సాక్షి ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్..భారతదేశంలోనే అతిపెద్ద సంస్థానం. తెలుగు, ఉర్దూ, మరాఠీ, కన్నడ భాషల సమ్మేళనంతో ఓ వెలుగు వెలిగింది. 1724లో నిజాం ఉల్‌ముల్క్ స్వతంత్రుడిగా ప్రకటించుకొని నిజాంపాలనకు శ్రీకారం చుట్టగా, 1948 వరకూ ఆయన వారసులు పరిపాలించారు. అయితే 1947 తర్వాత హైదరాబాద్‌ను స్వతంత్ర దేశంగా ఉంచాలని నిజాం ఆర్మీ ఛీప్ ఇద్రూస్, పాకిస్తాన్‌లో కలపాలని నిజాం పెంచి పోషించిన రజాకార్ల చీఫ్ ఖాసీం రజ్వీ చూస్తే...సంస్థానంలో రైతుకూలీ రాజ్యం కోసం కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో రావి నారాయణరెడ్డి పావులు కదిపారు.
చేయి దాటిపోయే పరిస్థితి రావడంతో భారత సైన్యాలు జనరల్ జయంత్‌నాథ్ చౌదరి ఆధ్వర్యంలో అపరేషన్ పోలోతో 1948, సెప్టెంబర్ 17న హైదరాబాద్‌ను భారత యూనియన్‌లో విలీనం చేశాయి. నిజాం ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు ఇద్రూస్, ఖాసీం రజ్వీలు, పడగొట్టేందుకు జయంత్‌నాథ్, నారాయణరెడ్డి ఆధ్వర్యంలోని సేనలు కారణమయ్యాయి.
ఆపరేషన్.. హైదరాబాద్
భారతదేశమంతా 1947 ఆగస్టు 15న స్వాతంత్యం వస్తే ..హైదరాబాద్ సంస్థానం నిజాం రజకార్ల ఆగడాలతో అట్టుడికిపోయింది. నిజాం రాజు ఉస్మాన్ తాను స్వతంత్ర దేశంగానే ఉండాలని కోరుకోగా, అది కుదరకపోతే పాకిస్తాన్‌తో విలీనం కోసం చేస్తున్న ఎత్తుగడలను భారత ప్రభుత్వం పసిగట్టి 1948, సెప్టెంబర్ 13న మిలటరీ ఆపరేషన్‌ను మొదలుపెట్టి కేవలం ఐదు రోజుల్లో పూర్తి చేసింది. 16వ తేదీ నాటికి వాస్తవ పరిస్థితి నిజాంకు అర్థమైంది. 2,727 మంది రజాకార్లను భారత సైన్యాలు హతమార్చగా, మరో 4వేల మందిని బంధీలుగా పట్టుకున్నాయి.
పరిస్థితిని గమనించిన నిజాం చీఫ్ ఇద్రూస్ లొంగిపోవాలని చేసిన సూచన మేరకు ఆ రోజు సాయంత్రమే తొలుత ప్రధానమంత్రి మీర్ లాయక్ అలీ రేడియో స్టేషన్‌కు వెళ్లి తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మరుసటి రోజు అంటే..సెప్టెంబర్ 17న సాయంత్రానికి భారత ప్రభుత్వ ప్రతినిధి మున్షీ ఆదేశం మేరకు మీర్ ఉస్మాన్ అలీఖాన్ సెతం దక్కన్ రేడియో ద్వారా హైదరాబాద్ సైన్యం తరఫున కాల్పుల విరమణ చేస్తున్నామని, యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు ఇచ్చిన ఫిర్యాదు వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. దీంతో హైదరాబాద్ సంస్థానం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది.
రైతాంగ సేనాని.. రావి
ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేక సిరాతో లిఖించిన రైతుకూలీల పోరాటాన్ని ముందుకు నడిపిన సేనాని రావి నారాయణరెడ్డి. రజాకార్లు, నిజాం సామంతులైన దేశ్‌ముఖ్‌ల ఆగడాలను ఎదుర్కొ నేందుకు సాయుధ పోరాటానికి ఝంగ్ సైరన్ ఊదారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో మెజారి టీ ప్రాంతాల్లో ప్రజా ప్రభుత్వాలు ఏర్పడి సమాంతర పాలన సాగించారు.
ఒక దశంలో కమ్యూనిస్టులు సంస్థానమంతా విస్తరిస్తారన్న వార్తల నేపథ్యంలోనే భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో అమలు చేసింది. రైతాంగ పోరాటమే లేకపోతే హైదరాబాద్ సంస్థానం భారతదేశ గుండెల మీద కుంపటిలా తయారయ్యేది. కశ్మీర్‌లా నిత్యం రావణకాష్టం రగిలించేది..సాయుధ పోరాటం దేశ స్వతంత్ర, సమైక్యతకు కారణమైందని రావి తన ఆత్మకథలో రాసుకున్నారు.
ఆపరేషన్ పోలో.. జయంత్‌నాథ్
‘తక్కువ రక్తపాతంతో మన విజయయాత్ర ముందుకు వెళ్లాలి. శత్రువు వ్యూహం మేరకు మన ప్రతివ్యూహం ఉండాలి. మనం చేస్తున్న ఆపరేషన్ భూభాగంతోపాటు మనుషుల్ని కలిపేదిగా ఉండాలి’ అంటూ తన సైన్యాలకు దిశా నిర్దేశనం చేసిన ఆపరేషన్ పోలో చీఫ్ జయంత్‌నాథ్ చౌదరి ఆధ్వర్యంలో జాతీయ పతాకం తొలిసారిగా ఇక్కడ రెపరెపలాడింది.
జయంత్ 1928లో సైన్యంలో చేరి 1966లో ఇండియన్ ఆర్మీ చీఫ్‌గా ఉద్యోగ విరమణ చేశారు. హైదరాబాద్ సంస్థానంపై ఐదురోజుల్లోనే ఆపరేషన్ పూర్తి చేసిన జయంత్ హైదరాబాద్ స్టేట్‌కు తొలి మిలటరీ గవర్నర్‌గా కూడా పనిచేశారు. బెంగాల్‌లో పుట్టిన జయంత్, కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసిన డబ్ల్యూసీ బెనర్జీ మనువడే. చౌదరి అత్యున్నత సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మ విభూషణ్‌తో సత్కరించింది.
పాకిస్తాన్ కోసం.. రజ్వీ
ఖాసీం రజ్వీ..పుట్టి పెరిగింది ఉత్తరప్రదేశ్ లోని లక్నో. లా చదివి హైదరాబాద్‌కు మకాం మార్చాడు. తన సమీప బంధువు నిజాం ఆర్మీలో ఉండటంతో అతి తక్కువ సమయంలోనే ఉన్నత స్థానాలకు చేరుకున్నాడు. 1944లో ఇతెహైదూల్ ముస్లిమీన్ వ్యవస్థాపకుడు బహుదూర్‌యార్ ఝంగ్ మరణంతో ఆ సంస్థ బాధ్యతలు తీసు కొని తన ఆస్తులన్నీ సంస్థ పేరుతో రాసిచ్చాడు.
నిజాం రాజును దైవాంశ సంభూతుడిగా అభివర్ణిస్తూ సిద్ధిఖీ యే దక్కన్‌గా రెచ్చిపోయి రజాకార్ల సంస్థ ఏర్పాటు చేసి నిజాం రాజ్యంలో రక్తపుటేరులు పారించారు. 1948 సెప్టెంబర్ 17న అరెస్ట్ అయ్యి 1957 వరకు జైలు జీవితం గడిìపాడు. విడుదల చేస్తే తాను పాకిస్తాన్‌లో తలదాచుకుంటానన్న షరతుతో కరాచీ వెళ్లిపోయాడు. 1970 జనవరి 15న చని పోయాడు. రజ్వీ వారసులు ఇప్పుడు పాకిస్తాన్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు.
స్వతంత్ర రాజ్యం కోసం.. ఇద్రూస్
ఇండియా ఆర్మీ చీఫ్‌గా కూడా పనిచేసే సామ ర్థ్యం ఉందంటూ బ్రిటి ష్ వైస్రాయ్ లార్డ్ వేవెల్ హైదరాబాద్ స్టేట్ ఫోర్స్ చీఫ్ సయ్యద్ అహ్మద్ ఈఎల్ ఇద్రూస్‌ను ప్రశంసించాడు. నిజమే మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు నమ్మిన బంటుగా హైదరాబాద్ స్టేట్ ఫోర్స్‌కు సుదీర్ఘకాలం కమాండర్ ఇన్ చీఫ్‌గా పనిచేశాడు. ఇద్రూస్ పూర్వీకులు యెమన్ నుంచి వచ్చి నిజాం సైన్యంలో వివిధ హోదాల్లో పనిచేశారు.
ఇద్రూస్1913లో హైదరా బాద్ స్టేట్ ఆర్మీలో చేరి 1948 వరకు కొనసా గారు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లో బ్రిటిష్ మిత్రదేశాలకు మద్దతుగా హైదరాబాద్ లాన్సర్స్ తరఫున పాలస్తీనాతో పాటు వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. భారత్‌కు స్వాతంత్య్రం రాగానే, హైదరాబాద్ స్టేట్‌ను స్వతంత్ర రాజ్యంగా ఉంచాలనే లక్ష్యంతో యూరప్ వెళ్లి అత్యాధునిక ఆయుధ సంపత్తిని కొనుగోలు చేసే యత్నం చేసి విఫలమయ్యాడు.
ఆపరేషన్ పోలో చీఫ్ జేఎన్.చౌదరి సమక్షంలో లొంగిపోయే కొన్ని క్షణాల ముందు ‘‘ ఇది జీవితంలో ఒక ఆట, మేం చేయాల్సింది అంతా చేశాం’’ అంటూ అంతర్జాతీయ జర్నలిస్ట్‌తో మాట్లాడుతూ తమ లొంగుబాటు ప్రకటించారు. అయితే నిజాం ప్రధానమంత్రి లాయక్ అలీని గృహ నిర్బంధం నుంచి తప్పించిన కేసులో ఇద్రూస్ అరెస్ట్ అయ్యి విడుదలయ్యారు. కుటుంబసభ్యులంతా పాకిస్తాన్‌లో స్థిరపడగా, ఇద్రూస్ మాత్రం బెంగళూరులో చిన్నగదిలో చివరి రోజులు గడిపాడు. అనారోగ్య సమస్యలతో 1962లో చనిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment