దేశ స్వాతంత్య్రం కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. ఎంతోమంది తమ ప్రాణాలను త్యాగం చేశారు. ఎందరి త్యాగాల ఫలితంగానో బానిసత్వపు సంకెళ్లు తెంచుకున్న భారతమాతకు దేశ ప్రజలంతా జేజేలు పలికారు. అయితే కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణంలో మాత్రం భారతమాత విగ్రహాన్ని ఏర్పాటు చేసి నిత్యం పూజించారు. తరువాతి కాలంలో ఆలయాన్ని నిర్మించారు. నిత్యం భరతమాతకు పూజలు చేయడం, ఏటా జయంతి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. భరతమాతకు ఇలా ఓ ఆలయాన్ని నిర్మించి దాదాపు డెబ్భై ఏళ్లయింది. వివరాల్లోకి వెళితే బిచ్కుంద మండల కేంద్రంలో బుర్రి గంగారాం, అల్లి పోశెట్టి, మంగలి రామన్న, హకీం నారాయణ తదితరులు మంచి స్నేహితులే కాదు, దేశభక్తులు కూడా. వీరు తమ గ్రామంలో భరతమాత విగ్రహం పెట్టాలని భావించి స్వయంగా సిమెంటుతో విగ్రహాన్ని రూపొందించి 1949లో గ్రామంలో ప్రతిష్టించారు. చిన్న కుటీరం ఏర్పాటు చేశారు. కుటీరం పక్కనే ఉన్న మార్కండేయ విగ్రహాలను అక్కడే ప్రతిష్టించారు. అరుదైన విగ్రహాలు కావడంతో భక్తులు నిత్యం పూజలు చేసేవారు. అది చూసి కొందరు ఔత్సాహికులు, దాతలు ముందుకు వచ్చి మార్కండేయ ఆలయం, భరతమాత ఆలయాల నిర్మాణానికి పూనుకున్నారు. 1982లో భరతమాత, మార్కండేయ ఆలయాలు నిర్మించారు. కొత్తగా విగ్రహాలను సుందరంగా తయారు చేయించి ప్రతిష్టించారు. విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారని ఆలయ సమీపంలో నివసించే పరమేశ్వర్ ‘సాక్షి’కి తెలిపారు. దేశభక్తితోనే ఆలయ నిర్మాణం జరిగిందని వివరించారు.
ఆలయంలో నిత్యం పూజలు...
మార్కండేయ మందిరంతోపాటు భరతమాత మందిరంలో నిత్యం పూజలు నిర్వహిస్తారు. గ్రామస్తులే కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన వారు సైతం ఆలయానికి వచ్చి పూజలు చేస్తారు. ఆలయ పూజారి నిత్యం ఆలయాన్ని శుభ్రం చేసి అర్చనలు చేస్తారు. ఏటా భరతమాత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో ఉయ్యాల సేవ, అభిషేకాలు, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. బిచ్కుందలో భరతమాత ఆలయం ఉందని తెలిసిన దూర ప్రాంతాల ప్రజలు సైతం అMý్కడికి వచ్చి వెళుతుంటారు. గ్రామస్తులు చాలా మంది ఆలయానికి నిత్యం వెళ్లి పూజలు చేస్తారు. కొందరు స్వాతంత్య్ర దినోత్సవం రోజున, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తారు.
– సేపూరి వేణుగోపాలాచారి, సాక్షి, కామారెడ్డి
భరతమాతకు జేజేలు... బంగరు తల్లికి జేజేలు
Published Wed, Aug 15 2018 2:02 AM | Last Updated on Wed, Aug 15 2018 2:02 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment