిపోయింది.
      
ఉప్పల్  సమీపంలోని రామంతాపూర్‌లో అత్త వీరమణి వేణ్నీళ్లు పెట్టమందని గొడవపెట్టుకున్న కోడలు భార్గవి కోపంతో బాత్‌రూమ్‌లో కుర్చీలో కూర్చున్న అత్త తలను నల్లాకేసి కొట్టింది. అత్త అక్కడికక్కడే చనిపోయింది.
     
అంబర్‌పేటలో నివాసముండే లండన్ రిటర్న్‌డ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సూర్యప్రకాష్... కొన్ని నెలలుగా ఉద్యోగం లేక ఖాళీగా ఉంటున్నాడు. ఈ విషయంలో అత్త, భార్య కలిసి అతణ్ణి హేళనగా మాట్లాడారు. అంతే కోపం తెచ్చుకున్న అతను విసురుగా గదిలోకి వెళ్లి, ఉరేసుకుని చనిపోయాడు.
     
పంజాగుట్ట చౌరాస్తాలో కారు అడ్డం తీయమంటూ హారన్ మోగించాడనే కోపంతో మోటార్‌సైక్లిస్ట్‌ను ఎడా పెడా కొట్టేసిందో కార్పొరేట్ ఉద్యోగిని. ఇప్పటికీ ఆ కేసు విషయమై పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరుగుతోంది.
 ఇవేనా! కాలాలకతీతంగా, సంస్కృతులకు అతీతంగా ప్రపంచ వ్యాప్తంగా అకారణంగా, అసహనంతో, అనవసర కోపాలు పెరిగిపోతున్నాయి.
 
 వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన మహిళల్ని తూలనాడి చిక్కుల్లో పడిన మంత్రి... ఆటోగ్రాఫ్ అడిగిన అభిమాని చెంప పగలగొట్టిన హీరో... రిమోట్ కంట్రోల్ ఇవ్వలేదని అక్కని చంపిన తమ్ముడు... రూ.10 అప్పు తీర్చలేదని రోకలి బండతో మోది హత్య... పండగకి భర్త చీర కొనలేదని నిప్పంటించుకున్న భార్య... ఒకటేమిటి... ఇంతకన్నా సిల్లీ రీజన్స్ కూడా కోపానికి కజిన్స్ అవుతున్నాయి!పెద్ద పెద్దవాళ్లను సైతం చిక్కుల్లో పడేసి, చిన్నవయసు వాళ్లను సైతం చిదిమేసే గుణం కోపం. కచ్చితంగా ఎందుకొస్తుందో  చెప్పలేం. సరిగ్గా ఎలా వస్తుందో చెప్పలేం. అది వచ్చాక ఏం చేస్తామో చెప్పలేం... అది వచ్చి పోయిన తర్వాత అదెంత కీడు మిగిల్చి పోయిదో మాత్రం చెప్పగలం. అలాంటి అనూహ్యమైన శతృవుని, అనుక్షణం అంటిపెట్టుకుని ఉండే ‘స్నేహాన్ని’... ఎలా మ్యానేజ్ చేయాలి?

 ముహూర్తం చూడకుండా ముంచుకొచ్చేయవచ్చు. ముక్కు మీదే కాపురం పెట్టవచ్చు. అదే కోపం అంటే. అపరకుబేరుడికీ, అన్నం దొరకని పేదకీ చుట్టమది. అందరం ఎపుడో ఒకపుడు చవిచూస్తాం. కొందరం మాత్రం దాన్ని అణుచుకోలేక అనూహ్యమైన ఆపదల్లో ఇరుక్కుంటాం. విధినిర్వహణలో కావచ్చు, వ్యక్తిగత సంబంధాల్లో కావచ్చు కంట్రోల్ తప్పితే కాటేసే గుణం కోపానికుంది. దీన్నెలా నియంత్రించాలి?

కారణం...సర్వసాధారణం
కోపం సర్వసాధారణం. ఆరోగ్యకరమైన, మానవ సహజ భావోద్వేగం. శారీరక, మానసిక మార్పులతో కలిసి వస్తుంది. రక్తపోటుని పెంచి, అంతర్గతంగానూ, బాహ్యంగానూ ఒత్తిడిని పెంచుతుంది. నిర్ధుష్టంగా ఓ  వ్యక్తి మీద రావచ్చు, లేదా ఓ పరిస్ధితి వల్ల రావచ్చు. చివరికి  మనల్ని వదలక వెంటాడే కొన్ని జ్ఞాపకాలు  కూడా కోపానికి కారణం కావచ్చు.
 
మీరనంత వరకు మేలే

కోపం అనేది ఓ సహజమైన ప్రతిస్పందన  అది మితిమీరినట్లయితేనే శరీరానికీ, మనసుకు హాని చేస్తుంది. అలాగని కోపాన్ని అణచుకున్నా ప్రమాదమేనని,  హైపర్‌టెన్షన్, హైబ్లడ్‌ప్రెషర్, డిప్రెషన్ వంటివి  తలెత్తే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
 
అంతకోపం ఎందుకు?
 మిగిలినవారితో పోలిస్తే కొంతమందికి అసాధారణ కోపం ఉంటుంది. చాలా సులభంగా ఆగ్రహానికి గురవుతుంటారు. ఈ తరహా తత్వానికి జెనెటిక్, సైకలాజికల్ అంశాలే కారణం. ఈ లక్షణాలను చిన్న వయసునుంచే గుర్తించవచ్చు. కోపిష్టులు అన్ని విషయాలూ తమ కనుకూలంగా జరగాలని కోరుకుంటారు. కోరడం కన్నా డిమాండ్ చేయడం పట్ల మాత్రమే వారికి ఆసక్తి ఎక్కువ.అందరూ కోరుకునేవే వీరూ ఆశిస్తారు. అయితే అవి అందనపుడు ఈ దుర్వాసుల ప్రవర్తన పూర్తి భిన్నంగా మారిపోతుంది.
 
తలెత్తే సమస్యల్ని గుర్తించాలి
 ఆలోచనా విధానంలో సమూలమైన మార్పుని తెచ్చే శక్తి కోపానికుంది. చాలా సమయాల్లో కోపం మన లోపలి మనిషిని  వెల్లడి చేస్తుంది. కోపంలో ఆలోచనాధోరణి అన్ని పరిమితులు దాటేసి నాటకీయంగా మారిపోతుంది. దీని వల్ల తలెత్తే సమస్యల్ని ముందుగా గుర్తిస్తే  పరిష్కరించుకోవడం సులభమవుతుంది.

వ్యక్త పరచడంలో వ్యత్యాసం
ప్రదర్శించడం, అణుచుకోవడం, నిశ్శబ్దమైపోవడం ఇవన్నీ కోప వ్యక్తీక రణలే. ఉద్రేకంగా కాకుండా  దృఢంగా కోపాన్ని వ్యక్తపరచడం ఆరోగ్యకరమైన పద్ధతి. ఇతరులను బాధించకుండా  ఈ మానవసహజమైన భావోద్వేగాన్ని చూపాలి. ఇలా ఉండడమంటే మనల్ని మనం తగ్గించుకోవడం కాదు. ఎదుటివార్ని గౌరవిస్తూ మన గౌరవాన్ని నిలబె ట్టుకోవడం.

 కోపం వల్ల  కలిగే అలోచనను పుట్టకుండానే చంపేయనక్కర్లేదు. అలా చేయకూడదు కూడా. దాని ప్రభావం వల్ల కలిగే ఉద్రేకపూరితమైన ఆలోచనని కలగనిచ్చి దానితో పాటు స్వీయ వివేకంతో వెంటనే మరో మంచి ఆలోచనకి చోటివ్వడం అవసరం. అలాగే లాజిక్‌గా ఆలోచించే అలవాటు కోపాన్ని ఓడిస్తుంది. విభిన్నరకాలుగా ఆలోచించడం ద్వారా ఆగ్రహం కారణంగా ఉత్పన్నమైన పరిస్ధితులు మరింత జటిలం కాకుండా  చేసుకోవచ్చు. ‘నేను కేవలం జీవితంలోని కొన్ని అననుకూలతలను అనుభవిస్తున్నానంతే’ అనే విషయాన్ని ఎపుడూ గుర్తుంచుకుంటే, ఆలోచనాధోరణిలో ఇలాంటి మార్పు చేర్పులు తెచ్చుకుంటే  సమయోచిత ప్రవర్తనకు  అది దోహదం చేస్తుంది. ‘నాకిదే కావాలి’ అనుకోవడానికి భిన్నంగా ‘ అదుంటే బాగుంటుంది’ అనే ధోరణికి  మళ్లాలి.
 
వదిలించుకునే దారి ఉంది
ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుందనేది నిజమే. అయితే సమస్యకు పరిష్కారం వెదకడం పైన మాత్రమే దృష్టి పెడితే అది ఆలస్యం అయి మరింత కోపానికి గురవ్వడం జరగొచ్చు. పరిష్కారం వెతకడం ముఖ్యమే. అయితే  ముందు దానివల్ల ఏర్పడిన  పరిస్ధితిని  మ్యానేజ్ చేయడం మరింత ముఖ్యం.

కోపిష్టి మనస్తత్వం ఉన్న వాళ్లు ఒక్కసారిగా ముగింపులోకి గెంతుతారు. వీరిచ్చే ముగింపులు కొన్నిసార్లు చాలా అనుచితమైనవి అవుతాయి. ఏదైనా వేడి వాదనల్లో ఉన్నపుడు  నొటికొచ్చినదేదో అనేయకుండా  పర్యవసానాల్ని ముందే అంచనా వేయాలి.  ఎదుటి వ్యక్తి చెప్పేదాన్ని ఎంత సావధానంగా, శ్రద్ధగా, నిదానంగా, ప్రశాంతంగా  వినగలిగితే అంత చక్కగా అర్ధంచేసుకుని అంతే సబబుగా ప్రతిస్పందించగలుగుతారు. సమాధానం ఇవ్వడానికి సమయం తీసుకోవడంలో తప్పులేకపోగా అది అవసరం కూడా. సో.. లెట్స్ సే గుడ్ బై టు యాంగర్.
 - ఎస్. సత్యబాబు, సాక్షి లైఫ్‌స్టైల్ ప్రతినిధి
 
నవ్వితే కోపం హుష్‌కాకి

సిల్లీగా అన్పించే చాలా విషయాలు అనూహ్యమైన రీతిలో ఆగ్రహావేశాలకు చెక్ చెప్తాయి.ఉదాహరణకు మీరు మీ కొలీగ్‌పై అంతులేని కోపంతో ఉన్నపుడు  మీకు బాగా నవ్వు తెప్పించే విషయాన్ని గుర్తు చేసుకోండి. ఎవరిదైనా  బల్లమీద తల పెట్టి నిద్రపోయే స్వభావం కావచ్చు, సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ గూని వచ్చినట్టు వంగిపోయే భంగిమ కావచ్చు. ఇలాంటివే ఏదో ఒకటి గుర్తు చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. నిక్‌నేమ్స్ కూడా ఈ కోవలోకే వస్తాయి. చిన్న నవ్వు నవ్వితే బోలెడంత కోపం కూడా ఇట్టే ఎగిరిపోతుంది అనేది తెలిసిందే కదా. దీన్ని మీరు ముందునుంచే ప్రాక్టీస్ చేయండి.
 
కోపం స్పీ.. డ్‌డ్‌డ్‌గా.. వస్తే..!!
సుదీర్ఘ శ్వాస తీసుకొని, వదలాలి. ఇలా కనీసం 5-6 సార్లు అయినా చేయాలి.
వేగంగా నడవాలి. బ్రిస్క్ వాకింగ్, జాగింగ్ చేయాలి.
పది నుంచి ఒకటి వరకు లెక్కపెట్టాలి. ఇలా రెండు మూడు సార్లు చేయవచ్చు.
‘నాదే కరెక్ట్... ఎదుటివారిదే తప్పు’ అనే భావన నుంచి బయటకు రావాలి.
కోపానికి - ప్రవర్తనకు మధ్య కొంత గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్‌లోనే తమకు తాము సర్దిచెప్పుకోవాలి.
 
 కోపం తరచూ వస్తుందా?!
     
సామాజిక బంధాలను పెంచుకోవాలి. అందుకు ఎక్కువమందితో స్నేహాలు చేయడం వల్ల మానసిక పరిణతి పెరుగుతుంది. కోప స్వభావం తగ్గుతుంది. అనవసర వాదన  వల్ల కోపం స్థాయి పెరుగుతుంది అనిపిస్తే దాన్నుంచి తప్పుకోవాలి.  వారానికి ఒకసారి ఒంటరిగా కాసేపు కూర్చొని ‘ఈ వారంలో ఎన్ని సార్లు కోపం వచ్చింది, ఏయే సందర్భాలలో వచ్చింది?’ అంటూ సమీక్షించుకోవాలి. ఆత్మ పరిశీలన ఎప్పుడూ అనవసర కోపాలను కంట్రోల్‌లో ఉంచుతుంది.  సన్నిహితులతో తమ భావావేశాలను వెలిబుచ్చుకోగలగాలి.
 - డాక్టర్ చెరుకూరి రమణ, సైకియాట్రిస్ట్
 
చిన్న చిన్న కోపాలు...
రోజూ అదే ట్రాఫిక్. భరించలేని రద్దీ. ఆ రూట్‌లో ప్రయాణం చెయ్యడం మీకు చాలా చిరాకుగా అన్పిస్తోంది. వెంటనే అంతగా రద్దీ లేని దారిని ఎంచుకోవాలి. మరికొంత దూరం పెరిగినా సరే. అది మీకు మానసికంగా ఇచ్చే లాభంతో పొలిస్తే అది ఏపాటి కోపం పరిధి దాటి వ్యక్తిగత సంబంధాలపై  తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్టుగా ఉంటే  సైకాలజిస్ట్‌లు, మానసిక ఆరోగ్య నిపుణులు సహకరిస్తారు. చాలా కేసులలో  8 - 10 వారాలలో కోప స్వభావాన్ని తగ్గించవచ్చని వారు చెప్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement