ఈ మెసేజ్ ప్రతి ఆడపిల్లకీ..!
ఫేస్‌బుక్‌లో మొదట ముఖాలు చూస్తారు. తర్వాత మెసేజ్‌లు పెడతారు. తర్వాత మెసేజ్‌నే సంభాషణగా మారుస్తారు. ఆ తర్వాత ఆ మెసేజ్‌నే వలగా.. విషపుకోరగా... కబళించే అగాధంగా మారుస్తారు. అన్ని మెసేజ్‌లు పెళ్లి కోసం కాదు... ప్రేమ కోసం కూడా కాదు... మరెందుకో తెలుసుకుంటే ఆ చైతన్యాన్ని ఒక మెసేజ్‌గా అందరికీ చేరవేస్తే ‘శ్రావ్య’లాంటి ఉదంతాలు మళ్లీ జరగవు.
శ్రావ్య... ఆమె ఇష్టపడిన ప్రవీణ్‌చక్రవర్తి తనను ఇష్టంగా పిలిచే పేరు అది. ఈ తరం యువత జీవనశైలిలో భాగమైన ఫేస్‌బుక్‌లో ఆమెకూ అకౌంట్ ఉంది. అదిగో అక్కడే ఫ్రెండ్ రిక్వెస్ట్‌తో ఆమెకు తారసపడ్డాడు కాకినాడకు చెందిన ప్రవీణ్ చక్రవర్తి.
అక్కడి నుంచి శ్రావ్య కథే మరిపోయింది. కువైట్‌లో ఉన్న అమ్మ, అన్న పంపిస్తున్న డబ్బుతో తన చదువేదో తాను చదువుకుంటున్న ఆమె ఇప్పుడు భార్య స్థానం కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది.
ఆమె నేపథ్యం..
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని గొల్లల మామిడాడ శ్రావ్య సొంతూరు. దళిత ఆడబిడ్డ. ఆమెకు ఓ అన్న. ఎనిమిదేళ్ల కిందట అమ్మ, నాన్నకు మధ్య స్పర్థలు వచ్చి విడిపోయారు. ఉపాధి కోసం అన్న కువైట్ వెళ్లాడు. ఆరేళ్ల కిందట అమ్మ కూడా వెళ్లింది. అప్పటి నుంచి కాకినాడలోని ఓ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటోంది శ్రావ్య. ప్రస్తుతం హోటల్ మేనేజ్‌మెంట్ కోర్స్ చేస్తోంది.
ప్రవీణ్‌చక్రవర్తి వలలో...
ఫేస్‌బుక్‌లో మామూలుగా ఇతర స్నేహితులతో చాటింగ్ చేసినట్టే గత ఏడాది మేలో తన ఫ్రెండ్‌లిస్ట్‌లో చేరిన ప్రవీణ్‌తోనూ చాటింగ్ చేసింది. కొంచెం చనువు ఏర్పడ్డాక శ్రావ్య ఫోన్ నంబర్ తెలుసుకొని ఒకరోజు ఆమెకు ఫోన్ చేశాడు. తాను ఓ మతబోధకుడినని, చాలామంది సమస్యలను పరిష్కరించానంటూ ఫోన్లో తన గురించి ఇంకొన్ని వివరాలు చెప్పాడు. దాంతో శ్రావ్య ఆమె స్నేహితురాలి అనారోగ్యం గురించి చెప్పింది. ఆమె కోసం ఫోన్‌లోనే ప్రార్థన చేశాడు. వెంటనే ఆయన స్పందించిన తీరు, అంతకుముందు ఆయన చెప్పిన మాటలను బట్టి శ్రావ్య ప్రవీణ్‌ను ఓ మంచి వ్యక్తిగా నమ్మడం మొదలుపెట్టింది. ఆ స్నేహం మరింత స్ట్రాంగ్ అయింది. పగలు,రేయి తేడా లేకుండా ఫోన్ సంభాషణ కొనసాగింది. ఒకరోజు ఓ వ్యక్తితో శ్రావ్యకు ఐ ఫోన్ పంపాడు. ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. నా ప్రేమకానుకగా ఆ ఫోన్ తీసుకో’ అని చెప్పాడు. కొంత బెరుకు, ఎంతో మొహమాటంతోనే ఫోన్ తీసుకుంది శ్రావ్య. ఇంకొన్నాళ్లకు ల్యాప్‌టాప్ పంపాడు. వద్దని వారిస్తే.. నీ చదువుకి ఉపయోగపడ్తుందనే ఇస్తున్నాను తీసుకో అన్నాడు. కాదనలేకపోయింది శ్రావ్య. ఇద్దరి మధ్య ప్రణయబంధం బలపడింది.
సెప్టెంబర్ 6...
‘మన ప్రేమ విషయం మన పెద్దలకు చెప్పేద్దాం. ఎలా చెప్పాలో ఒకసారి కలిసి మాట్లాడుకుంటే బాగుంటుంది. ఫలానా చోటకు రా’ అంటూ శ్రావ్యను పిలిపించాడు ప్రవీణ్. అదో హోటల్. తనదే అన్నాడు శ్రావ్యతో. ఆ హోటల్ పేరు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన శ్రావ్యతో ‘మా కుటుంబ సభ్యులందరి పేర్లు కలిపి పెట్టా’నని వివరించాడు. ఈ హోటల్ ఒక్కటే కాదు, తనకో స్కూల్, స్వచ్ఛంద సంస్థా ఉన్నాయని, వాటికి బోలెడు ఫండ్స్ వస్తాయని చెప్పాడు. ఓ గదికి తీసుకెళ్లి అల్మరాలో ఉన్న డబ్బులు, నగలు చూపించాడు. ‘నా భార్యవు కాబోతున్న నీకే ఇవన్నీ’ అన్నాడు. అంతేకాదు హోటల్ మేనేజ్‌మెంట్ చేశావు కాబట్టి ఈ హోటల్ నిర్వహణ బాధ్యతా నీకే అప్పగిస్తా’ అంటూ ఆ హోటల్‌లోని 306 రూమ్‌కి తీసుకెళ్లాడు. చేతివేలికి ఉంగరం తొడిగాడు. తమ మత సంప్రదాయం ప్రకారం పెళ్లి అయిపోయినట్లే అన్నాడు. ఆ సందిగ్ధాశ్చర్యాల్లోనే ఉన్న శ్రావ్యను శారీరకంగా వశపర్చుకున్నాడు. ఆ రోజు నుంచి ఆమెతో ఓ భర్త ప్రవర్తించినట్టే ప్రవర్తించసాగాడు. ఆమె పేరు మీద బ్యాంక్ అకౌంట్ తెరిచి 85 వేల రూపాయలు డిపాజిట్ చేశాడు. హోండా యాక్టివా బండి కొనిపెట్టాడు. ఆయనకున్న ఖరీదైన కార్లన్నీ చూపించి.. భవిష్యత్‌లో అవసరం పడొచ్చు అని డ్రైవింగ్ నేర్పించాడు. ‘అంతా బాగుంది.. కానీ ఇంతకీ మన పెళ్లెప్పుడు?’ అని ప్రశ్నించింది శ్రావ్య. గత నవంబర్‌లో కలిసినప్పుడు నిలదీసింది.‘మీ అమ్మను వచ్చి మా పేరెంట్స్‌తో మాట్లాడమను’ అన్నాడు. కువైట్ నుంచి తన తల్లిని పిలిపించింది శ్రావ్య. మొన్న డిసెంబర్‌లో తన వాళ్లను తీసుకొని ప్రవీణ్ వాళ్లింటికి వెళ్లి పెళ్లి విషయం మాట్లాడి వచ్చింది శ్రావ్య తల్లి. ఈ పెళ్లి కుదరదని ఓ టీచర్ ద్వారా కబురు పంపించాడు ప్రవీణ్. ఆ మాట విని షాక్ అయింది శ్రావ్య. ఈ కబురు పంపింది ప్రవీణేనా? విస్మయం చెందింది. నమ్మలేకపోయింది. కానీ నిజమే అని... నమ్మక తప్పదని నిరూపించింది ప్రవీణ్ ప్రవర్తన. అప్పటిదాకా అందంగా కనిపించిన ప్రపంచం ఒక్కసారిగా శూన్యంగా మారిపోయింది శ్రావ్యకు. నిద్రమాత్రలు మింగింది. శ్వాస ఆగిపోలేదు. చావు కూడా మోసం చేసిందని బాధపడింది. కానీ ఆడుతున్న ఊపిరి తనకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించమనే ధైర్యాన్నిచ్చింది ఆమెకు. ‘ప్రేమిస్తున్నానంటే మనసిచ్చా... కానీ నీ ఆస్తిపాస్తులను చూసి నీకు పడిపోలేదు. నన్ను ‘పెళ్లి చేసుకో... నా బతుకు నాకివ్వు’ అంటూ ప్రవీణ్ ఇంటి తలుపు తట్టింది. ఆత్మాభిమానాన్ని దెబ్బతీశాడు తప్ప భార్యగా స్వీకరించలేదు. లాభం లేదని పోలీసుస్టేషన్‌కు వెళ్లింది. అక్కడా వైద్యపరీక్షలు, శల్యపరీక్షలు అంటూ అవమానమే ఎదురైంది. వారం అయినా ఆ తతంగం ఆగలేదు. ఫేస్‌బుక్ ప్రేమ చక్రవర్తిపై ఈగ కూడా వాలలేదు. ఇదెక్కడి న్యాయమంటూ మీడియా ముందు మొరపెట్టుకుంది! తనలా మరెవ్వరూ మోసపోకూడదని పోరాటానికి సిద్ధమవుతోంది శ్రావ్య.
- అల్లు సూరిబాబు, సాక్షి ప్రతినిధి, కాకినాడ
ప్రవీణ్‌ను వదిలేసి నన్ను ఇంటరాగేషన్ చేస్తున్నారు
నన్ను మోసం చేయడమే కాకుండా నాపై తిమ్మాపురం పోలీసుస్టేషన్‌లో తప్పుడు కేసు కూడా పెట్టించాడు. ఈ విషయం వారం రోజుల క్రితం అతనిపై ఫిర్యాదు చేయడానికి కాకినాడ సర్పవరం పోలీసుస్టేషన్‌కు వెళ్తే తెలిసింది. నాకు అసహ్యం వేసింది. కానీ ఎవ్వరినైతే భర్తగా ఊహించుకొని సర్వస్వం అర్పించానో... ఎప్పటికీ అతనే నా భర్త. నన్ను ఎలా వశపరచుకున్నాడో ఈ 500 ఫేస్‌బుక్ మెసేజ్‌లు, వాట్సాప్‌లో పంపిన ఫొటోలు చూడండి (అవన్నీ ఒక బౌండ్ చేయించారు). వీటిని చూపించి పోలీసులకు ఫిర్యాదు చేస్తే ప్రవీణ్‌ను వదిలేసి... నన్ను ఇంటరాగేషన్ పేరుతో పోలీసుస్టేషన్‌కు తిప్పుతున్నారు. వారం రోజుల్లో ఏడుసార్లు వెళ్లాను. మళ్లీ రమ్మంటున్నారు (ఈ విషయం చెప్తున్నప్పుడే ఆమెకు సీఐ నుంచి ఫోన్ కాల్ వచ్చింది). ఏదిఏమైనా నాకు న్యాయం జరిగేవరకూ పోరాటం చేస్తాను.
- శ్రావ్య
మేమంతా అండగా ఉంటాం...
ఆమెకు ఎవ్వరూ లేరని బెదిరింపులకు పాల్పడుతున్నారు. డబ్బుతో అన్ని వ్యవస్థలను మేనేజ్ చేయాలనుకుంటే పొరపాటు. ఇప్పటికే మీడియా సమావేశంలో అన్ని విషయాలు వెల్లడించాం. ఆమెను ప్రవీణ్ పెళ్లిచేసుకోవాలి. తర్వాత కూడా ఆమెకు ఎలాంటి హాని జరగకుండా మేము అండగా నిలబడతాం. ఆమె పోరాటానికి మద్దతు ఇస్తాం.
- సరోజ కాకినాడ మాజీ మేయర్