
జనస్వామ్యం జిందాబాద్
వర్తమాన భారతం
► ఇలాంటి పండగ రోజు ఏ దేశమైనా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటుంది.
►1947లో స్వాతంత్య్రం సిద్ధించాక భారతదేశానికి వెనుకకు తిరిగి చూడాల్సిన అవసరమే లేకపోయింది.
►అలాంటి ప్రగతిని సాధించిన భారతావనినే ప్రపంచం తిరిగి తిరిగి చూస్తోంది.
►మన సామాన్యులు సామాన్యులు కారు.
►అసామాన్య పురోభివృద్ధి గలవారు. దీక్ష గలవారు. కీర్తి సాధకులు.
►స్వరాజ్య సప్తతి గుండెల్లో నింపిన ఊపిరితో రెపరెపలాడుతున్న త్రివర్ణ పతాకానికి సలాం.
►70 ఏళ్ల జనస్వామ్యానికి జిందాబాద్.
శతాబ్దాలపాటు పరాయిపాలనలో కొనసాగిన భారతదేశం 1947లో స్వాతంత్య్రం పొంది 70 ఏళ్లపాటు ప్రజాస్వామ్యదేశంగా మనుగడ సాగించడం మానవాళి చరిత్రలోనే ఒక మహత్తర విజయం. ఎందుకంటే వలసపాలన నుంచి బయటపడిన ఎన్నో దేశాలు ప్రజాతంత్ర మార్గంలో ప్రయాణం ప్రారంభించినప్పటికీ ఎక్కువకాలం ప్రజాస్వామ్య దేశాలుగా కొనసాగలేకపోయాయి. వాటి రాజ్యాంగాలు రద్దయ్యాయి. ఎన్నికైన ప్రభుత్వాలు సైనిక తిరుగుబాట్ల ఫలితంగా పతనమయ్యాయి. అక్కడ నియంతృత్వ ప్రభుత్వాలు రూపుదాల్చి పాతుకుపోయాయి. ప్రజాస్వామ్యం కన్నా నియంతృత్వమే మెరుగనే భావన కూడా ఆ దేశాల ప్రజల మనసుల్లో ఎంతోకొంత మేర బలపడింది. అందుకు భిన్నంగా భారతదేశంలో ప్రజాస్వామ్యం బలపడుతూ, పాశ్చాత్య ప్రజాతంత్ర సమాజాల సరసన సమానంగా నిలబడింది.
ప్రపంచంలోనే అతి పెద్ద సుదృఢ ప్రజాస్వామ్యంగా మన్ననలందుకుంటోంది. ఇదంతా తేలికగా సాధ్యమవలేదు. గత 70 ఏళ్ల కాలంలో భారతదేశం పలు విషమ పరిస్థితులను ఎదుర్కొంది. అంతర్గత తిరుగుబాటు నెపంతో 1975లో దేశంలో అత్యయికస్థితిని దేశంలో విధించింది నాటి ప్రభుత్వం. స్వతంత్ర సిక్కుదేశం కోసం అకాలీ తీవ్రవాదులు చేసిన ఉద్యమం, పర్యవసానంగా జరిగిన హింసాకాండ దేశసమగ్రతను ప్రశ్నార్థకం చేశాయి. పంజాబ్ కల్లోలం తర్వాత ప్రధాని ఇందిరాగాంధీని కాల్చిచంపారు. మండల్ రిజర్వేషన్ అంశం, మందిర్ వివాదం దేశాన్ని తీవ్ర సంక్షోభంలో పడవేశాయి. ఐరోపా సోషలిస్ట్‌రాజ్యాల పతనానంతరం ప్రపంచవ్యాప్తంగా ముందుకొచ్చిన స్వేచ్ఛా విపణివాదానికి అనుకూలంగా దేశ ఆర్థికవ్యవస్థను పునర్నిర్మించాల్సివచ్చింది. ఈ విజయాలకు ప్రధాన కారణం ప్రజాస్వామ్య రాజకీయ పరిపాలనా చట్రం. శాంతిభద్రతలు, ప్రజాభిప్రాయం, ప్రజాసంక్షేమం, వ్యక్తిస్వేచ్ఛలు, ఆర్థికప్రగతి తదితర అంశాల్లో వేటికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి? అవి ఏ పాళ్లలో ఉండాలి? అనే విషయాలను భారతప్రజలకు నేర్పింది ప్రజాస్వామ్యం.
సామాజిక న్యాయానికి రిజర్వేషన్లు!
సామాజికంగా వెనుకబడిన కులాలవారు విద్య, ఉద్యోగాలు, చట్టసభల్లో తగినంత ప్రాతినిధ్యం పొందడానికి రిజర్వేషన్లు దోహదం చేస్తున్నాయి. పెరిగిన విద్యావకాశాలు, భూసంస్కరణలు, కులవృత్తులు వదలి నచ్చిన వృత్తులు చేపట్టగలిగే అవకాశాలు పెరగడం, రాజకీయ వికేంద్రీకరణ మొదలైన అంశాలు సామాజిక ఐక్యతను పెంపొందించడానికి, నూతన లౌకిక పునాదుల మీద నిలబెట్టడానికి, సామాజిక పరిపుష్టతకూ దారితీశాయి. అత్యున్నత రాజ్యాంగ పదవులైన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి పదవుల్లో నేడు సామాన్య సామాజిక, కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన నేతలు ఉండడం భారత ప్రజాస్వామ్య విజయపథానికి సంకేతం.
అలాగే, కమ్యూనిస్ట్‌పార్టీలు ఎన్నికల ద్వారా అధికారంలోకి రావడం, ప్రభుత్వాలు నడపడం, పార్లమెంటరీ రాజకీయాల్లో ప్రముఖపాత్ర నిర్వహించడం ప్రపంచంలో ఒక్క భారతదేశంలోనే జరిగింది. నేటికీ కొన్ని రాష్ట్రాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు బలంగానే కొనసాగుతున్నాయి. హిందూ సాంస్కృతిక జాతీయవాదం పేరుతో బలపడిన భారతీయజనతా పార్టీ కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చాక తన భావజాల తీవ్రతను క్రమేపీ తగ్గించుకుంది. పలు సామాజికవర్గాలను కలుపుకోగలిగింది. ఇతర పార్టీలతో జతకట్టింది. అలాగే, కులం, మతం, ప్రాంతం వంటి అస్థిత్వాల ఆధారంగా ఏర్పడిన పార్టీలు అధికారం చేపట్టాక తమ భావజాలంలోని చిక్కదనాన్ని తగ్గించుకున్నాయి. ఇంకా ఇతరులను కలుపుకుపోయే పంథాను అలవరుచుకున్నాయి. ఇవన్నీ భారత ప్రజాస్వామ్య విజయాలే. భారత ప్రజాస్వామ్య ప్రయోగం, విజయం ప్రపంచదేశాలకు కూడా కొన్ని సకారాత్మక సందేశాలు అందించాయి. స్వాతంత్య్రా నంతరం భారతదేశంలో ప్రజాస్వామ్యం సాధ్యమా? అని రాజకీయ పండితులు తర్జనభర్జనలు చేశారు.
ఇండియాలో ప్రజాస్వామ్యం నిలబడుతుందా?
స్వాతంత్య్రం వచ్చిన మూడేళ్లకే భారత ప్రజలు తమ దేశాన్ని గణతంత్ర ప్రజాస్వామ్యంగా ప్రకటించుకున్నారు. భారత ప్రజాతంత్రవ్యవస్థ పనిచేయడం మొదలైన కొద్ది కాలానికే మళ్లీ రాజనీతి పండితులు ‘ఇండియాలో ప్రజాస్వామ్యం నిలబడి, పరిఢవిల్లుతుందా?’ అని అనుమానాలు వ్యక్తంచేశారు. భారత ప్రజాతంత్ర వ్యవస్థ తన అంతర్గత వైరుధ్యాలతోనే కుప్పకూలిపోతుందని కూడా వారు జోస్యం చెప్పారు. ఈ రాజనీతికోవిదుల సంశయాలు, జోస్యం తప్పని భారతప్రజాస్వామ్యం నిరూపించింది. ఈ డెబ్బయేళ్లలో చాలా సవాళ్లు ఎదురయ్యాయి. హింసాయుత ఆందోళనలు పుట్టుకొచ్చాయి.
వేర్పాటువాద ఉద్యమాలు జరిగాయి. ఈ సమస్యలను బలప్రయోగం –సర్దుబాటు అనే సూత్రం ఆధారంగా భారత్ చాలా వరకు పరిష్కరించగలిగింది. ఒక ప్రాంతం అశాంతితో అట్టుడికిపోతున్నా, మిగతా దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాలను నడుపుకుపోవడం ప్రజలకు అలవాటయింది. అయితే, భారత ప్రజాస్వామ్యమంతా బ్రహ్మాండంగా ఉందనలేం. ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్యమని చెప్పుకుంటాం. 70 సంవత్సరాలపాటు ప్రజాతంత్ర ప్రక్రియ, ప్రభుత్వాలు విజయవంతంగా కొనసాగుతున్నాయనుకుంటాం. అయితే, ఒక మేలైన ప్రజాస్వామ్యం ఇండియాలో ఉందని చెప్పడానికి ధైర్యం చాలదు. ఇటీవల పెచ్చుపెరిగిన కొన్ని రాజకీయధోరణులు భారతదేశానికి రాజకీయపరంగా పెద్ద సవాళ్లుగా మారాయి.
ప్రజాస్వామ్యానికి మూడు సవాళ్లు
మొదటిది రాజకీయ అవినీతి. రాజకీయాలను, ప్రభుత్వాధికారాన్ని సంపదను పోగుచేసుకునేందుకు మార్గంగా చూడడం చాలామంది రాజకీయనాయకులకు అలవాటు మారింది. ఒక్కొక్కరు పదో ఇరవయ్యో కోట్లు కాదు, వందల కోట్లు కాదు, వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు కూడబెట్టుకుంటున్నారన్న ఆరోపణలు నిత్యం మనం రాజకీయనాయకుల నుంచే వింటున్నాం. రాజకీయపక్షాలను స్థాపించినవారు వాటిని తమ సొంత ఎస్టేట్లుగా పరిగణించడం సహజమయింది. రెండో సవాలు వారసత్వ రాజకీయాలు. రాజకీయ అధికారాన్ని సొంతాస్తిలా పిల్లలకు బదలాయించడం తమ హక్కుగా అధినాయకులు భావిస్తున్నారు.
తాము ఎలాగైనా అధికారంలోకి రావాలని పిల్లలూ, కుటుంబసభ్యులూ శత విధాలా ప్రయత్నిస్తున్నారు. రాజనీతి పరిభాషకు భారత ప్రజాస్వామ్యం ఓ కొత్త మాటను జోడించింది. దాని పేరే ‘అనువంశిక ప్రజాస్వామ్యం’ లేదా వారసత్వ ప్రజాస్వామ్యం. ఇక మూడో సమస్య అధికార కేంద్రీకరణ. అధికారాన్ని కేవలం ఒక చోట కేంద్రీకరించడమేకాదు, ఒక వ్యక్తి చేతిలో పూర్తి అధికారం నిక్షిప్తం చేయడం. అంటే కేంద్రీకృత అధికారాన్ని ఒక బృందానికో, కమిటీకో కాకుండా వ్యక్తిపరం చేయడం. ఈ రకమైన ఏకవ్యక్తి నిరంకుశ పాలనను చాలా వరకు రాజకీయపక్షాల్లో, ప్రభుత్వాల్లో చూస్తున్నాం. ప్రజాతంత్ర ప్రభుత్వాలను ఏకచ్ఛత్రాధిపత్యం నెరపే అధినాయకులు నడపడం భారత ప్రజాస్వామ్య వైచిత్రి.
సర్వత్రా ఇవే ధోరణులు!
ఈ ధోరణులు చాలా పార్టీల్లో, అనేక ప్రభుత్వాల్లో దాదాపు అన్ని స్థాయిల్లో మనం చూస్తున్నాం. రాజకీయ అవినీతి, అనువంశిక పాలన, నిరంకుశ అధినాయకత్వం అనే మూడింటికి అంతర్గత అవినాభావ సంబంధముంది. బహుశా సామాజిక వెనుకబాటుతనం, విద్యలేమి, విస్తృత పేదరికం కలగలసి ప్రజాస్వామ్య ప్రక్రియలో ఈ విపరీత ధోరణులకు దారితీసి ఉండొచ్చు. ఈ పరిస్థితిని అధిగమించి ఒక మేలైన, అర్థవంతమైన, సారవంతమైన ప్రజాస్వామ్యవ్యవస్థను ఏర్పరచుకోవడమెలా? అనేదే భారతప్రజల ముందున్న పెద్ద సవాలు. భారత ప్రజాస్వామ్యం గత 70 ఏళ్లలో ఎన్నో సంక్షోభాలను అధిగమించి ముందుకు సాగింది. అదేవిధంగా రాబోయేకాలంలో కూడా భారత ప్రజాస్వామ్యం సవాళ్లను అధగమించి మరింత పరిపుష్టమై ముందుకు సాగుతుందని ఆశిద్దాం.
– కొండవీటి చిన్నయసూరి ప్రొఫెసర్, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం