మనోళ్ళు ఎప్పుడో ఉతికిపారేసిందే నేటి కీకీ | India find out the kiki Challenge | Sakshi
Sakshi News home page

మనోళ్ళు ఎప్పుడో ఉతికిపారేసిందే నేటి కీకీ

Published Wed, Aug 8 2018 12:41 AM | Last Updated on Mon, Oct 22 2018 6:13 PM

India find out the kiki Challenge - Sakshi

పోలీసులు లాఠీ చూపినా  కీకీ కేక పెడుతూనే ఉంది. కదులుతున్న కార్లు దాటి  దున్నతున్న నాగళ్లను పట్టుకుంది. సిటీ యూత్‌ నుంచి  పల్లెటూరి పిల్లగాళ్లను  చేరింది. ఆ చాలెంజ్‌ వెంట పరుగులు తీస్తున్నారు..  పిచ్చిపట్టి డ్యాన్స్‌ చేస్తున్నారు. 

కరీంనగర్‌ జిల్లాలో యువ రైతులు పొలంలో పని చేస్తూ ‘కీకీ చాలెంజ్‌’ యాక్సెప్ట్‌ చేయడంతో కీకీ మళ్లీ వార్తల్లోకి వచ్చింది.  సోషల్‌ మీడియా కాజ్‌తో క్రేజ్‌గా మారిన కీకీ చాలెంజ్‌ వల్ల కాళ్లు విరుగుతున్నాయి.. తలలు పగులుతున్నాయి.. ప్రాణాలు పోతున్నాయి... ట్రాఫిక్‌ ఇబ్బందులూ  వస్తున్నాయి.. ఆపండి అని  అరుస్తున్నా ఆగట్లేదు.  పనిష్మెంట్‌ తప్పదని హెచ్చరిస్తున్నా లెక్క చేయట్లేదనే అనిపిస్తోంది ఈ వెర్రిని చూస్తుంటే. వాస్తవానికి ‘కీకీ  చాలెంజ్‌’లాంటిది మనకు కొత్త కాదు. ఈ స్టయిల్‌ మన సినిమా బ్లాక్‌  అండ్‌ వైట్‌ కాలంలోనే  క్రియేట్‌ చేసింది. డిజిటల్‌ ఏజ్‌లోనూ  కంటిన్యూ చేస్తోంది.  కంటి చూపుతో ట్రైన్‌ ఆపడాలు.. తొడకొట్టి వెనక్కి పంపిచడాలు ఎన్ని సినిమాల్లో చూడలేదూ? అయితే వీటిని మనం  స్టంట్స్‌గానే గుర్తించాము తమ్మ సోషల్‌ మీడియా దాకా తీసుకెళ్లలేదు. చాలెంజెస్‌ పేరుతో పబ్లిసిటీ ఇవ్వలేదు. ఈ కామన్‌సెన్స్‌నే ‘కీకీ’కీ అప్లయ్‌ చేయాలి.  మన దగ్గర గతంలో ‘కీకీ’ని పోలిన సన్నివేశాలు కనిపించిన సినిమాలు...

షోలే.. సాజన్‌ 
అశోక్‌ కుమార్, కిషోర్‌ కుమార్, అనూప్‌ కుమార్‌ ఈ ముగ్గురు అన్నదమ్ములు కలిసి నటించిన ‘చల్తీ కా నామ్‌ గాడీ’లో కదిలే కారులో సాగే  పాటలు, మాటలు, డాన్సుల సీన్లు ఉన్నాయి. ‘బాజూ... సంఝో ఇషారే’ అని సాగే పాటలో కారు వదిలి దౌడు తీసే విన్యాసాలు ఉన్నాయి. అలాగే  ‘ప్యార్‌ కియే జా’ (డైరెక్టర్‌ సీవీ శ్రీధర్‌)లోనూ ‘గోరే హాతోంపే జుల్మ్‌ నా కరో’ అనే  కీకీ చాలెంజ్‌ను పోలిన పాట ఉంటుంది. హీరోయిన్స్‌ ఇద్దరూ  కారు నడిపిస్తుంటే  హీరో  పాడుకుంటూ బ్యానెట్‌ మీద డాన్స్‌ చేస్తాడు ఆ పాటలో.  అందరికీ తెలిసిన ‘షోలే’’లోనూ అలాంటి సాంగ్‌ షో చేసింది.   బసంతి (హేమామాలిని) తన గుర్రబ్బండీని తోలుకుంటుంటే  వీరు (ధర్మేంద్ర) ‘కోయి హసీనా జబ్‌ రూట్‌ జాతీ హైతో’  అని పాడుతూ బగ్గీ ఎక్కుతాడు.  పాడుకుంటూనే కిందికి దూకుతాడు. మళ్లీ ఎక్కుతాడు. ‘ఆరాధన’ ఆల్‌ టైమ్‌ హిట్‌ సాంగ్‌  ‘మేరే సప్‌నోంకి రాణి కబ్‌ ఆయే గీ తూ’ పిక్చరైజేషన్‌ ఏమన్నా ఉంటుందా? మూవింగ్‌ ట్రైన్‌లోని  హీరోయిన్‌ను చూస్తూ జీప్‌లోని హీరో పాడే పాట.  ఇప్పటికీ కోట్ల స్వరాలు ఆలపిస్తునే ఉంటాయి. కాని అభినయించే దుస్సాహసం రికార్డ్‌ కాలేదెక్కడ. ‘సాజన్‌’, ‘హమ్‌ ఆప్‌ కే హై కౌన్‌’ వంటి సినిమాల్లో లోతట్టుకి  జారుతున్న జిప్సీలోకి హీరో సల్మాన్‌ ఖాన్‌ దూకి  ఎక్కిన దృశ్యాలున్నాయి. ‘అంజాన్‌’ సినిమాలో షారూఖ్‌ఖాన్‌ టాక్సీ  మీదెక్కి అభినయించిన ‘బడీ ముష్కిల్‌ హై ఖోయా మెరా దిల్‌ హై..’  పాట కూడా చాలా పాపులర్‌ అయింది. షారూఖ్‌ ఖానే నటించిన ఇటీవలి సినిమా ‘ఫ్యాన్‌’లో  ‘కరూ ట్విటర్‌ పే.. ట్యాగ్‌ కరూ ఫేస్‌బుక్‌ పే’ అనే పాటలో కూడా ఆయన పాడుకుంటూ కదిలే బస్‌ ఎక్కుతాడు. ఇది సినిమాల వరకూ ఓకే. నిజ జీవితంలో కదిలే వాహనం ఎక్కే ప్రమాదం ఎలాంటిదో తెలుసు కదా!  

టాలీవుడ్‌ ఎక్స్‌పరిమెంట్స్‌
తెలుగు పరిశ్రమ కూడా మన హీరోల చేత ఇలాంటి శ్రమ బాగానే చేయించింది. బ్రహ్మాండంగా స్టెప్స్‌ వేయించింది. అభిమానాన్ని చప్పట్ల వరకే పరిమితం చేయించింది. ‘నవ్వింది మల్లెచెండు.. నచ్చింది గర్ల్‌ ఫ్రెండ్‌.. ’  అంటూ  ‘అభిలాష’లో టూ వీలర్‌ మీద  చిరంజీవి చేసిన విన్యాసాలు కొన్నా? ఈలలతో స్పందించిన గొంతులు ఇంకెన్నో! ప్రేమకు అమ్మాయి ఓకే చెబితే ఇప్పటికీ ఆ పాటను హమ్‌ చేస్తూ ఉల్లాసంగా  రైడ్‌ చేసే పల్సర్, అపాచీ, హోండా..  ఈవెన్‌ హ్యార్లీ  డేవిడ్‌సన్‌ బైక్స్‌ ఎన్నిలేవూ!  స్పీడ్‌ బ్రేకర్స్‌ను ఇగ్నోర్‌ చేసిన దాఖలాలే లేవు.  ‘మేఘాలలో తేలిపొమ్మన్నది.. తూఫానులా రేగి పొమ్మన్నది..’ అంటూ ‘గులాబీ’ ఆ ప్రయాణాన్ని కొనసాగించింది.  నైంటీస్‌లో  శంకర్‌ ‘ప్రేమికుడు’ తీసి అద్దాల బస్‌ మీద హీరోతో  ‘ఊర్వశి ఊర్వశి టేకిట్‌ ఈజీ ఊర్వశి’ అంటూ పాడించాడు. యువత ఆస్వాదించింది కాని బస్సెక్కి పాడే ప్రయత్నం చేయలేదు.  మణిరత్నం ‘ఛయ్య ఛయ్య..’ ఎంత హల్‌చల్‌ అయిందో.. మలైకా ఎంతమందిని డిస్టర్బ్‌ చేసిందో వేరే చెప్పక్కర్లేదు. కీన్‌గా అబ్జర్వ్‌ చేస్తే ఇండియన్‌ సినిమాలో పాటలే కాదు.. కదులుతున్న వెహికిల్స్‌లో.. మీద.. పక్కన.. ఫైట్స్, ఇతర సన్నివేశాలూ చాలానే కనిపిస్తాయి. గిమ్మిక్సే అనే స్పృహనూ కలిగిస్తాయి. సో.. ఇంట్రెస్టింగ్‌ అని ఎంటర్‌టైన్‌ అవండి. చాలెంజింగ్‌ అని ఇమిటేట్‌ చేయకండి.  అలా చేస్తే ప్రమాదం ఎదురుపడి డొక్కలు కదులుతాయి.. ఎముకలు విరుగుతాయి. మరుగున పడాల్సిన దాన్ని వయా సోషల్‌ మీడియా వైరల్‌ చేయొద్దు. లైఫ్‌ చాలెంజెను స్వీకరించాలి. పదిమందికి మంచిని పంచాలి. హాలికుల కుశలం కోసం కరీంనగర్‌ జిల్లాలో రైతులు  కీకీ చాలెంజ్‌ను యాక్సెప్ట్‌ చేసిన వార్తను సోషల్‌ మీడియా వైరల్‌చేసి మరుగున పడ్తునదాన్ని మళ్లీ పైకి తెచ్చింది. హాలికుల కుశలం కోసం  యాంటి సూసైడ్‌ చాలెంజ్‌ను స్వీకరిస్తే బాగుంటుంది.  రైతుల సంక్షేమాన్ని సర్కార్‌ సవాలుగా  తీసుకుంటే సూపర్‌గా ఉంటుంది. అంతే తప్ప కదులుతున్న వాహనం నుంచి దిగి వేసే గంతుల వల్ల ప్రయోజనం లేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement