న్యూఢిల్లీ: భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తయ్యేనాటికి ఆర్థికవ్యవస్థను మరింతగా ఉరకలెత్తించేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. దేశ జీడీపీని 9–10% చొప్పున పరుగులు పెట్టిస్తూ 2022–23కి ఎకానమీని 4 లక్షల కోట్ల డాలర్లకు చేర్చేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని నీతిఆయోగ్ రూపొందించింది. ‘‘స్ట్రాటజీ ఫర్ న్యూఇండియా 75’’ పేరిట ఒక విజన్ డాక్యుమెంట్‌ను బుధవారం విడుదల చేసింది. 2022 నాటికి భారత్ స్వాతంత్య్రం సాధించి 75 సంవత్సరాలు(వజ్రోత్సవం) కానుంది. ఈ విశిష్ట సందర్భాన్ని గర్వంగా మలుచుకునేందుకు, అగ్రదేశాల సరసన భారత్‌ను నిలబెట్టేందుకు ఇప్పటినుంచే తగిన అడుగులు వేయాలని నీతిఆయోగ్ అభిప్రాయపడింది. ఇందుకోసం పలు వృద్ధి వ్యూహాలను విజన్ డాక్యుమెంట్‌లో పొందుపరిచారు. జిల్లా, రాష్ట్ర, దేశ స్థాయిలో దాదాపు 800 మందితో సంప్రదింపుల అనంతరం ఈ నివేదికను రూపొందించడం జరిగింది. అధిక వృద్ధి సాధనకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన 41 రంగాల గుర్తించి, వీటిపై తీసుకోవాల్సిన విస్తృత చర్యలను ఇందులో సూచించారు.
జీడీపీ జోరు కీలకం...
దేశ ఎకానమీని విస్తృతపరిచేందుకు జీడీపీని పరుగులు పెట్టించాలని విజన్ డాక్యుమెంట్ పేర్కొంది. ముందుగా వచ్చే ఐదేళ్లు (2018–23) 8–9 శాతం జీడీపీ సాధించాలని తెలిపింది. దీంతో ప్రస్తుతం 2.7 లక్షలకోట్ల డాలర్లున్న దేశ ఎకానమీ 2022–23 నాటికి 4 లక్షల కోట్ల డాలర్లకు ఎదుగుతుందని వివరించింది. ఇదే జరిగితే 2022–23 కల్లా 9–10 శాతం వేగంతో వృద్ధి సాధ్యమవుతుందని, దీనివల్ల 2030 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్లకు ఎగబాకుతుందని తెలిపింది. కేవలం గణాంకాల్లో కాకుండా జీడీపీ వృద్ధి సమ్మిళితంగా, స్థిరంగా ఉండాలని సూచించింది. గతేడాది భారత్ 6.7 శాతం వృద్ధి నమోదు చేసింది. జీడీపీ పరుగుతో పాటు దేశ పెట్టుబడి రేటు (గ్రాస్ ఫిక్స్‌డ్ క్యాపిటల్ ఫార్మేషన్) పెరగాలని తెలిపింది. ప్రస్తుతం జీడీపీలో 29 శాతమున్న జీఎఫ్‌సీఎఫ్ 2022 నాటికి 36 శాతానికి పెంచాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. అల్పాదాయ దశ నుంచి దేశ జనాభా క్రమంగా అధికాదాయాల దిశగా కదులుతున్నారని, ఈ క్రమంలో ప్రస్తుతం 1,700 డాలర్లున్న తలసరి ఆదాయం 2022–23 నాటికి 3,000 డాలర్లకు చేరవచ్చని అంచనా వేసింది.
రైతులు ఇక అగ్రిప్రెన్యూర్స్..!
ప్రస్తుతం ఇండియా ఆర్థిక పరివర్తన చివరి దశలో ఉందని విజన్ డాక్యుమెంట్ తెలిపింది. ప్రాథమిక రంగంపై ఎక్కువగా ఆధారపడ్డ దేశం కాబట్టి రైతులను పరిపుష్టం చేయాలని సూచించింది. సాగు రైతులను ‘అగ్రిప్రెన్యూర్లు’గా (సాగుతో పాటు సరైన మార్కెటింగ్ చేసుకోగల వ్యక్తులు) తీర్చిదిద్దాలని తెలిపింది. ఇందుకోసం ఇ–నామ్స్ విస్తరణ, ఏపీఎంసీ చట్టాన్ని ఏపీఎల్‌ఎం చట్టంగా మార్చడం, జాతీయ ఏకీకృత మార్కెట్ ఏర్పాటు, సరళీకృత ఎగుమతుల వ్యవస్థ ఏర్పాటు తదితర చర్యలు చేపట్టాలని తెలిపింది. మేక్ ఇన్ ఇండియా, ఆయుష్మాన్ భారతి, ప్రధాన మంత్రి జన ఆరోగ్య అభియాన్, స్వచ్ఛ భారత్ పథకాలను సక్రమంగా అమలు చేయాల్సిన ఆవశ్యకతను డాక్యుమెంట్ వివరించింది. శ్రామిక శక్తిలో మహిళలవాటాను పెంచాలని, కనీస వేతనాలు అమలయ్యేలా చర్యలు, సామాజిక భద్రతా ఛత్రం కిందకు మరిం తమందిని తీసుకురావాలని, ప్రస్తుత కార్మిక చట్టాలను సరళీకరించాలని, శిక్షణావ్యవస్థను మెరుగుపరచాలని సూచించింది.
రుణమాఫీపరిష్కారం కాదు!
రైతు కష్టాలు తీర్చేందుకు రుణమాఫీ సరైన పరిష్కారం కాదని నీతిఆయోగ్ అభిప్రాయపడింది. రుణమాఫీ కేవలం కొంతమంది సాగుదారులకు మాత్రమే లబ్ధి చేస్తుందని, సాగు సంక్షోభాల నివారణకు మార్గం చూపదని ‘భారత్ న్యూ విజన్ డాక్యుమెంట్’ఆవిష్కరణ సందర్భంగా నీతిఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ చెప్పారు. సాగు శాస్త్రవేత్త రమేశ్ చాంద్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పేద రాష్ట్రాల్లో కేవలం 10– 15 శాతం రైతులు మాత్రమే సంస్థాగత పరపతి పొందుతున్నారని, మిగిలినవారికి మాఫీతో ప్రయోజనం ఉండదని వివరించారు. ఒక్కోరాష్ట్రంలో ఒక్కో పరిస్థితి ఉన్నప్పుడు అందరికీ వర్తించేలా మాఫీ పథకం అసాధ్యమని, దీనికి బదులు సాగు సంస్కరణలకు యత్నించే రాష్ట్రాలకు ఆర్థికసాయం అందించడం ఉత్తమమని సలహా ఇచ్చారు.
ఇంకా ఏం చెప్పిందంటే!
వివాదాల పరిష్కారానికి ఆర్బిట్రేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పేరిట ఒక స్వతంత్ర సంస్థ ఏర్పాటు. 2022–23 నాటికి డిజిటల్ డివైడ్‌ను తొలగించి, అన్ని రాష్ట్రాల్లో పూర్తి డిజిటల్ అనుసంధానత ఏర్పాటు చేయడం, 100 శాతం డిజిటల్ అక్షరాస్యత సాధించడం. డిస్కమ్‌ల ప్రైవేటైజేషన్, స్మార్ట్ గ్రిడ్ ఏర్పాటు, దేశమంతా 100% విద్యుత్ సరఫరాకు చర్యలు. కార్మికులకు సంబంధించి సమగ్ర సమాచారం ఎల్‌ఎంఐఎస్ (లేబర్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ సిస్టం) ఏర్పాటు చేయడం.భారత్‌కు విచ్చేసే అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్యను మరింత పెంపొందించాలని సూచించింది. అంతర్జాతీయ పర్యాటకంలో భారత వాటాను వచ్చే ఐదేళ్లలో 1.18 శాతం నుంచి 3 శాతానికి పెంచాలని నిర్దేశించింది. 2022–23 నాటికి అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్యను 88 లక్షల నుంచి 1.2 కోట్లకు పెంచాలని సూచించింది. రైల్వేల అభ్యున్నతికి టిక్కెట్ ధరలు, సబ్సిడీల నియంత్రణ, ఆస్తులను విక్రయించడం అవసరమని సూచించింది. ప్రయాణికులను ఆకట్టుకునేలా ధరల నమూనాను రూపొందించుకోవాలని, మౌలికవసతుల కల్పనను వేగవంతం చేయాలని, రైళ్ల సరాసరి వేగాలను మెరుగుపరచాలని తెలిపింది.
మాటలు కాదు... చేతలు కావాలి: జైట్లీ
పేదరికాన్ని నిర్మూలించాలంటే బలమైన సంస్కరణలు కావాలని, కేవలం నినాదాలతో పేదరికం మటుమాయం కాదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విపక్షాలకు చురకలంటించారు. స్ట్రాటజీ ఫర్ న్యూఇండియా ః 75 ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. ఉత్తమాటలు వినడానికి బాగుంటాయని, కానీ వాటితో ప్రయోజనం లేదని క్రమంగా ప్రజలు గ్రహిస్తారని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చాక వేగంగా ఎదిగేందుకు పలు అవకాశాలు వచ్చినా ఉపయోగించుకోలేదని ఆయన పరోక్షంగా గత ప్రభుత్వాలను విమర్శించారు. కానీ ప్రస్తుతం భారత్ దూసుకుపోయేందుకు తగిన సమయం వచ్చిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment