పెరుగుతున్న పెళ్ళి వయసు
పద్ధెనిమిదేళ్ళ వయసుకే పెళ్లిని ఇష్టపడే అమ్మాయిలు తగ్గిపోయారు. పోనీ 20 ఏళ్లకు పెళ్ళంటే చదువంటున్నారు. పాతికేళ్లకు చేసుకోమంటే ఉద్యోగం అంటున్నారు. ముప్ఫై ఏళ్లు నిండితే గాని పెళ్లి మాట ఎత్తొద్దని ఇంట్లోని పెద్దలకు వార్నింగ్‌లు ఇస్తున్నారు నేటి తరం అమ్మాయిలు.
చాలా చోట్ల ఇదే పరిస్థితి. అమెరికాలో హర్ క్యాంపస్ డాట్‌కామ్ వాళ్లు ‘డెడ్ లైన్’ పేరుతో చేసిన అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. మొత్తం 2,600 కళాశాలలు, 677 యూనివర్సిటీలలో చదువుకుంటున్న అమ్మాయిలందరి అభిప్రాయాలు సేకరించి ఈ అధ్యయనం చేశారు.
అందులో తేలింది ఏమిటంటే, 85 శాతం కాలేజి అమ్మాయిలు ముప్ఫై ఏళ్ల వయసులో పెళ్లిని ఇష్టపడుతున్నారు. ఈ విషయం గురించి హర్‌కాంపస్ సిఇఓ స్టెఫిన్ కప్లేన్ మాట్లాడుతూ, ‘‘ఈ అధ్యయనంలో వ్యక్తమైన అమ్మాయిల అభిప్రాయాన్ని మేం ముందుగానే ఊహించాం. చదువు, ఉద్యోగం, బాధ్యతలు, ప్లానింగ్...అన్నీ సక్రమంగా చేసుకోడానికి చదువు తర్వాత అమ్మాయికి కొంత సమయం అవసరమవుతుంది.
జీవితం పట్ల కచ్చితమైన ప్లానింగ్ ఉన్న ప్రతి అమ్మాయికీ లక్ష్యం చేరుకోడానికి ఈ మాత్రం సమయం పడుతుంది మరి’’ అని అన్నారామె. ఈ అధ్యయనానికి ‘డెడ్‌లైన్’ అనే పేరెందుకు పెట్టారంటే... ‘‘పెళ్లికి ముందు తను చేరుకోవాల్సిన లక్ష్యాలను చేరుకోవాలి. ఫలానా సమయం లోగా పనులన్నీ పూర్తిచేసుకోవాలనే డెడ్‌లైన్ పెట్టుకుంటేనే అన్నీ సక్రమంగా పూర్తిచేసుకోగలరు. ఆ సమయాన్నే మేం ‘డెడ్‌లైన్’ అంటున్నాం’’ అంటారు ఈ అధ్యయన నిర్వాహకులు.