బీ కంట్రోల్
పొద్దున్నే ప్రశాంతంగా నిద్రలేస్తాం! నిన్నటి చిరాకునంతా మరిచి అద్దంలోకి ముఖం చూసి ఈరోజు బాగుండాలని కోరుకుంటాం. బయటికి రాగానే న్యూస్ పేపర్ ఇంకా రాదు! అబ్బా అని అసహనం మొదలవుతుంది. అయినా ఓపికగా పేపర్ బాయ్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసి.. అతగాడు వచ్చాక.. ఇంత లేటేంటని కసురుకుంటేగానీ ఆత్మారాముడి అసహనం తగ్గదు. కాఫీలో షుగర్ తక్కువైందని ఓసారి.. ఉప్నాలో ఉప్పు ఎక్కువైందని మరోసారి ఇల్లాలిని కసిరి.. రోడ్డు మీదికి వచ్చిపడతాం.
రోడ్డెక్కగానే ‘జర దేఖ్‌కే చలో భాయ్!’ అని ఓ హెచ్చరిక. పక్క వాడి డ్రైవింగ్, మన డ్రైవింగ్ రెండూ మనమే చేస్తుండగా వచ్చిన ఆ హెచ్చరిక చిరాకు తెప్పిస్తుంది. ‘నువ్వే చూసుకుని నడవరా’ అని అనాలనిపిస్తుంది!
మన లోపలి మనిషి
‘కంట్రోల్’ అని హెచ్చరిస్తాడు! సిగ్నల్ వరకూ రాగానే అప్పటిదాకా పచ్చగా వెలిగిన లైట్ ఎర్రగా మారి మనవైపు వెక్కిరించినట్టు చూస్తుంది. ముందు వెహికిల్స్ కదలవు! వెనుక నుంచి హారన్స్ మోత. పైన ఎండ, ఒంటిపై చెమట.. చిరాకు రెట్టింపవుతుంది. ముందున్న బైక్ వాడిపై మనసులో గొణుగుతూ.. వెనుకున్న బండి వైపు కోపంగా చూస్తాం. మనది బైక్ అయ్యి.. వెనుకున్నది కార్ అయితే ఆ కోపం ఇంకాస్త ముదురుతుంది. ఆఫీస్‌కు లేటవుతుంటే బాస్ గుర్తొస్తాడు. ఆ టైమ్‌లో ఎవరైనా కదిలిస్తే కస్సుమనాలనిపిస్తుంది. కానీ లోపల ఉన్న బుద్ధిమంతుడు ‘కంట్రోల్ రే’ అంటూ భుజం తడతాడు.
ఆఫీస్‌కొచ్చాక మన పార్కింగ్ ప్లేస్‌లో మరొకరి వెహికిల్ కనిపిస్తుంది.. క్షణాల్లో నియంత్రణ కోల్పోతాం. నోటికొచ్చినట్టు తిట్టాలనిపిస్తుంది! ఎంతైనా సావాసగాడని గుర్తొచ్చి మరోసారి కంట్రోల్ అనుకుంటాం! సాయంత్రం ఇంటికెళ్లేముందు టార్గెట్ పూర్తవలేదని బాస్ చివాట్లు పెడతాడు! చెడామడా నాలుగు మాటలు అనేయాలనిపిస్తుంది. ప్చ్.. భక్తితో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవమేదో ‘కంట్రోల్... కంట్రోల్’ అని హెచ్చరిస్తుంది! మళ్లీ ట్రాఫిక్‌లో చచ్చీ చెడీ.. ఇంటికి చేరుకున్నాక.. ‘ఇది నిండుకుంది’ అని గృహమంత్రి, ‘నాన్నా నేను చెప్పిన బుక్ తెచ్చావా..?’ అని కూతురో, కొడుకో అడగ్గానే.. పొద్దంతా లోపల రగిలిన లావా బయటికి తన్నుకొస్తుంది! ఇంట్లోవాళ్ల
మీద ఇంతెత్తున లేస్తాం!
సదరు గొడవలన్నీ రోజూ ఉండేవే.. ఇలా చిన్న చిన్న విషయాలకు చిరాకు పెంచుకుంటూ సహనాన్ని కోల్పోతే.. మానసిక ప్రశాంతత దూరమై బీపీ, షుగర్స్ దరి చేరుతాయే తప్ప మరే ప్రయోజనం ఉండదు. ఈ సహనోపాఖ్యానం ఎందుకంటే ఈ రోజు ‘వరల్డ్ ఐయామ్ ఇన్ కంట్రోల్ డే!’ కాబట్టి... ‘బి ఇన్ కంట్రోల్ ఎవ్రీ డే’ అండ్ సే ‘ఐయామ్ ఇన్ కంట్రోల్’!
..:: కట్ట కవిత